ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత షెహబాజ్ షరీఫ్.. మొదటి సారి ప్రధాని అయ్యారు.
షెహబాజ్‌షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్ల సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు.
ఇక.. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి.
దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి.. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్‌ను ప్రకటించింది. తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment