
ఇక వడ్డీ బాదుడు!
కోటి మంది రైతులకు పొంచి ఉన్న పెనుభారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు తీర్చడానికి బ్యాంకులు ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో మంగళవారం నుంచి ఈ రుణాలన్నీ గడువులోగా చెల్లించని బకాయిలుగా మారనున్నాయి. రుణాలను గడువులోగా చెల్లిస్తే బ్యాంకులు 7 శాతం వార్షిక వడ్డీ వసూలు చేస్తారుు. ఒక్కసారి గడువు దాటిందంటే ఏకంగా 11.75 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా గడువు దాటిన తర్వాత కాలానికే కాకుండా ఏడాది మొత్తానికీ 11.75 శాతం చొప్పునే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి తలెత్తితే వడ్డీల రూపంలో సుమారు కోటిమంది రైతులపై పెనుభారం పడనుంది. రుణ మాఫీ అంశాన్ని చంద్రబాబు తేల్చకపోవడంతో రైతులో ఆందోళన నెలకొంది.
రుణాల రీషెడ్యూల్ అంటూ చంద్రబాబు కొత్త పల్లవి ఎత్తుకోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో రైతులు ఇంతకాలం రుణాలు చెల్లించకుండా ఎదురు చూస్తున్న విషయం విదితమే. మాఫీ విషయంలో బ్యాంకులకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు గత ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్న రుణాల చెల్లింపు గడువు కూడా నేటితో ముగుస్తోంది. ఈ ఒక్కరోజు దాటితే రైతుల రుణాలన్నిటినీ గడువు తీరిన రుణాలు (బకారుులు)గా బ్యాంకులు ప్రకటించనున్నాయి. ఈ బకాయిలను మూడు నెలల వరకు ‘ఓవర్ డ్యూస్’గా బ్యాంకులు వ్యవహరిస్తాయి. అప్పటికి కూడా చెల్లించకుంటే మొండి బకాయిల (ఎన్‌పీఏ) జాబితాలో చేరుస్తాయి. ఇంకోవైపు ‘ఓవర్ డ్యూస్’ వసూలుకు బ్యాంకులు తదుపరి చర్యలకు దిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
సర్కారు స్పష్టత ఇవ్వాలి
గడువు ముగియడానికి ఉన్న చివరి 24 గంటల్లో రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బంగారం, గోదాముల్లో నిల్వ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు చెల్లించని పక్షంలో బంగారం, సరకు వేలం వేస్తామంటూ బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు అందిన విషయం విదితమే. 13 జిల్లాల్లో 54 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకున్న రైతులు దాదాపు 38 లక్షల మంది ఉన్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో దాదాపు కోటి మంది రైతులపై భారం వేయనుంది.