దాయాది దేశం పాకిస్తాన్ ప్రభవించిన సుముహూర్తం ఏమో కానీ, 75 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం పురిటినొప్పుల్లోనే ఉంది. ఇన్ని దశాబ్దాలలో ఏ ఒక్క ప్రధాన మంత్రీ పూర్తి పదవీకాలం గద్దెపై లేనే లేరు. ఆ సంప్రదాయమే మూడేళ్ళ పైచిలుకు క్రితం గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్‌కూ పునరావృతమైంది. కొద్ది వారాల నాటకీయ పరిణామాలు, అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ పదవీచ్యుతులై, ఆ దేశ ప్రధాన మంత్రి పీఠంపై కొత్త నేత కొలువు తీరాడు. 342 మంది సభ్యుల పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల అభ్యర్థిగా 174 ఓట్లతో విశ్వాసం నిలుపుకొని, సోమవారం ఆ దేశ 23వ ప్రధాని అయ్యారు – పీఎంఎల్ (ఎన్) నేత షెబాజ్ షరీఫ్. గతంలో ఇమ్రాన్ ప్రవచించిన ‘నయా పాకిస్తాన్’ను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెబాజైనా తీసుకురాగలుగుతారా?
క్రికెటర్‌గా మొదలై రాజకీయ నాయకుడై, 2018 జూలైలో ప్రధాని పీఠమెక్కిన ఇమ్రాన్ కథ ఎక్కడో మొదలై ఎలాగో ముగిసింది. అవినీతి రహిత, పేదసాదల అనుకూల, వ్యాపార స్నేహశీల ‘నయా పాకిస్తాన్’ తెస్తానన్నది ఆయన చెప్పిన మాట. 50 లక్షల చౌక గృహాల నిర్మాణం, కోటి ఉద్యోగాల కల్పన ఆయన చేసిన వాగ్దానం. కానీ, 51 వాగ్దానాల మేనిఫెస్టోలో రెండే పూర్తి చేశారు. మూడున్నరేళ్ళకే జనం ఆశలు కుప్పకూలాయి. 12.7 శాతం ద్రవ్యోల్బణం, 20 శాతం ఆహారో ల్బణం, సగానికి పడిపోయిన రూపాయి విలువ – ఇమ్రాన్ హయాం ఘనతలు. సైన్యం అండతో అడ్డదోవలో, ఎలెక్టెడ్ పీఎంగా కాక ‘సెలెక్టెడ్ పీఎం’గా సంకీర్ణ ప్రభుత్వపు గద్దెనెక్కారనే పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ చివరకు అదే సైన్యంతో సున్నం పెట్టుకొని, పదవి పోగొట్టుకోవడం విచిత్రం. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో ఓటమి పాలై, పదవీభ్రష్టుడైన తొలి పాకిస్తానీ పీఎంగా చరిత్ర కెక్కారు. పదవీ గండం తప్పదని తెలిశాక, తనకు మెజారిటీ లేని నేషనల్ అసెంబ్లీని రద్దు చేయమని అధ్యక్షుణ్ణి కోరడం సహా రకరకాల గూగ్లీలు విసిరారు. అవేవీ పారక, పెవిలియన్ దారి పట్టారు.
1996లో రాజకీయాల్లోకి వచ్చి, ‘పాకిస్తాన్ తెహ్రీక్–ఎ– ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీని స్థాపించి, 22 ఏళ్ళు అనేక రాజకీయ పోరాటాలు చేసి, ప్రధాని పీఠమెక్కిన ఇమ్రాన్ పదవీచ్యుతికి ఆయన స్వీయలోపాలే కారణం. ఆఖరి బంతి దాకా ఆడకుండానే, పిచ్ మీది వికెట్లు పీకేసి వెళ్ళిపోయినట్టుగా ఆదివారం అవిశ్వాస తీర్మానం రోజున కానీ, సోమవారం కొత్త పీఎం ఎన్నిక వేళ కానీ ఇమ్రాన్ పార్లమెంట్‌లో కనిపించనే లేదు. ఆయన తన ప్రయత్నాలతో పాకిస్తాన్‌ను మరింత అనిశ్చితిలోకీ, రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టారు. చివరకు దేశ సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చరిత్ర చూస్తే, 1973 ఏప్రిల్ 10న పాకిస్తాన్ పార్లమెంట్ తమ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది. సరిగ్గా 49 ఏళ్ళ తరువాత అదే రోజున అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి పాకిస్తానీ ప్రధాని అయ్యారు ఇమ్రాన్. ఆయన మాత్రం ఇప్పటికీ తన పదవీ భ్రష్టతలో అమెరికన్ విదేశీ హస్తం సహా ఆరోపణలు, నిరసనలతో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రజల్లో అమరవీరుడు అనిపించుకొని, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు.
పాకిస్తానీ ప్రజాస్వామ్యం ఆది నుంచీ గిడసబారిన బోన్‌సాయ్ చెట్టే! స్వాతంత్య్రం సిద్ధించిన 1947 నుంచి ఇప్పటి దాకా 75 ఏళ్ళ చరిత్రలో పాకిస్తాన్ 29 మంది ప్రధాన మంత్రులను చూసింది. వారిలో ఏ ఒక్కరూ తమ పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ఒకరైతే, ఏకంగా ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ పదవి చేపట్టారంటే ప్రధాన మంత్రి పీఠం ఎంత ఊగిసలాడుతోందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి ఆరోపణలు, సైనిక తిరుగుబాట్లు, అధికార పార్టీలలో అంతర్గత తగాదాలతో బలవంతపు రాజీనామాల లాంటి కారణాలతో 18 సార్లు పాకిస్తానీ పీఎంలు పదవీచ్యుతులయ్యారు. ఒక్క 1993లోనే ఏకంగా అయిదుగురు మారారు. దేశ తొలి ప్రధాని లియాఖత్ అలీఖాన్ ఒక్కరే అధికకాలం (4ఏళ్ళ 2నెలలు) పదవిలో ఉన్నారు. ఆయనా 1951 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు.
షెబాజ్ కుటుంబ మూలాలు అవిభక్త భారత్‌లో అమృత్‌సర్ సమీపంలోని జతీ ఉమ్రాలో ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే పాకిస్తాన్‌కు తరలిపోయినా, ఆ గ్రామానికీ, గ్రామస్థు లకు సాయం చేయడంలో 70 ఏళ్ళ షెబాజ్ తదితరులు అనుబంధం వీడలేదు. రాజకీయ, దౌత్య, వాణిజ్య బంధాలతో అంతర్జాతీయంగానూ భారత్‌కూ స్నేహ హస్తం అందిస్తారా? పాకిస్తాన్ అనేక సమస్యలతో సతమతమవుతున్న వేళ షెబాజ్‌కు ఇప్పుడు దక్కినది ముళ్ళ కిరీటమే! అప్పులు పేరుకుపోయాయి. డాలర్‌కు 190 రూపాయల స్థాయికి పాకిస్తానీ రూపాయి పడిపోయింది.
ఒక్క మాటలో పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అంతర్గత తీవ్రవాదం పాక్‌కు ఉన్న మరో సమస్య. అమెరికా సహా అనేక దేశాలతో విదేశాంగ సంబంధాలూ ఆశాజనకంగా లేవు. ఈ సమస్యల్ని షెబాజ్ ఎలా ఎదుర్కొంటారో? ఇమ్రాన్‌కు భిన్నంగా అమెరికాతో స్నేహం కోరుతున్న ఈ కొత్త ప్రధాని సైతం పాకిస్తాన్ సైనిక నేత జనరల్ బాజ్వా చేతిలో కీలుబొమ్మ అని ప్రచారం. పైపెచ్చు, షెబాజ్ మీదా అనేక అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులున్నాయి. ఇలాంటి వ్యక్తిని పీఎంగా ఎలా ఎన్నుకుంటారంటున్న ఇమ్రాన్, ఆయన పార్టీ సభ్యులు పార్లమెంట్ నుంచి రాజీనామాల బాట పడుతున్నట్టు వార్త. అంటే, వచ్చే ఏడాది జరగాల్సిన జనరల్ ఎన్నికల తతంగం మరింత త్వరగానే తప్పేలా లేదు. ప్రభుత్వాల ఏర్పాటు, కూలిపోవడం ఏదైనా సరే ప్రజాకాంక్షలకు తగ్గట్టు జరిగితేనే ఏ ప్రజాస్వామ్యానికైనా మంచిది. లేదంటే, ఎవరు పీఠమెక్కినా అదే పాత కథ పునరావృతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment