
2013-14 రుణాలే మాఫీ?
సిఫారసు చేయనున్న కోటయ్య కమిటీ
ఆ ఒక్క సంవత్సరంలో తీసుకున్న రుణాలు (25 వేల కోట్లు), బంగారం తాకట్టు రుణాలు (35 వేల కోట్లు) కలిపి రూ.60 వేల కోట్లు
వీటిలో ఎంత భరిస్తారో ప్రభుత్వం చెబితే దానికి అనుగుణంగా పరిమితి విధింపు!
కేవలం మహిళలు కుదవ పెట్టిన బంగారం రుణాల మాఫీనే వర్తింపజేస్తే రూ.10 వేల కోట్లే
నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికి ఇవ్వనున్న కమిటీ
హైదరాబాద్: రైతుల రుణ మాఫీ విషయంలో ప్రభుత్వంపై వీలైనంత మేరకు భారాన్ని తగ్గించే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు కలిపి రూ.60 వేల కోట్లుగా అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఎంతమేరకు ప్రభుత్వం భరించగలదో తేల్చితే, ఆ మేరకు రుణ మాఫీకి షరతులు, పరిమితులు విధించగలమని కోటయ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈమేరకు కమిటీ ప్రాథమిక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. రుణ మాఫీ విధివిధానాల రూపకల్పనపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమై, ప్రాథమిక నివేదికను రూపొందించింది.
ఈ నివేదికను ఆదివారం చంద్రబాబుకు సమర్పించనుంది. ఎటువంటి షరతులు లేకుండా ఇప్పటివరకు ఉన్న వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నీ కలిపితే రూ.87,612 కోట్లు మాఫీ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కోటయ్య కమిటీ మాత్రం అంత మేర రుణ మాఫీకి కాకుండా షరతులు విధిస్తూ పలు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం పంట రుణాలు రూ.25 వేల కోట్లు రైతులు తీసుకోగా వ్యవసాయానికి బంగారాన్ని కుదువపెట్టి తీసుకున్న రుణాలు రూ.35 వేల కోట్లుగా, మొత్తం రూ.60 వేల కోట్లుగా తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు భరిస్తుందో చెబితే అందుకు అనుగుణంగా లక్ష రూపాయల వరకా లేక లక్షన్నర వరకు మాఫీయా అనేది నిర్ణయిస్తామని కమిటీ పేర్కొననుంది. బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి మహిళల పేరు మీద మాత్రమే తీసుకున్న రుణాలైతే రూ.10 వేల కోట్లే ఉంటాయని కమిటీ లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో పంట రుణాలు రూ.25 వేల కోట్లు, మహిళల పేరు మీద బంగారంపై వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రూ.10 వేల కోట్లు మొత్తం రూ.35 వేల కోట్లు అవుతుందని నివేదికలో పేర్కొంది. మహిళా సంఘాల రుణాలకు రూ.50 వేల వరకు పరిమితి విధించాలన్న ఆలోచనను కూడా కోటయ్య కమిటీ చేసింది. చిన్న, సన్న కారు రైతులు, మధ్య తరగతి రైతులు అనే కేటగిరీలతో కూడా కోటయ్య కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది.