Kotaiah Committee
-
మరో మెలిక
ప్రొద్దుటూరు: ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాల ఆంక్షలు విధించడంతో రైతులు చాలా వరకు నష్టపోయారు. ఇందుకు సంబంధించి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులను రుణ విముక్తి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తర్వాత ఇందుకు సంబంధించి కోటయ్య కమిటీ వేయడం, రూ.1.5లక్షలకు పరిమితం చేయడం, బ్యాంక్‌ల్లో ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు ఇవ్వాలనడం, కుటుంబానికంతా కలిపి రూ.1.50లక్ష వరకే మాఫీ వర్తిస్తుందని చెప్పడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు, ఇలా ఎన్నో రకాల ఆంక్షలు విధించడంతో ఎక్కువ మంది రైతులు రుణమాఫీకి అర్హత పొందలేకపోయారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని రుణమాఫీ అర్హత పొందిన రైతులకు ప్రస్తుతం మరో నిబంధన విధించారు. వారికి వచ్చిన మొత్తాన్ని నేరుగా ఇవ్వకుండా ఈ నిబంధనను విధించారు. రైతు తీసుకున్న రుణం మొత్తంలో మాఫీ అర్హత పొంది ఉంటే తొలివిడత మొత్తం పోను మిగతా బాకీని తాను చెల్లిస్తానని రైతు బ్యాంక్ అధికారులకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి ఐదేళ్లల్లో పూర్తి మొత్తాన్ని వడ్డీ సహా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం తొలివిడత మాత్రమే చెల్లించి మిగతా డబ్బును తాము చెల్లిస్తామని అన్ని బ్యాంకుల్లో రైతులతో అఫిడవిట్లు తీసుకుంటుండడం గమనార్హం. ఈ ప్రకారం ప్రభుత్వం రుణాన్ని చెల్లించకపోయినా యధావిధిగా వడ్డీ సహా రైతు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకర్లు ఈ అఫిడవిట్ ఫారాన్ని తయారు చేయగా ఇందులో రైతు కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వానికి బదులు రుణం చెల్లించడంలో రైతు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే రుణమాఫీ మొత్తాన్ని అప్పులోకి బ్యాంకర్లు జమ చేసుకుని కొత్త రుణాలు ఇస్తున్నారు. సాధారణంగా పంట రుణం తీసుకునే సమయంలోనే రైతులు అనేక సంతకాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించడం జరుగుతుంది. అయితే రుణమాఫీకి సంబంధించి మిగతా బాకీని చెల్లించేందుకుగాను ఈ అఫిడవిట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని గతంలో ఇచ్చిన అఫిడవిట్‌తో సంబంధం లేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్లోనే అఫిడవిట్ అంశం ఉందని ఓ బ్యాంక్ మేనేజర్ తెలిపారు. -
మాఫీపై వారానికో జీవో.. ఒరిగింది జీరో
-
ఎన్నాళ్లిలా?
►రుణమాఫీ అమలు చేయకుండా మూడు నెలలుగా నెట్టుకొస్తున్న బాబు ►కోటయ్య కమిటీ, రీషెడ్యూలు, కేబినెట్ నిర్ణయం, జీవో జారీ అంటూ కాలయాపన ►ఆర్బీఐ, నాబార్డు ఆదేశాలే బ్యాంకులకు శిరోధార్యం ►రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు ఇవ్వజాలదంటున్న బ్యాంకర్లు ►యథావిధిగా రైతులకు నోటీసులు.. జప్తులు ►రుణమాఫీ అమలు కాకపోతే జిల్లాలో రైతుల నెత్తిన అదనంగా రూ.858.41 కోట్ల వడ్డీ భారం అనంతపురం : జనం ముందుకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తమ ప్రభుత్వం ఏదో చేసేస్తోందన్న భ్రమను కల్గించే విధంగా చంద్రబాబు, ఆయన అనుంగు మంత్రులు వ్యవహరిస్తూ వస్తున్నారని ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందేమో తన తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనేనని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజున నిజంగా ఆ ఫైలుపైనే సంతకం చేస్తారేమోనన్న భావన కలుగజేశారు. చివరకు విధివిధానాల కోసం ‘కోటయ్య కమిటీ’ నియామకం ఫైలుపై సంతకం చేశారు. ఆ కమిటీ నివేదిక పేరుతో కొద్ది రోజులు గడిపి.. జూన్ 30న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ గురించి కాకుండా రీషెడ్యూల్‌పై మాట్లాడారు. జూలై 16, 17 తేదీల్లో చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనకు రెండు, మూడు రోజుల ముందు నుంచి రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ అంగీకరించిందన్న ప్రచారం ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. రీషెడ్యూల్ అయిపోయినట్లేనని, ప్రస్తుతానికైతే రైతులకు సమస్య తీరుతుందని, రీషెడ్యూలు చేసిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని... ఇలా చెప్పుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించారు. తర్వాత జూలై 24, 25 తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటనకొచ్చారు. అంతకు మూడు రోజుల ముందు రూ.1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు, రూ.లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీకి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీనివల్ల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్లో దాదాపు 96 శాతం మందికి లబ్ధి చేకూరనుందంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారాల నేపథ్యంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. తర్వాత ఈ మూడు వారాల్లో రీషెడ్యూలు ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు తిప్పికొట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కరువు, వరదల వల్ల పంటనష్టం జరిగితే మూడు నెలల్లోపే రీషెడ్యూలుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, సాధారణ దిగుబడిలో 50 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే రీషెడ్యూలు సాధ్యమవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘మీరు ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చారు కాబట్టి.. మమ్మల్ని రీషెడ్యూలు చేయమంటే కుదరద’ని తేల్చి చెప్పింది. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రభుత్వం రుణమాఫీపై ఒక జీవోను విడుదల చేసింది. మూడు వారాల క్రితం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఈ జీవో విడుదలైంది. మళ్లీ ప్రభుత్వమూ, దాని వందిమాగధులు ‘అంతా అయిపోయింది. జీవో వచ్చేసింది. రూ.1.5 లక్షలోపు రుణాలన్నీ ఇక మాఫీ అయిపోయినట్లే’ అని ఊదరగొట్టాయి. ఈ ప్రచార పటాటోపం మధ్య బాబు జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తామేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రుణమాఫీ కాకపోతే రైతు నెత్తిన రూ.858 కోట్ల వడ్డీ భారం జిల్లాలో 6.08 లక్షల మంది రైతులు రూ.3,093 కోట్ల పంట రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. 2.12 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన బంగారు తాకట్టు రుణాల మొత్తం రూ.1,851 కోట్లు ఉంది. దాదాపుగా ఈ మొత్తమంతా రూ.1.5 లక్షల రుణ పరిమితికి లోపలే ఉంది. 69,709 స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.1,264 కోట్లు, 5,537 చేనేత సహకార సంఘాల రుణాలు రూ.35.05 కోట్లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలన్నీ కలిపి మొత్తం రూ.6,243 కోట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఈ రుణాలన్నింటికీ బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. నిర్ణీత కాల పరిమితిలోపు రుణం తీరిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 4 శాతం వడ్డీ మాఫీతో పాటు మిగిలిన 3 శాతం(పావలా) వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలను ఇప్పటికీ తిరిగి చెల్లించలేదు. ఈ కారణంగా ప్రస్తుతం 11.75 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కూడా దాటితే (సెప్టెంబర్ తర్వాత) మరో 2 శాతం వడ్డీ పెరుగుతుంది. అప్పుడు రైతులు 13.75 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రుణమాఫీ జరగకపోతే రైతులు అదనంగా వడ్డీ కింద రూ.858.41 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుల ముందు జీవో చెల్లని కాగితమే ప్రభుత్వం గురువారం రుణమాఫీపై జీవో విడుదల చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ బ్యాంకర్లను కలిసి వివరణ కోరింది. బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించ జాలవని వారు స్పష్టం చేశారు. సహకార రంగంలోని బ్యాంకులకైతే నాబార్డ్, మిగతా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేస్తాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకుంటాయని వారు స్పష్టం చేశారు. ‘రైతులు బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని రైతులైనా చెల్లించాలి లేదా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమైనా కట్టాలి. డబ్బు చెల్లించకుండా వట్టిమాటలు ఎన్ని చెప్పినా రుణాలు మాఫీకావు. ఆర్బీఐ సూచనల మేరకు రుణాల వసూళ్లకు సంబంధించి నోటీసుల జారీ, బంగారు, భూముల వేలం లాంటి చర్యలు ఉంటాయ’ని వారు స్పష్టం చేస్తున్నారు. -
ఖరీఫ్.. కటకట
కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సాగుకు ప్రభుత్వంతోపాటు ప్రకృతి కూడా సహకరించడం లేదు. ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఆశించిన వర్షం కురవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రుణమాఫీపై ఎటూ తేల్చకుండా కాలయపన చేస్తున్నారు. మార్గదర్శకాల కోసం మొదట కోటయ్య కమిటీని వేశారు.. నిధుల సమీకరణ కోసమంటూ మరో కమిటీని నియమించారు. ఇది పని పూర్తిచేసి రైతులకు రుణమాఫీ అయ్యే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం బ్యాంకర్లను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. అయితే వారు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదిలా ఉండగా బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న అన్నదాతల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. రికవరీల కోసం బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. శిరివెళ్ల మండలంలో దాదాపు 200 మందికి నోటీసులు అందాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెట్టుబడుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రుణాలు దొరకక అల్లాడుతున్నామని పలువురు రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో కాడి వదిలేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగానికి తగ్గిన సాగు.. ఇంతవరకు సరైన వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగులో పురోగతి కనిపించడం లేదు. అంతంత మాత్రం తేమలో విత్తనాలు వేసినా అవి మొలకెత్తలేదు. మొలకెత్తిన పైర్లు వానలు లేక ఎండిపోతున్నాయి. అరకొర పదనులో ఈ ఏడాది 1.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. అలాగే 33 వేల హెక్టార్లలో వేరుశనగను విత్తారు. అక్కడక్కడ మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు సాగు చేశారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ. కాగా, 66.5 మి.మీ నమోదైంది. జూలై నెలలో 117 మి.మీకు గాను 85 మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెరువుల్లో చుక్క నీరు లేదు. అలాగే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2.56 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంతంత మాత్రం తేమలో పంటలు వేయడంతో కొద్ది రోజుల బెట్టను తట్టుకోలేక ఎండిపోతున్నాయి. జిల్లాలో దాదాపు 25 మండలాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తి నిరాశజనకంగా మారింది. చాగలమర్రి మండలంలో ఈ నెల అత్యల్ప వర్షపాతం నమోదయింది. కేవలం 4.6 మి.మీ. వర్షం మాత్రమే ఇక్కడ కురిసింది. అలాగే వెల్దుర్తి, బేతంచెర్ల, ఉయ్యాలవాడ మండలాల్లో అతి తక్కువగా వర్షాలు కురిశాయి. మద్దికెర, పాణ్యం, క్రిష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, పగిడ్యాల, గోనెగండ్ల, జూపాడుబంగ్లా, ఎమ్మిగనూరు, నందవరం, ఓర్వకల్లు, దేవనకొండ, దొర్నిపాడు, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, రుద్రవరం తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. జిల్లాలో 88645 హెక్టార్లలో వరిని పండించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాద స్థాయిలో భూగర్భజలాలు ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో బావులు, బోర్ల కింద దాదాపు 20 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోతుండటంతో పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లో 10.77 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు మే నెలలో 11.13 మీటర్లకు పడిపోయాయి. జూన్ నెలలో 11.40 మీటర్లకు తగ్గిపోయాయి. -
చంద్రబాబు దా'రుణ' మాఫీ!
* ఏపీలో 43.93 లక్షల రైతు ఖాతాలు * పంట రుణాల మొత్తం విలుల 28 వేల కోట్లు * రుణ మాఫీ ఇప్పట్లో లేదంటున్న కోటయ్య కమిటీ * మాఫీపై పూటకొక్క మాట ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రుణమాఫీ జపం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేక మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రుణమాఫీపై చంద్రబాబు సర్కారు మాయమాటలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రైతులకు భారంగా మారుతోంది. రుణమాఫీ ఎంతవరకు చేస్తారో ముందు తెలియకపోవడంతో రైతులు సకాలంలో చెల్లించలేదు. మహిళా సంఘాల రుణాలతో కలిపి ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకే అని ప్రభుత్వం చెప్పడంతో అంతకు మించి రుణం కలిగి, ఓవర్ డ్యూస్ అయిన రుణాలకు వడ్డీ భారం పడనుంది. ఈ విధంగా ఓవర్ డ్యూస్ అయిన రైతులకు సంబంధించినవి ఏపీలో 43.93 లక్షల ఖాతాలుండగా వాటిపై 28 వేల కోట్ల మేర రుణాలున్నాయి. లక్షన్నర రూపాయల వరకే రుణ మాఫీ అని ప్రభుత్వం ముందుగా చెప్పి ఉంటే అంతకు మించి రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి రాయితీ పొందేవారు. బాబు ఓవర్ యాక్షన్ తో ఓవర్ డ్యూస్ భారం - ఇప్పుడు ఓవర్ డ్యూస్ కావడంతో ఆ రుణాలకు వడ్డీ రాయితీ వర్తించబోదని అధికారులు అంటున్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేంద్రం ఇచ్చే 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ ఓవర్ డ్యూస్ అయిన ఖాతాలకు వర్తించబోదని బ్యాంకులు అంటున్నాయి. ఓవర్ డ్యూస్ అయిన ఖాతాల వారు 12 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇటు కోటయ్య కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న రుణ మాఫీ ఇప్పట్లో అమలు కాదని తేల్చి చెప్పింది. భగ్గుమంటున్న రైతులు - చంద్రబాబు ప్రకటనలు రైతులను నిలువునా ముంచేశాయన్నది సుస్సష్టం. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతు రుణాలు మొత్తం మాఫీ చేయాల్సిందేనంటున్నారు రైతులు. రుణాల రద్దుపై మొదటి సంతకం చేస్తానని చెప్పి..కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సంతకం చేశారని వారు మండి పడుతున్నారు. కుటుంబానికి లక్షన్నర మాత్రమే రుణమాఫీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా స్పందించింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతాంగం నోట్లో టీడీపీ సర్కార్ మట్టిగొట్టిందని ఆ పార్టీ నేతలంటున్నారు. -
వడపోత తర్వాతే రుణమాఫీ
ఏపీ సర్కారుకు కోటయ్య కమిటీ నివేదిక బోగస్ అఫిడవిట్ ఇస్తే 18 శాతం వడ్డీతో రికవరీకి సూచన హైదరాబాద్: రైతు రుణాల మాఫీకి వడపోత విధానం అవలంబించాలని కోటయ్య కమిటీ సూచించింది. కాకుండా బోగస్ అఫిడవిట్లు ఇచ్చి న రైతులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని పేర్కొంది. వ్యవసాయ, మహిళా సంఘాల రుణాల మాఫీపై కోటయ్య కమిటీ సోమవారం 67 పేజీలతో కూడిన తుది నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు సమర్పించింది. ఆ నివేదికలో ఆర్బీఐతో జరిపిన చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆయా రంగాల రుణాలు, నిధుల సమీకరణ, రుణ మాఫీకి అర్హులు, అనర్హులు, దరఖాస్తు వంటి అంశాలను పేర్కొంది. మొత్తం వ్యవసాయ రుణాలు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.87,612.25 కోట్లు ఉన్నట్లు నివేది కలో పేర్కొన్నారు. ఇందులో పంట, బంగారం రుణాలు రూ.60,659.44 కోట్లు ఉన్నాయి. 7,72,412 మహిళా సంఘాల పేరు మీద మార్చి నెలాఖరు నాటికి రూ.13,764 కోట్ల రుణాలున్నాయి. లక్ష రూపాయల వరకు మహిళా సంఘాల రుణమాఫీని వర్తింప చేస్తే రూ.7,724 కోట్లు అవుతుంది. షరతులు విధిం చడం ద్వారా మొత్తం రుణ మాఫీని రూ.33 వేల కోట్లకు పరిమితం చేయాలని కోటయ్య కమిటీ పేర్కొంది. చేనేత రూ.168 కోట్లను, గొర్రెలు, మేకలు, పందుల కోసం తీసుకున్న రుణాలకు రుణ మాఫీ వర్తింప చేయాలని కోటయ్య కమిటీ సూచించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. పంట రుణాలు, బంగారం రుణాలు, పంట తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, రైతు మిత్ర గ్రూపులు, సంయుక్త రైతుల రుణాలకు, కిసాన్ క్రెడిట్ దారుల రుణాలకు. స్వల్ప కాలిక రుణాలను మధ్యకాలిక రుణంగా మార్చిన రుణాలకు రుణ మాఫీ వర్తింపు.కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ అమలు. కుటుంబంలో ఎంతమంది రుణాలు ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నా రుణ పరిమితికి లోబడి మాత్రమే రుణ మాఫీ వర్తింపు. కుటుంబం అంటే భార్యా, భర్త, మైనర్ పిల్లలు. ఏ రుణం అయినా రుణ పరిమితికి మించి ఆ కుటుంబంలో జరగదు.ఈ ఏడాది మార్చి వరకు ఉన్న రుణాలకు సంబంధించి ప్రతీ కుటుంబం దరఖాస్తుతోపాటు ఆయా కుటుంబసభ్యుల పేరిట ఎంత రుణం ఉందో అఫిడవిట్‌ను సమర్పించాలి. తప్పుడు అఫిడవిట్ ఇస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. 18 శాతం వడ్డీతో తిరిగి రాబట్టాలి.బ్యాంకు ఖాతాలకు రైతు ఆధార్, పాసుపుస్తకం నంబర్ల అనుసంధానం -
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక
-
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక సమర్పణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటయ్య కమిటీ సోమవారం తమ నివేదికను సమర్పించింది. బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న ఆ కమిటీ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నివేదికను అందచేసింది. ఇక కోటయ్య కమిటీ తన నివేదికలో రుణాల విలువను తగ్గించి చూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ మాఫీ పై అధ్యయనం కోసంకోటయ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈనెల 22న కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించాల్సి ఉంది. 184వ ఎస్ఎల్బీసీ సమావేశంలో మొత్తం రుణాల విలువ రూ.1.02లక్షల కోట్ల పైమాటే అన్న కోటయ్య కమిటీ రుణాల విలువ రూ.72వేలకోట్లుగా పేర్కొంది. తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేలకోట్లుగా తెలిపింది. మొత్తం మీద కోటయ్య కమిటీ నిర్దిష్ట 45 రోజులలోనే తన తుది నివేదికను సమర్పించింది. -
