మధ్యంతర నివేదికకు మరింత గడువు
రుణ మాఫీపై కోటయ్య కమిటీకి మరో 10 రోజులు
ఇవ్వక తప్పలేదు: ఆర్థికమంత్రి యనమల
జాప్యమైనా మాఫీకి కట్టుబడి ఉన్నామని వెల్లడి
అసెంబ్లీ భేటీ గట్టెక్కే వ్యూహంలో భాగమే?
ఇప్పుడు కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తే ప్రతికూలాంశాలపై నిలదీస్తారనే భయం!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించటానికి ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత గడువు పొడిగించింది. మరో పది రోజుల సమయం ఇచ్చింది. కమిటీ చైర్మన్ కోటయ్య, ఇతర సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మునిసిపల్ మంత్రి పి.నారాయణ, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
తమ అధ్యయనానికి సంబంధించిన అంశాలను సీఎంకు వివరించిన కమిటీ.. తమ అధ్యయనం ఇంకా పూర్తికాలేదని, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రిజర్వు బ్యాంకు అధికారులతో సంప్రదించాల్సి ఉందని చెప్పారు. రుణ మాఫీపై ప్రాధమిక నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం అవసరమని కమిటీ పేర్కొందని, దీంతో గడువు ఇవ్వక తప్పలేదని యనమల ఈ సమావేశానంతరం విలేకరులకు చెప్పారు. ‘‘అది నిపుణుల కమిటీ. స్వేచ్ఛగా వాస్తవిక దృష్టితో అది పనిచేస్తుంది. దానిపై మేమెవ్వరం ఒత్తిడి చేసే పరిస్థితి ఉండదు. అది కొంత సమయం అడిగాక ఇవ్వడం సమంజసం. ఇవ్వలేమని చెప్పలేం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతు రుణ మాఫీకే కట్టుబడి ఉందని, దాన్నుంచి వెనక్కు వెళ్లేది లేదని కమిటీకి స్పష్టం చేశామన్నారు. కమిటీ తుది నివేదికలోని సిఫారసులను అనుసరించి ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామన్నారు. కమిటీ నివేదిక వచ్చేలోగా రైతులకు ఖరీఫ్ రుణాలకు ఇబ్బంది రాకుండా వాటిని రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని, రిజర్వు బ్యాంకును కోరుతున్నామని యనమల తెలిపారు. బంగారు రుణాలకు సంబంధించి.. బకాయిల జప్తు కోసం బంగారాన్ని వేలం వేయవద్దని, కొన్ని రోజులు ఆలస్యమైనా ఆగాలని బ్యాంకర్లను కోరామని చెప్పారు.
ప్రత్యామ్నాయాలపై చర్చ...
కోటయ్య కమిటీతో సీఎం భేటీ సందర్భంగా రుణ మాఫీకి సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పంట రుణాలు, బంగారంపై రుణాలు అనే కేటగిరీల్లో గరిష్టంగా ప్రభుత్వంపై భారం ఏ మేరకు తగ్గించవచ్చో కమిటీ వివరించినట్లు సమాచారం. ఈ మూడురకాల రుణాల మొత్తం దాదాపు రూ. 87,000 కోట్లకు పైగా ఉండగా.. ఇప్పుడు కమిటీ పంట రుణాల కింద రూ. 25,000 కోట్లు, బంగారు రుణాలపై రూ. 5,000 కోట్లు ప్రభుత్వం భరించేలా కొన్ని సిఫారసులు అందించినట్లు చెప్తున్నారు. ఒక ఇంటిలో రెండు, మూడు వ్యవసాయ రుణాలున్నా ఒక్కదానికే ప్రభుత్వం ఇచ్చే మాఫీ వర్తించేలా ఒక ప్రతిపాదన కూడా కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలు గట్టెక్కటానికేనా?
రుణ మాఫీపై కోటయ్య కమిటీ ప్రాథమిక నివేదికను ఆదివారం నాటికే ఇవ్వాల్సి ఉన్నా దానికి మరికొంత సమయం పొడిగించడం వ్యూహాత్మకమేనని స్పష్టమవుతోంది. కమిటీ ఇచ్చేది ప్రాథమిక నివేదికే అయినా దానికీ గడువు కోరడం విచిత్రంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. తుది నివేదికకు గడువు ఇవ్వడమన్నది ఉంటుంది కానీ మధ్యంతర నివేదికకు గడువు ఏమిటని పరిశీలకులు ముక్కున వేలేసుకుంటున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం మరి కొంత కాలం కాలయాపన చేయడానికే ఈ ఎత్తుగడగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున కమిటీ నివేదిక ఇస్తే.. అందులోని ప్రతికూలాంశాలపై శాసనసభలో ప్రతిపక్షం నుంచి ఎదురుదాడి తప్పదని.. దాన్నుంచి తప్పించుకోవడానికే కమిటీ మధ్యంతర నివేదికను జాప్యం చేయించినట్లుగా స్పష్టమవుతోందని నిపుణులు చెప్తున్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ అవసరం: కుటుంబరావు
రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టాన్ని సవరించేలా కేంద్రాన్ని ఒప్పించాల్సిన అవసరముందని కోటయ్య కమిటీ సభ్యుడు సి.కుటుంబరావు అభిప్రాయపడ్డారు.