
రాష్ట్ర శాసనసభ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగించాలని కూడా శుక్రవారం రాష్ర్టపతికి సిఫారసు చేసింది. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టపతి పాలన విధించిన రెండు నెలల్లోగా అందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంది. ఈ నెల 30తో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనకు రెండు నెలల గడువు ముగుస్తోంది. ఆలోగా పార్లమెంట్ ఆమోదం పొందలేకపోతే అసెంబ్లీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నేతలంతా తలమునకలవడంతో ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరిచే పరిస్థితి లేదు. ఇందుకు కేంద్రం సానుకూలంగా లేదు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా మంత్రివర్గం ముందు హాజరై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అన్నింటినీ బేరీజు వేసుకున్న కేంద్ర కేబినెట్.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా అసెంబ్లీ రద్దుకే మొగ్గు చూపింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ రాష్ర్టపతి మళ్లీ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్లమెంట్ ఆమోదానికి మరో రెండు నెలల గడువు లభిస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త శాసనసభలు కొలువు తీరనున్నాయి. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపే పూర్తి కానుండటంతో ‘రెండు నెలల’ నిబంధన అడ్డంకి కాబోదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శాసనసభ రద్దవుతుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలుకానున్నారు. కేబినెట్ తాజా సిఫారసులకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశముంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విషయంలో నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసింది. ఈ అంశంపై ఇంకా చర్చించాల్సి ఉందని, మరింత సమాచారం తీసుకుని వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.