సుప్రీం జడ్జిగా ఉదయ్ లలిత్?
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సన్నిహితుడైన అమిత్‌షా తరఫున కీలక కేసుల్లో వాదించిన ప్రముఖ న్యాయవాది ఉదయ్ లలిత్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసింది. ఇంతకు ముందు కొలీజియం సూచించిన నలుగురిలో మాజీ ఏజీ అయిన గోపాల్ సుబ్రమణ్యంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తాజాగా ఉదయ్ లలిత్ పేరును కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి ఈ జాబితా ప్రధానికి, అనంతరం రాష్ట్రపతికి వెళుతుంది.
ప్రముఖుల న్యాయవాది..: 58 ఏళ్ల ఉదయ్ లలిత్ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు మూడేళ్లు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశాక 1986లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది సోలీ సొరాబ్జీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. దేశం మొత్తాన్నీ కుదిపేసిన 2జీ కేసులో లలిత్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. గుజరాత్‌లో సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతిల బూటకపు ఎన్‌కౌంటర్ కేసుల్లో అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరఫున ఉదయ్ లలిత్ వాదించారు. ఈ రెండు కేసుల్లోనూ అమిత్‌షా హత్య, కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. దీనితోపాటు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ జింకను వేటాడిన కేసు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై అవినీతి కేసు, తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల కేసులో, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ పుట్టినతేదీ వివాదం వంటి కీలక కేసుల్లో వారి తరఫున వాదనలు వినిపించారు.