ఎన్నాళ్లిలా? | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా?

Published Sun, Aug 17 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver

రుణమాఫీ అమలు చేయకుండా మూడు నెలలుగా నెట్టుకొస్తున్న బాబు
కోటయ్య కమిటీ, రీషెడ్యూలు, కేబినెట్ నిర్ణయం, జీవో జారీ అంటూ కాలయాపన
ఆర్‌బీఐ, నాబార్డు ఆదేశాలే బ్యాంకులకు శిరోధార్యం
రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు ఇవ్వజాలదంటున్న బ్యాంకర్లు
యథావిధిగా రైతులకు నోటీసులు.. జప్తులు
రుణమాఫీ అమలు కాకపోతే జిల్లాలో రైతుల నెత్తిన అదనంగా రూ.858.41 కోట్ల వడ్డీ భారం
అనంతపురం : జనం ముందుకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తమ ప్రభుత్వం ఏదో చేసేస్తోందన్న భ్రమను కల్గించే విధంగా చంద్రబాబు, ఆయన అనుంగు మంత్రులు వ్యవహరిస్తూ వస్తున్నారని ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎన్నికల ముందేమో తన తొలి సంతకం రుణమాఫీ ఫైలుపైనేనని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రోజున నిజంగా ఆ ఫైలుపైనే సంతకం చేస్తారేమోనన్న భావన కలుగజేశారు. చివరకు విధివిధానాల కోసం ‘కోటయ్య కమిటీ’ నియామకం ఫైలుపై సంతకం చేశారు. ఆ కమిటీ నివేదిక పేరుతో కొద్ది రోజులు గడిపి.. జూన్ 30న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణమాఫీ గురించి కాకుండా రీషెడ్యూల్‌పై మాట్లాడారు. జూలై 16, 17 తేదీల్లో చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.

ఈ పర్యటనకు రెండు, మూడు రోజుల ముందు నుంచి రుణాల రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ అంగీకరించిందన్న ప్రచారం ఓ ప్రణాళిక ప్రకారం జరిగింది. రీషెడ్యూల్ అయిపోయినట్లేనని, ప్రస్తుతానికైతే రైతులకు సమస్య తీరుతుందని, రీషెడ్యూలు చేసిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తుందని... ఇలా చెప్పుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించారు. తర్వాత జూలై 24, 25 తేదీల్లో అనంతపురం జిల్లా పర్యటనకొచ్చారు. అంతకు మూడు రోజుల ముందు రూ.1.5 లక్షల వరకు వ్యవసాయ రుణాలు, రూ.లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీకి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. దీనివల్ల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతుల్లో దాదాపు 96 శాతం మందికి లబ్ధి చేకూరనుందంటూ ప్రచారం చేశారు.

ఈ ప్రచారాల నేపథ్యంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. తర్వాత ఈ మూడు వారాల్లో రీషెడ్యూలు ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు తిప్పికొట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కరువు, వరదల వల్ల పంటనష్టం జరిగితే మూడు నెలల్లోపే రీషెడ్యూలుకు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, సాధారణ దిగుబడిలో 50 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే  రీషెడ్యూలు సాధ్యమవుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.  ‘మీరు ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇచ్చారు కాబట్టి..  మమ్మల్ని రీషెడ్యూలు చేయమంటే కుదరద’ని తేల్చి చెప్పింది.

ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరేసేందుకు చంద్రబాబు మళ్లీ ప్రజల ముందుకు రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రభుత్వం రుణమాఫీపై ఒక జీవోను విడుదల చేసింది. మూడు వారాల క్రితం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఈ జీవో విడుదలైంది. మళ్లీ ప్రభుత్వమూ, దాని వందిమాగధులు ‘అంతా అయిపోయింది. జీవో వచ్చేసింది. రూ.1.5 లక్షలోపు రుణాలన్నీ ఇక మాఫీ అయిపోయినట్లే’ అని ఊదరగొట్టాయి.
 
ఈ ప్రచార పటాటోపం మధ్య బాబు జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చే ప్రతి సందర్భంలోనూ రుణమాఫీపై తామేదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 
రుణమాఫీ కాకపోతే రైతు నెత్తిన రూ.858 కోట్ల వడ్డీ భారం
జిల్లాలో 6.08 లక్షల మంది రైతులు రూ.3,093 కోట్ల పంట రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది.  2.12 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన బంగారు తాకట్టు రుణాల మొత్తం రూ.1,851 కోట్లు ఉంది. దాదాపుగా ఈ మొత్తమంతా రూ.1.5 లక్షల రుణ పరిమితికి లోపలే ఉంది. 69,709 స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.1,264 కోట్లు, 5,537 చేనేత సహకార సంఘాల రుణాలు రూ.35.05 కోట్లు ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలన్నీ కలిపి మొత్తం రూ.6,243 కోట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఈ రుణాలన్నింటికీ బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి.

నిర్ణీత కాల పరిమితిలోపు రుణం తీరిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం కింద 4 శాతం వడ్డీ మాఫీతో పాటు మిగిలిన 3 శాతం(పావలా) వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి రైతులు రుణాలను ఇప్పటికీ తిరిగి చెల్లించలేదు. ఈ కారణంగా ప్రస్తుతం 11.75 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ కూడా దాటితే (సెప్టెంబర్ తర్వాత) మరో 2 శాతం వడ్డీ పెరుగుతుంది. అప్పుడు రైతులు 13.75 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన రుణమాఫీ జరగకపోతే రైతులు అదనంగా వడ్డీ కింద రూ.858.41 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
 
బ్యాంకుల ముందు జీవో చెల్లని కాగితమే
ప్రభుత్వం గురువారం రుణమాఫీపై జీవో విడుదల చేసిన నేపథ్యంలో ‘సాక్షి’ బ్యాంకర్లను కలిసి వివరణ కోరింది. బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించ జాలవని వారు స్పష్టం చేశారు. సహకార రంగంలోని బ్యాంకులకైతే నాబార్డ్, మిగతా బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేస్తాయని, వాటి ప్రకారమే బ్యాంకులు నడుచుకుంటాయని వారు స్పష్టం చేశారు. ‘రైతులు బ్యాంకుల వద్ద రుణం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని రైతులైనా చెల్లించాలి లేదా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమైనా కట్టాలి. డబ్బు చెల్లించకుండా వట్టిమాటలు ఎన్ని చెప్పినా రుణాలు మాఫీకావు. ఆర్‌బీఐ సూచనల మేరకు రుణాల వసూళ్లకు సంబంధించి నోటీసుల జారీ, బంగారు, భూముల వేలం లాంటి చర్యలు ఉంటాయ’ని వారు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement