Uday Lalit
-
పిల్లలు 7 గంటలకే స్కూల్‌కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మన పిల్లలు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు వెళ్తుంటే అప్పుడు మనం 9 గంటలకే కోర్టుకు రాలేమా?’’అని సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ పేర్కొన్నారు. శుక్రవారం జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగినప్పుడు, 9 గంటలకు మనం ఎందుకు రాలేమని నేనెప్పుడూ అంటుంటాను. కోర్టుల్లో కార్యకలాపాలు ఉదయం 9.30 గంటలకు మొదలైతే మరీ మంచిది‘ అని ఆయన అన్నారు. ‘కోర్టులు ముందుగా మొదలైతే, విధులను కూడా తొందరగానే ముగించొచ్చు. తర్వాతి రోజు కేసుల అధ్యయనానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. ఆగస్ట్ చివరికి ఈ ఏర్పాట్లు మొదలవుతాయని భావిస్తున్నానని రొహత్గి పేర్కొనగా, ఇవి కొన్ని మాత్రమేనని జస్టిస్ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టుల్లో విచారణలు సాధారణంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంటాయి. ఆగస్ట్ 26వ తేదీన రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. -
సుప్రీం జడ్జిగా ఉదయ్ లలిత్?
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ సన్నిహితుడైన అమిత్‌షా తరఫున కీలక కేసుల్లో వాదించిన ప్రముఖ న్యాయవాది ఉదయ్ లలిత్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసింది. ఇంతకు ముందు కొలీజియం సూచించిన నలుగురిలో మాజీ ఏజీ అయిన గోపాల్ సుబ్రమణ్యంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. తాజాగా ఉదయ్ లలిత్ పేరును కేంద్ర న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి ఈ జాబితా ప్రధానికి, అనంతరం రాష్ట్రపతికి వెళుతుంది. ప్రముఖుల న్యాయవాది..: 58 ఏళ్ల ఉదయ్ లలిత్ 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు మూడేళ్లు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశాక 1986లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది సోలీ సొరాబ్జీ వద్ద సహాయకుడిగా పనిచేశారు. 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. దేశం మొత్తాన్నీ కుదిపేసిన 2జీ కేసులో లలిత్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. గుజరాత్లో సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతిల బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో అప్పటి గుజరాత్ హోం మంత్రి, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరఫున ఉదయ్ లలిత్ వాదించారు. ఈ రెండు కేసుల్లోనూ అమిత్‌షా హత్య, కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటుండడం గమనార్హం. దీనితోపాటు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ జింకను వేటాడిన కేసు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై అవినీతి కేసు, తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల కేసులో, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ పుట్టినతేదీ వివాదం వంటి కీలక కేసుల్లో వారి తరఫున వాదనలు వినిపించారు. -
అమిత్ షా న్యాయవాదికి సుప్రీం జడ్జిగా పదోన్నతి!!
సుప్రీంకోర్టులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉదయ్ యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరఫున రెండు క్రిమినల్ కేసుల్లో వాదించిన లలిత్‌కు ఇప్పుడీ పదోన్నతి లభించింది. గత నెలలోనే మాజీ సాలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం తిరస్కరించిన తర్వాత.. ఇప్పుడీ నియమాకానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. లలిత్‌తో పాటు మరో ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ న్యాయమూర్తుల పదవులకు ఎంపిక చేసింది. సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతిల బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో అమిత్ షా తరఫున ఉదయ్ లలిత్ వాదించారు. ఈ రెండు కేసుల్లోనూ హత్య, కుట్ర ఆరోపణలు అమిత్ షా మీద వచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులయ్యే న్యాయవాదుల్లో లలిత్ ఆరోవారు అవుతారు. 2జీ స్పెక్ట్ర్రం స్కాం కేసులో ఆయన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రఫుల్ చంద్ర పంత్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మోహన్ సాప్రే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. భానుమతి కూడా సుప్రీం న్యాయమూర్తులుగా వెళ్లనున్నారు.