recommend
-
ఐదు హైకోర్టులకు 37 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: అలహాబాద్, రాజస్తాన్, కేరళ, గుజరాత్, బొంబాయి హైకోర్టుల్లో పనిచేస్తున్న 37 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ జడ్జీల్లో కొందరిపై ఫిర్యాదులు అందినప్పటికీ వారిపై చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ తమకు కన్పించలేదని కొలీజియం తెలిపింది. ఈ మేరకు కొలీజియం చేసిన సిఫార్సులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. -
మరణశిక్షను రద్దు చేయాలి!
-
మరణశిక్షను రద్దు చేయాలి!
సత్వరమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి * లా కమిషన్ సిఫార్సు; ఉగ్ర నేరాలకు మినహాయింపు * ఉరి శిక్ష రద్దు సరికాదన్న కమిషన్ సభ్యురాలు జస్టిస్ ఉషా మెహ్రా న్యూఢిల్లీ: మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణ శిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. ఆ శిక్ష జీవితఖైదును మించిన ఫలితం ఇవ్వబోదని పేర్కొంది. అయితే, ఉగ్రవాద కేసులు, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దు చేయాలా? కొనసాగించాలా? అనే విషయంపై విస్తృత, సమగ్ర సంప్రదింపుల తర్వాత 20వ లా కమిషన్ సోమవారం తుది నివేదిక విడుదల చేసింది. లా కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు ఉరిశిక్ష రద్దుకు మొగ్గు చూపగా, కమిషన్‌లోని శాశ్వత సభ్యుల్లో ఒకరైన రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ ఉషా మెహ్రాతో పాటు ప్రభుత్వ ప్రతినిధులైన ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పీకే మల్హోత్ర(న్యాయ శాఖ కార్యదర్శి), సంజయ్ సింగ్(లెజిస్లేటివ్ సెక్రటరీ) మాత్రం ఉరిశిక్షను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ భిన్నాభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చారు. మరణశిక్షను కొనసాగించడం రాజ్యాంగపరమైన క్లిష్టమైన ప్రశ్నలను సంధిస్తోందని కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. న్యాయం జరగకపోవడం, న్యాయప్రక్రియలో పొరపాట్లు దొర్లడం, నేరన్యాయ వ్యవస్థలో న్యాయసేవలు పొందలేని పేదలు, బడుగు వర్గాల దుస్థితి.. మొదలైన ప్రశ్నలను ఉరిశిక్ష కొనసాగింపు లేవనెత్తుతోందని అన్నారు. ఉరిశిక్షను రద్దు చేయడం అత్యవసరమేనన్న కమిషన్.. ఆ ప్రక్రియ ఎలా జరగాలనేదానిపై కచ్చితమైన, స్పష్టమైన పద్ధతిని సూచించలేదు. స్వచ్ఛంద నిషేధం (మారటోరియం) విధించడం నుంచి ఉరిశిక్ష రద్దుకు సంబంధించి సమగ్రబిల్లును రూపొందించడం వరకు చాలా మార్గాలున్నాయంది. వీటిలో ప్రత్యేకంగా ఏ మార్గాన్నీ తాము సిఫారసు చేయడం లేదన్న కమిషన్.. సత్వర, పూర్వ స్థితికి తీసుకువచ్చే వీళ్లేని, పూర్తి స్థాయి రద్దును మాత్రం సిఫార్సు చేస్తున్నామని పేర్కొంది. ఏ పద్దతిలో ఉరిని రద్దు చేయాలనే విషయంపై అతి త్వరలో కూలంకష చర్చ జరగాలని సూచించింది. ఉగ్రవాద నేరాలకు ఉరిశిక్ష సమర్థనీయమన్న కమిషన్.. ఉగ్రవాదాన్ని ఇతర నేరాల నుంచి వేరుపర్చే స్పష్టమైన విభేదాంశం శిక్షాస్మృతిలో లేదని పేర్కొంది. జాతీయ భద్రతకు సంబంధించి దీన్ని మరణ శిక్షకు అర్హమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఉరిశిక్షకు సంబంధించి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యక్తపర్చిన అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చారు. మరణశిక్ష విధించిన నేరాలకు.. ప్రత్యామ్నాయ జీవిత ఖైదు పడిన నేరాలకు మధ్య తేడాలను గుర్తించడం కష్టమన్న సుప్రీం అభిప్రాయాన్ని గుర్తు చేశారు. క్షమాభిక్ష ప్రకటించే విషయంలో కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన పొరపాట్లను, లోపాలను, న్యాయపర తప్పులను పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎత్తి చూపిన విషయాన్ని ప్రస్తావించారు. నిబంధనల ఉల్లంఘన, విచక్షణను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల క్షమాభిక్ష ప్రక్రియ బలహీనపడిందని, దాంతో మరణశిక్షను సమర్థించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. క్షమాభిక్ష విషయంలో అర్హులను కాపాడటంలో చట్టంలోని రక్షణ మార్గాలు విఫలమయ్యాయని అన్నారు. ఉరి రద్దు వద్దు.. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.. అత్యంత హేయమైన నేరాలకు ఉరిశిక్ష విధించడంపై సంపూర్ణ నిషేధం విధించడం సరైన చర్య కాదన్న అభిప్రాయం కలుగుతోందని జస్టిస్ ఉషా మెహ్రా పేర్కొన్నారు. అత్యంత హేయమైన నేరాల్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలని గొప్ప విజ్ఞతతో పార్లమెంటు నిర్ణయించిందని, ఆ శిక్షను కొనసాగించడమే ఉత్తమమని న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రా అభిప్రాయపడ్డారు. అత్యంత చైతన్యశీల న్యాయవ్యవస్థ కలిగిన భారతదేశంలో న్యాయమూర్తులు గొప్ప విచక్షణతో, అర్హత కలిగిన నేరాలకు మాత్రమే మరణ శిక్ష విధిస్తున్నారని, వారి విజ్ఞతను గౌరవించాలని, అందువల్ల ఉరి శిక్ష రద్దు అవసరం లేదని లెజిస్లేటివ్ సెక్రటరీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. లా కమిషన్‌లో ఒక చైర్మన్, ముగ్గురు శాశ్వత సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు, ముగ్గురు తాత్కాలిక సభ్యులు.. మొత్తం 9 మంది సభ్యులుంటారు. -
లలిత్ మోదీ కోసం ప్రయాణ పత్రాలు కోరలేదు
సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేసినట్లు వచ్చిన ఆరోపణల విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను సమర్థించుకున్నారు. మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను ఎవరికీ విజ్ఞప్తి లేదా సిఫార్సు చేయలేదని శనివారం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తన రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆమె పలు ట్వీట్లు చేశారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతించాలంటూ బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్‌తో తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. మానవతా దృష్టితోనే మోదీకి సాయం చేసినట్లు గతంలో చేసిన స్పందిస్తూ ‘బ్రిటన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా ఆ దేశ ప్రభుత్వానికే వదిలేశాను. దీనిపై తొలి రోజునే ట్వీట్ చేశా. నేను ప్రతిరోజూ ప్రజలకు సాయం చేస్తా. అది కూడా ఒకే ట్వీట్ ద్వారా. ఆవిడ (లలిత్ మోదీ భార్య) గత 17 ఏళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు కేన్సర్ తిరగబెట్టడం ఇది పదోసారి’ అని సుష్మ పేర్కొన్నారు. -
కోర్సులేకున్నా పోస్టింగులు
జిల్లాలో కీలక నేత సిఫార్సే అర్హత ఏయూ పెద్దల నిర్వాకం ఇదీ దూరవిద్యావిభాగంలో అస్మదీయులకు అందలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే చివరిపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది ఏయూలో పోస్టిం గుల తీరు. పెద్దలు మనవాళ్తై కోర్సులు లేకపోయినా పోస్టులు మాత్రం కట్టబెట్టేస్తున్నారు. మంత్రివర్యుల సిఫార్సు... ఏయూ పెద్దల సపోర్టు ఉంటే ఇంకేం... పోస్టుల భర్తీ అన్నది పూర్తి ఫార్సుగా తయారైపోతోంది. ఏయూ దూరవిద్యా విభాగం కేంద్రంగా అస్మదీయులకు యథేచ్ఛగా పోస్టుల పందేరం సాగుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది...జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ ప్రభుత్వ పెద్ద అనుగ్రహానికి పాత్రులు కావడమే ఏయూ పెద్దల లక్ష్యంగా మారింది. గతంలోఅడ్డగోలుగా మూడు పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ జరిపించింది. అయినా వ్యవహారం మాత్రం తేలలేదు. కేవలం ఏయూ పెద్దలను తన దారికి తెచ్చుకునేందుకే సదరు పెద్ద ఈ వ్యవహారాన్ని వాడుకున్నారని తేటతెల్లమైంది. తరువాత ఆయన చెప్పిందే ఏయూలో వేదంగా మారింది. ఆ నివేదికను బూచిగా చూపి అస్మదీయులతో ఏయూను నింపేస్తున్నారు. తాజాగా ఆ ప్రభుత్వ పెద్ద తనవారికి ఏయూలో పోస్టులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. కోర్సు లేకపోయినా! ప్రభుత్వ పెద్ద సిఫార్సుతో ఏయూ పెద్దలు తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థి సబ్జెక్ట్ జాగ్రఫీ. ప్రస్తుతం జాగ్రఫీ విభాగంలో ఖాళీలు లేవు. దాంతో ఏయూ పెద్దలు మరో ఎత్తుగడ వేశారు. దూరవిద్యావిభాగంలో ఆయన్ని కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు. కాకపోతే అందుకోసం వెబ్సైట్లోనోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించి కాస్త పద్దతిగానే హడావుడి చేశారు. కానీ అసలు కోర్సే లేని సబ్జెక్ట్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు నియమించారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఈ నియామకంతోవిద్యార్థులకు ఉపయోగం లేదు. పైగా ఏయూకు ఆర్థిక భారం. గతంలో కూడా! జాగ్రఫీలోనేకాదు కొన్ని నెలల క్రితం సోషల్‌వర్క్ విభాగంలో