కోటయ్య కమిటీతో చంద్రబాబు కీలక భేటీ
-
మధ్యంతర నివేదికకు మరింత గడువు
-
మధ్యంతర నివేదికకు మరింత గడువు
రుణ మాఫీపై కోటయ్య కమిటీకి మరో 10 రోజులు ఇవ్వక తప్పలేదు: ఆర్థికమంత్రి యనమల జాప్యమైనా మాఫీకి కట్టుబడి ఉన్నామని వెల్లడి అసెంబ్లీ భేటీ గట్టెక్కే వ్యూహంలో భాగమే? ఇప్పుడు కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తే ప్రతికూలాంశాలపై నిలదీస్తారనే భయం! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించటానికి ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత గడువు పొడిగించింది. మరో పది రోజుల సమయం ఇచ్చింది. కమిటీ చైర్మన్ కోటయ్య, ఇతర సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మునిసిపల్ మంత్రి పి.నారాయణ, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తమ అధ్యయనానికి సంబంధించిన అంశాలను సీఎంకు వివరించిన కమిటీ.. తమ అధ్యయనం ఇంకా పూర్తికాలేదని, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రిజర్వు బ్యాంకు అధికారులతో సంప్రదించాల్సి ఉందని చెప్పారు. రుణ మాఫీపై ప్రాధమిక నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరమని కమిటీ పేర్కొందని, దీంతో గడువు ఇవ్వక తప్పలేదని యనమల ఈ సమావేశానంతరం విలేకరులకు చెప్పారు. ‘‘అది నిపుణుల కమిటీ. స్వేచ్ఛగా వాస్తవిక దృష్టితో అది పనిచేస్తుంది. దానిపై మేమెవ్వరం ఒత్తిడి చేసే పరిస్థితి ఉండదు. అది కొంత సమయం అడిగాక ఇవ్వడం సమంజసం. ఇవ్వలేమని చెప్పలేం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు రుణ మాఫీకే కట్టుబడి ఉందని, దాన్నుంచి వెనక్కు వెళ్లేది లేదని కమిటీకి స్పష్టం చేశామన్నారు. కమిటీ తుది నివేదికలోని సిఫారసులను అనుసరించి ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చేలోగా రైతులకు ఖరీఫ్ రుణాలకు ఇబ్బంది రాకుండా వాటిని రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని, రిజర్వు బ్యాంకును కోరుతున్నామని యనమల తెలిపారు. బంగారు రుణాలకు సంబంధించి.. బకాయిల జప్తు కోసం బంగారాన్ని వేలం వేయవద్దని, కొన్ని రోజులు ఆలస్యమైనా ఆగాలని బ్యాంకర్లను కోరామని చెప్పారు. ప్రత్యామ్నాయాలపై చర్చ... కోటయ్య కమిటీతో సీఎం భేటీ సందర్భంగా రుణ మాఫీకి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పంట రుణాలు, బంగారంపై రుణాలు అనే కేటగిరీల్లో గరిష్టంగా ప్రభుత్వంపై భారం ఏ మేరకు తగ్గించవచ్చో కమిటీ వివరించినట్లు సమాచారం. ఈ మూడురకాల రుణాల మొత్తం దాదాపు రూ. 87,000 కోట్లకు పైగా ఉండగా.. ఇప్పుడు కమిటీ పంట రుణాల కింద రూ. 25,000 కోట్లు, బంగారు రుణాలపై రూ. 5,000 కోట్లు ప్రభుత్వం భరించేలా కొన్ని సిఫారసులు అందించినట్లు చెప్తున్నారు. ఒక ఇంటిలో రెండు, మూడు వ్యవసాయ రుణాలున్నా ఒక్కదానికే ప్రభుత్వం ఇచ్చే మాఫీ వర్తించేలా ఒక ప్రతిపాదన కూడా కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు గట్టెక్కటానికేనా? రుణ మాఫీపై కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఆదివారం నాటికే ఇవ్వాల్సి ఉన్నా దానికి మరికొంత సమయం పొడిగించడం వ్యూహాత్మకమేనని స్పష్టమవుతోంది. కమిటీ ఇచ్చేది ప్రాథమిక నివేదికే అయినా దానికీ గడువు కోరడం విచిత్రంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. తుది నివేదికకు గడువు ఇవ్వడమన్నది ఉంటుంది కానీ మధ్యంతర నివేదికకు గడువు ఏమిటని పరిశీలకులు ముక్కున వేలేసుకుంటున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం మరి కొంత కాలం కాలయాపన చేయడానికే ఈ ఎత్తుగడగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున కమిటీ నివేదిక ఇస్తే.. అందులోని ప్రతికూలాంశాలపై శాసనసభలో ప్రతిపక్షం నుంచి ఎదురుదాడి తప్పదని.. దాన్నుంచి తప్పించుకోవడానికే కమిటీ మధ్యంతర నివేదికను జాప్యం చేయించినట్లుగా స్పష్టమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ అవసరం: కుటుంబరావు రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) చట్టాన్ని సవరించేలా కేంద్రాన్ని ఒప్పించాల్సిన అవసరముందని కోటయ్య కమిటీ సభ్యుడు సి.కుటుంబరావు అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబు మెడకు రుణమాఫీ ఉచ్చు!
ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులు, చేనేత కార్మికుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీపైనే తొలి సంతకం అన్నారు. ఇప్పుడు అదే ఆయన మెడకు ఉచ్చులా బిగుసుకోనుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. టిడిపి అధికారంలోకి వచ్చింది. తీరా తొలి సంతకం దగ్గరకు వచ్చేసరికి రుణమాఫీ కాస్త రుణమాఫీ కమిటీగా మారిపోయింది. కమిటీ పేరుతో కాలయాపన మొదలైంది. ఇక్కడే ఓ మోసం బట్టబయలైపోయింది. వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి. పాత రుణాలు మాఫీ అయితేగానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వవు. రుణమాఫీ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని హెచ్చరిస్తున్నాయి. రుణమాఫీ అమలును ఏదోవిధంగా అమలు చేశాం అనిపించుకోవడానికి టిడిపి ప్రభుత్వం ఎత్తులకుపైఎత్తులు వేస్తోంది. మాఫీ చేసే రుణాలను కుదించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. 50 వేల రూపాయల లోపు - లక్ష రూపాయల లోపు- రెండు ఎకరాల లోపు రైతు- అయిదు ఎకరాల లోపు రైతు - రుణం తీసుకున్నా కాలం - ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ....ఇలా ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా అనేక ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది. అందులో ప్రధానమైనది రుణాల రీషెడ్యూల్. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుంవడా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం ఇస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి, చెల్లింపునకు గడువు పొడిగింపు మాత్రమే. రుణాలను రీషెడ్యూల్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, బ్యాంకులను, రిజర్వు బ్యాంకును కోరింది. పాత బకాయిలు అలా ఉంచి, బ్యాంకులు కొత్త రుణాలు ఎక్కడ నుంచి ఇస్తాయి? నగదు సర్క్యులేషన్ ఎలా? పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని రిజర్వు బ్యాంకు మొదటి నుంచి చెబూతూనే ఉంది. రుణాల రీషెడ్యూల్కు బ్యాంకులు సుముఖంగాలేవు. రైతులు కూడా అందుకు అంగీకరించడంలేదు. రైతులు రుణమాఫీని కోరుకుంటున్నారు. చెల్లించడానికి వాయిదానికాదు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ పమిడి కోటయ్య అధ్యక్షతన నియమించిన కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం కావాలని కమిటీ కోరినట్లు తెలిపారు. కాలయాపన కోసం ఇటువంటి మాటలు చెబుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. రుణమాఫీ, రీషెడ్యూల్కు సంబంధించి కోటయ్య కమిటీ రిజర్వు బ్యాంకుకు మూడు రోజుల క్రితం ఒక లేఖ రాసింది. ఆర్బిఐ నుంచి ఎటువంటి సమాధానం లేదు. దాంతో కోటయ్య కమిటీ ఆర్బిఐ అధికారులను నేరుగా కలవనుంది. ఇదిలా ఉంటే ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే వర్తించేలా ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షిటీవీకి చెప్పారు. రుణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ ఒప్పుకునేలా కోటయ్య కమిటీ ప్రయత్నిస్తోందన్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి సమాధానం వచ్చిన తరువాత రుణమాఫీపై స్పష్టత వస్తుందని చెప్పారు. రైతుల రుణబకాయిలను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితిలేదు. ప్రభుత్వ హామీలను బ్యాంకులు అంగీకరించవు. ఆ విషయం రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మోసపోయినట్లు రైతులు గుర్తించడం మొదలైంది. ఏదిఏమైనా ఇప్పుడు చేయగలిగిందిలేమీలేదు. చంద్రబాబు నాయుడుకు అయిదేళ్లకు అధికారం కట్టబెట్టారు. భరించకతప్పదు. -
కష్టమైనా..నష్టమైనా అమలు చేస్తాం: యనమల
రైతు రుణమాఫీ కాస్త జాప్యం అయినా అందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆర్ధికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నియమించిన కోటయ్య కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది. కోటయ్య కమిటీతో భేటి అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం పడుతుందని కమిటీ కోరింది అని అన్నారు. ఆర్ బీఐ, బ్యాంకులు, ప్రభుత్వాధికారులను కలవాల్సిఉందని కోటయ్య కమిటీ చెప్పిందని, ప్రత్యామ్నాయాలు సూచించడానికి మరింత సమయం కావాలన్నారని యనమల తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీనుంచి వెనక్కిపోలేమని కమిటీకి చెప్పామని, కష్టమైనా, నష్టమైనా అమలు చేసే దిశగా వెళ్లాలని కమిటీకి సూచించామని యనమల అన్నారు. రుణమాఫీపై ఖచ్చితమైన నివేదిక ఇవ్వడానికి కమిటీ కసరత్తు చేస్తోందని, కమిటీ ప్రయత్యామ్నాయాలు రాగానే రుణమాఫీని అమలు చేస్తామన్నారు. త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారని, వివిధ కోణాల్లో రుణాలపై విశ్లేషణ చేస్తున్నారని, ఎక్కువమందికి లబ్ధిచేకూర్చే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలన్నది మా ఆలోచన అని యనమల మీడియాకు వెల్లడించారు. మధ్యంతర నివేదిక కోసమే సమయం కోరారని, ఖరీఫ్ రుణాలు రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్నికోరుతున్నామని, రుణాల రీషెడ్యూల్ కోసం బ్యాంకర్లు, ఆర్ బీఐని కోరుతున్నామని, రుణాల రీషెడ్యూల్ కోసం కారణాలను ఇప్పటికే చెప్పామని యనమల అన్నారు. రుణాల రీషెడ్యూల్ చేస్తే రుణాల మంజూరుకు ఇబ్బంది ఉండదని అనుకుంటున్నామని, ఖరీఫ్ రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని కోరుతున్నామన్నారు. రుణాల చెల్లింపుల కోసం పట్టుబట్టవద్దని బ్యాంకర్లను కోరామని, ఈనెల 26, 27న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారని, ప్రధానిని కలిసి.. సమస్యలను నివేదిస్తామని మీడియాతో యనమల అన్నారు. -
చంద్రబాబుతో కోటయ్య కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆదివారం కోటయ్య కమిటీ హైదరాబాద్‌లో భేటీ అయింది. రైతు రుణమాఫీ విధి విధానాలపై రూపొందించిన నివేదికను కమిటీ చంద్రబాబుకు అందజేసింది. ఆ కమిటీ నివేదికపై మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబులతోపాటు ఢిల్లీలో ప్రభుత్వ ఆధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా రైతు రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేస్తానంటూ ప్రకటించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం రైతు రుణమాఫీపై విధి విధానలపై కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రుణాలు రూ.87,612 కోట్లు. కాగా పంట రుణాలు రూ.34,105 కోట్లు. పంటకోసం బంగారంపై తీసుకున్న రుణాలు రూ.20,102 కోట్లు. టర్మ్ లోన్స్ కింద రూ.1,419 కోట్లు. టర్మ్ లోన్స్గా మారిన పంటరుణాలు రూ. 7 వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ. 14, 204 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.10,782 కోట్లు ఉన్నాయి. -
2013-14 రుణాలే మాఫీ?
సిఫారసు చేయనున్న కోటయ్య కమిటీ ఆ ఒక్క సంవత్సరంలో తీసుకున్న రుణాలు (25 వేల కోట్లు), బంగారం తాకట్టు రుణాలు (35 వేల కోట్లు) కలిపి రూ.60 వేల కోట్లు వీటిలో ఎంత భరిస్తారో ప్రభుత్వం చెబితే దానికి అనుగుణంగా పరిమితి విధింపు! కేవలం మహిళలు కుదవ పెట్టిన బంగారం రుణాల మాఫీనే వర్తింపజేస్తే రూ.10 వేల కోట్లే నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికి ఇవ్వనున్న కమిటీ హైదరాబాద్: రైతుల రుణ మాఫీ విషయంలో ప్రభుత్వంపై వీలైనంత మేరకు భారాన్ని తగ్గించే విధంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేయాలని కోటయ్య కమిటీ సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. ఈ సంవత్సరంలో పంట రుణాలు, బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలు కలిపి రూ.60 వేల కోట్లుగా అధికారులు లెక్కతేల్చారు. ఇందులో ఎంతమేరకు ప్రభుత్వం భరించగలదో తేల్చితే, ఆ మేరకు రుణ మాఫీకి షరతులు, పరిమితులు విధించగలమని కోటయ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈమేరకు కమిటీ ప్రాథమిక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. రుణ మాఫీ విధివిధానాల రూపకల్పనపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమై, ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఆదివారం చంద్రబాబుకు సమర్పించనుంది. ఎటువంటి షరతులు లేకుండా ఇప్పటివరకు ఉన్న వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం చూస్తే అన్ని రకాల వ్యవసాయ రుణాలు, మహిళా సంఘాల రుణాలన్నీ కలిపితే రూ.87,612 కోట్లు మాఫీ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కోటయ్య కమిటీ మాత్రం అంత మేర రుణ మాఫీకి కాకుండా షరతులు విధిస్తూ పలు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం పంట రుణాలు రూ.25 వేల కోట్లు రైతులు తీసుకోగా వ్యవసాయానికి బంగారాన్ని కుదువపెట్టి తీసుకున్న రుణాలు రూ.35 వేల కోట్లుగా, మొత్తం రూ.60 వేల కోట్లుగా తేల్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు భరిస్తుందో చెబితే అందుకు అనుగుణంగా లక్ష రూపాయల వరకా లేక లక్షన్నర వరకు మాఫీయా అనేది నిర్ణయిస్తామని కమిటీ పేర్కొననుంది. బంగారం కుదవ పెట్టి వ్యవసాయానికి మహిళల పేరు మీద మాత్రమే తీసుకున్న రుణాలైతే రూ.10 వేల కోట్లే ఉంటాయని కమిటీ లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో పంట రుణాలు రూ.25 వేల కోట్లు, మహిళల పేరు మీద బంగారంపై వ్యవసాయానికి తీసుకున్న రుణాలు రూ.10 వేల కోట్లు మొత్తం రూ.35 వేల కోట్లు అవుతుందని నివేదికలో పేర్కొంది. మహిళా సంఘాల రుణాలకు రూ.50 వేల వరకు పరిమితి విధించాలన్న ఆలోచనను కూడా కోటయ్య కమిటీ చేసింది. చిన్న, సన్న కారు రైతులు, మధ్య తరగతి రైతులు అనే కేటగిరీలతో కూడా కోటయ్య కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. -
కొనసాగుతున్న కోటయ్య కమిటీ కసరత్తు
-
రుణమాఫీకి పరిమితులు!