కూడా కాంట్రాక్టు విధానంలో ఓ మహిళను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించారు. ఆమె సర్వీసును రెన్యువల్ కూడా చేశారు. ఇలా కోర్సులు లేకపోయినా పోస్టింగులు కట్టబెడుతున్నవారికి ఇతరత్రా పనులకు ఉపయోగించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ కోర్సులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆ కోర్సులు లేవు. దాంతో వారిని అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకనో మరోదానికనో ఉపయోగించుకోవాలన్నది ఏయూ పెద్దల ఉద్దేశం. ముందు ఉద్యోగం ఇచ్చేసి ... తరువాత ఏదో బాధ్యత అప్పగిస్తారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు వాడుకుంటాం: రిజిస్ట్రార్ ఈ వ్యవహారంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా కోర్సులు లేకపోయినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిన విషయాన్ని ధ్రువీకరించారు. వారిని దూర విద్యావిభాగంలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పనుల్లో ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. -
భారతరత్నకు ధ్యాన్‌చంద్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డుకు కేంద్ర హోం శాఖ హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీరెన్ రిజ్జు ఈ విషయాన్ని లోక్‌సభలో తెలిపారు. వివిధ వర్గాల నుంచి వినతులను పరిశీలించిన అనంతరం భారతరత్న అవార్డుకు ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేస్తూ ప్రధాని కార్యాలయానికి పంపినట్టు చెప్పారు. అయితే ఈ విషయంపై చర్చకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని కార్యాలయం సహాయం మంత్రి జితేందర్ సింగ్ తిరస్కరిచారు. గతేడాదే కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్‌చంద్ పేరును సిఫారసు చేసినా చివర్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ప్రకటించారు. ప్రపంచ అత్యున్నత హాకీ ఆటగాడిగా మన్ననలందుకున్న ధ్యాన్‌చంద్ 1905లో జన్మించారు. ధ్యాన్‌చంద్ ప్రాతినిధ్యం వహించిన కాలంలో 1928-1936 మధ్య భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. అప్పట్లో భారత్ ప్రపంచ హాకీని శాసించింది. 1948లో రిటైరయిన ధ్యాన్‌చంద్ పద్మభూషణ్ సహా పలు అవార్డులు స్వీకరించారు. 79 ఏళ్ల వయసులో ధ్యాన్‌చంద్ 1979లో కన్నుమూశారు. కేంద్ర క్రీడల శాఖ ధ్యాన్‌చంద్ గౌరవార్థం ఆయన పేరు మీద అవార్డు స్థాపించింది. అంతేగాక హాకీ గ్రేట్ జన్మదినం ఆగస్టు 29ని జాతీయ క్రీడాదినంగా ప్రకటించారు. -
సుప్రీం జడ్జిగా ఉదయ్ లలిత్?
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సన్నిహితుడైన అమిత్‌షా తరఫున కీలక కేసుల్లో వాదించిన ప్రముఖ న్యాయవాది ఉదయ్ లలిత్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసింది. ఇంతకు ముందు కొలీజియం సూచించిన నలుగురిలో మాజీ ఏజీ అయిన గోపాల్ సుబ్రమణ్యంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తాజాగా ఉదయ్ లలిత్ పేరును కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి ఈ జాబితా ప్రధానికి, అనంతరం రాష్ట్రపతికి వెళుతుంది. ప్రముఖుల న్యాయవాది..: 58 ఏళ్ల ఉదయ్ లలిత్ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు మూడేళ్లు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశాక 1986లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది సోలీ సొరాబ్జీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. దేశం మొత్తాన్నీ కుదిపేసిన 2జీ కేసులో లలిత్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. గుజరాత్లో సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతిల బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరఫున ఉదయ్ లలిత్ వాదించారు. ఈ రెండు కేసుల్లోనూ అమిత్‌షా హత్య, కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. దీనితోపాటు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ జింకను వేటాడిన కేసు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై అవినీతి కేసు, తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల కేసులో, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ పుట్టినతేదీ వివాదం వంటి కీలక కేసుల్లో వారి తరఫున వాదనలు వినిపించారు. -
2013-14 రుణాలే మాఫీ?
సిఫారసు చేయనున్న కోటయ్య కమిటీ ఆ ఒక్క సంవత్సరంలో తీసుకున్న రుణాలు (25 వేల కోట్లు), బంగారం తాకట్టు రుణాలు (35 వేల కోట్లు) కలిపి రూ.60 వేల కోట్లు వీటిలో ఎంత భరిస్తారో ప్రభుత్వం చెబితే దానికి అనుగుణంగా పరిమితి విధింపు! కేవలం మహిళలు కుదవ పెట్టిన బంగారం రుణాల మాఫీనే వర్తింపజేస్తే రూ.10 వేల కోట్లే నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికి ఇవ్వనున్న కమిటీ హైదరాబాద్: రైతుల రుణ మాఫీ విషయంలో ప్రభుత్వంపై వీలైనంత మేరకు భారాన్ని తగ్గించే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు కలిపి రూ.60 వేల కోట్లుగా అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఎంతమేరకు ప్రభుత్వం భరించగలదో తేల్చితే, ఆ మేరకు రుణ మాఫీకి షరతులు, పరిమితులు విధించగలమని కోటయ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈమేరకు కమిటీ ప్రాథమిక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. రుణ మాఫీ విధివిధానాల రూపకల్పనపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమై, ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఆదివారం చంద్రబాబుకు సమర్పించనుంది. ఎటువంటి షరతులు లేకుండా ఇప్పటివరకు ఉన్న వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నీ కలిపితే రూ.87,612 కోట్లు మాఫీ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కోటయ్య కమిటీ మాత్రం అంత మేర రుణ మాఫీకి కాకుండా షరతులు విధిస్తూ పలు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం పంట రుణాలు రూ.25 వేల కోట్లు రైతులు తీసుకోగా వ్యవసాయానికి బంగారాన్ని కుదువపెట్టి తీసుకున్న రుణాలు రూ.35 వేల కోట్లుగా, మొత్తం రూ.60 వేల కోట్లుగా తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు భరిస్తుందో చెబితే అందుకు అనుగుణంగా లక్ష రూపాయల వరకా లేక లక్షన్నర వరకు మాఫీయా అనేది నిర్ణయిస్తామని కమిటీ పేర్కొననుంది. బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి మహిళల పేరు మీద మాత్రమే తీసుకున్న రుణాలైతే రూ.10 వేల కోట్లే ఉంటాయని కమిటీ లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో పంట రుణాలు రూ.25 వేల కోట్లు, మహిళల పేరు మీద బంగారంపై వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రూ.10 వేల కోట్లు మొత్తం రూ.35 వేల కోట్లు అవుతుందని నివేదికలో పేర్కొంది. మహిళా సంఘాల రుణాలకు రూ.50 వేల వరకు పరిమితి విధించాలన్న ఆలోచనను కూడా కోటయ్య కమిటీ చేసింది. చిన్న, సన్న కారు రైతులు, మధ్య తరగతి రైతులు అనే కేటగిరీలతో కూడా కోటయ్య కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. -
రాష్ట్ర శాసనసభ రద్దు
-
రాష్ట్ర శాసనసభ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగించాలని కూడా శుక్రవారం రాష్ర్టపతికి సిఫారసు చేసింది. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టపతి పాలన విధించిన రెండు నెలల్లోగా అందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంది. ఈ నెల 30తో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనకు రెండు నెలల గడువు ముగుస్తోంది. ఆలోగా పార్లమెంట్ ఆమోదం పొందలేకపోతే అసెంబ్లీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నేతలంతా తలమునకలవడంతో ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరిచే పరిస్థితి లేదు. ఇందుకు కేంద్రం సానుకూలంగా లేదు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా మంత్రివర్గం ముందు హాజరై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అన్నింటినీ బేరీజు వేసుకున్న కేంద్ర కేబినెట్.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా అసెంబ్లీ రద్దుకే మొగ్గు చూపింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ రాష్ర్టపతి మళ్లీ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్లమెంట్ ఆమోదానికి మరో రెండు నెలల గడువు లభిస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త శాసనసభలు కొలువు తీరనున్నాయి. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపే పూర్తి కానుండటంతో ‘రెండు నెలల’ నిబంధన అడ్డంకి కాబోదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శాసనసభ రద్దవుతుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలుకానున్నారు. కేబినెట్ తాజా సిఫారసులకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశముంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విషయంలో నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసింది. ఈ అంశంపై ఇంకా చర్చించాల్సి ఉందని, మరింత సమాచారం తీసుకుని వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.