కొనసాగుతున్న కోటయ్య కమిటీ కసరత్తు సన్న, చిన్న కారు రైతులకే పూర్తి మాఫీ యోచన పెద్ద రైతులకు లక్ష లేదా లక్షన్నర వరకే..! మహిళల పేరిట ఉన్న బంగారు రుణాలకే వర్తింపు పంట రుణాలను టర్మ్ రుణాలుగా మార్చితే మాఫీ కుదరదు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీపై విధివిధానాలను ఖరారు చేయడానికి ఏర్పాటైన నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలోని కమిటీ కసరత్తును ముమ్మరం చేసింది. రుణ మాఫీకి అర్హతలు ఏమిటి? ఎవరికి, ఎంతవరకు రుణం మాఫీ చేయాలనే అంశంపై ఒక అవగాహనకు వచ్చింది. ఈ 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రాథమిక నివేదిక సమర్పించాలని భావిస్తోంది. వాస్తవానికి వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా, అంతకుముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేసేందుకు వీలుగా విధివిధానాలు రూపొందించే బదులు.. కొన్ని పరిమితులకు లోబడి వాటిని ఖరారు చేసే పనిలో కోటయ్య కమిటీ ఉంది. ఇందులో భాగంగా సన్న, చిన్న కారు రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయడం, పెద్ద రైతులకు మాత్రం లక్ష రూపాయలు లేదా లక్షన్నర రూపాయల వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసే దిశగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో సన్న, చిన్న కారు రైతులంటే ఎవరు? పెద్ద రైతులంటే ఎవరు? అనే విషయాన్ని కమిటీ తన విధివిధానాల్లో స్పష్టం చేయనుంది. రెండున్నర ఎకరాలు కలిగిన రైతులను సన్న కారు రైతులగాను, 5 ఎకరాలు గల రైతులను చిన్నకారు రైతులగాను పరిగణించాలని కమిటీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 5 ఎకరాలకు పైగల రైతులను పెద్ద రైతులుగా పరిగణించనున్నారు. అలాగే వ్యవసాయం కోసం బంగారం కుదవపెట్టి తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయరాదని, ఆ విధంగా కేవలం మహిళల పేరిట తీసుకున్న రుణాలనే మాఫీ చేసే దిశలో కమిటీ కసరత్తు కొనసాగిస్తోంది. బంగారం కుదవపెట్టి రూ.20,102 కోట్ల మేరకు రైతులు రుణాలుగా తీసుకున్నారు. ఈ మొత్తాన్నీ మాఫీ చేయకుండా కేవలం మహిళల పేరమీద ఉన్న బంగారు రుణాలకే (సుమారు రూ.8 వేల కోట్లు) మాఫీ వర్తింప చే యూలనే నిబంధన విధిస్తే ఎలా ఉంటుందనే అశంపై కోటయ్య కమిటీ చర్చిస్తోంది. కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో.. బంగారం కుదవకు సంబంధించి మహిళల పేరిట ఉన్న రుణాలు ఎంతో ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఒక రైతు పేరు మీద రెండు మూడు బ్యాంకుల్లో రుణాలు ఉంటే ఒక రైతుకు ఒక బ్యాంకు (ఒకే ఖాతా) రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని, దానికి కూడా సీలింగ్ విధించాలని కోటయ్య కమిటీ అభిప్రాయపడుతోంది. పంట రుణాలను వ్యవసాయ టర్మ్ రుణాలుగా మార్చితే వాటికి మాఫీ వర్తింపచేయరాదనే అంశాన్ని కూడా కమిటీ చర్చిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింప చేయరాదని కూడా భావిస్తోంది. -
మాఫీ ఎలాగో తేల్చని బాబు
* రుణాల మాఫీపై నెలాఖరు వరకు ఆగాలని బ్యాంకర్లకు సూచన * కోటయ్య కమిటీ, బ్యాంకర్లు, అధికారులతో సమావేశం * ఆర్బీఐ లేఖపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చలేదు. రుణాల మాఫీకి విధివిధానాలపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్న కోటయ్య కమిటీతో పాటు ముగ్గురు మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. అయినప్పటికీ రుణ మాఫీ ఎలాగో బాబు తేల్చలేదు. పైగా మాఫీపై స్పష్టత కోసం ఈ నెలాఖరు వరకు వేచి చూడాలని బ్యాంకర్లకు చెప్పారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కోటయ్య కమిటీలోని తొమ్మిది మంది సభ్యులు, ఆర్థిక, వ్యవసాయ, సహకార శాఖల మంత్రులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతుల రుణాల మాఫీపై ఆర్బీఐ రాసిన లేఖలోని అంశాలు, బంగారం రుణాలపై వేలం పాటలకు బ్యాంకులు ఇస్తున్న నోటీసులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏ పరిస్థితుల్లో రుణాల మాఫీకి హామీ ఇచ్చామో వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్బీఐ గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. రైతులను ఆదుకోవడానికే రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు వివరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. వీటిపై ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో, ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల ప్రతినిధులు మాత్రం సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెలాఖరు వరకు రుణ మాఫీ ఎలాగో తేల్చకపోతే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను వస్తుందని, అంతేకాకుండా రుణాలు మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారతాయని వారు చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వాలంటే తొలుత రుణాలను చెల్లించాలని, ఆ తరువాత మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం తరఫున రైతులకు సందేశమివ్వాలని కూడా బ్యాంకుల ప్రతినిధులు సూచిం చారు. దీనిపై చూద్దాం అంటూ చంద్రబాబు సమాధానాన్ని దాటవేశారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణ మాఫీ ని వర్తింపజేయాలని అనుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, కేంద్రాన్ని, ఆర్బీఐని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని బాబు చెప్పినట్లు తెలిసింది.