మాఫీ అటకెక్కినట్టే | chandrababu fails to election stunt | Sakshi
Sakshi News home page

మాఫీ అటకెక్కినట్టే

Published Thu, Jul 17 2014 3:36 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మాఫీ అటకెక్కినట్టే - Sakshi

మాఫీ అటకెక్కినట్టే

హైదరాబాద్:  అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ రైతులకు ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ అటకెక్కినట్టే..! ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆఫైలు మీదే చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఇప్పుడు మొండిచేయి చూపించే దిశగా అడుగులు కదుపుతున్నారు. రుణాల మాఫీని క్రమేణా పక్కన పెడుతూ తానేదో ఘనత సాధించినట్టుగా రీషెడ్యూలు చేయించడాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కోటి మందికి పైగా రైతులకు సంబంధించి రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా.. ఆ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు రీషెడ్యూలు అంటూ రైతులపై మరింత భారం మోపడం పట్ల రైతాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది.

రీషెడ్యూలే గొప్ప పనిగా ప్రచారం: తొలి సంతకం రుణ మాఫీ ఫైలు పైనే పెడతానని ఎన్నికల సందర్భంగా చెప్పిన చంద్రబాబు.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజున నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో కమిటీ వేయడం మొదలుకొని.. గడిచిన 40 రోజులుగా ఈ విషయంలో దాటవేత ధోరణితోనే వెళుతున్నారు. రకరకాల ఆంక్షలు, పరిమితులు పెడుతూనే మరోవైపు రీషెడ్యూలు కోసం తమ ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందన్న విధంగా ప్రచారం కల్పించుకున్నారు. అయితే రీషెడ్యూలు వల్ల రైతుల రుణాలన్నీ వారి పేరుతోనే ఉండగా, రీషెడ్యూలు వల్ల ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది. రైతులు పావలా వడ్డీ కాదు కదా ఇక నుంచి వారి రుణాలపై 13.5 శాతం మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఆ రుణాలు చెల్లించేంతవరకు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలతో సహా దస్తావేజులన్నీ బ్యాంకు వద్దే తనఖా ఉంటాయి.

వ్యవసాయ రుణాలపై మాట మార్చేశారు: ఎన్నికల ముందు వ్యవసాయ రుణాల మాఫీ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అవి రూ. 87,612 కోట్లకుపైగా ఉండటంతో పంట రుణాలంటూ మాటమార్చారు. రుణ మాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీకి నిర్దేశించిన విధివిధానాల్లోనూ పంట రుణాలుగా నిర్దేశించారు. బంగారం కుదువపెట్టి తెచ్చిన పంట రుణాలు మాఫీ గురించి కాకుండా అవి ఎన్ని ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. 15 రోజుల్లోగా కమిటీ ప్రాధమిక నివేదికను అందించాలని, 45 రోజుల్లో తుది నివేదికను అందించాలని గడువు విధించారు. తుదిగడువు ముంచుకువస్తున్నా కమిటీ ఇంకా తన నివేదికను సమర్పించలేదు. ప్రాధమిక నివేదికకే సమయం కోరడంతో ప్రభుత్వం దాన్ని పెంచింది.

అసలు మాఫీ మాటే మార్చేశారు: క్రమేణా రుణ మాఫీని పక్కనపెడుతూ...  రీషెడ్యూల్‌ను తెరపైకి తెచ్చారు.  కొద్ది రోజులుగా రీషెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు అధికారులతో సంప్రదింపుల పేరిట జరుగుతున్న తంతు అంతా అసలు విషయం నుంచి అందరి దృష్టినీ పక్కదారి పట్టించే వ్యూహమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ కోసం రిజర్వు బ్యాంకును ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డామన్నట్లుగా ప్రజల్లో భారీ ప్రచారానికి తెరతీశారు. రుణాల రీషెడ్యూల్‌తో రైతులకు కొత్తగా రుణాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

రైతు నడ్డి విరిచే రీషెడ్యూల్: వాస్తవానికి రుణాల రీషెడ్యూల్‌తో రైతులకు కొత్త రుణాల అందుబాటులోకి రావడం మాట అటుంచి రైతులకు అది వడ్డీలతో పెనుభారాన్నే మిగులుస్తుంది. పైగా రుణాల మాఫీ చేస్తామని పైకి ప్రకటిస్తూనే రీషెడ్యూల్‌ను సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించాలని రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా రుణమాఫీ చేయకుండా తప్పించుకోవటానికేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల రుణాల మాఫీ అయితే కొత్త రుణాలు మంజూరు బ్యాంకులు వాటంతట అవే అమలుచేస్తాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా రీషెడ్యూల్ దిశగా వెళ్లడం వెనుక కేవలం మాఫీ అంశాన్ని సాధ్యమైనంత మేర నాన్చి అటకెక్కించడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. రుణాల రీషెడ్యూల్ వల్ల రైతులకు ఒరిగేదైమైనా ఉందా అంటే అదీ కనిపిచండం లేదు. రైతులు సకాలంలో రుణాలు చెల్లిస్తే వారికి వడ్డీరాయితీ పథకాలు వర్తిస్తాయి. ప్రస్తుతం పావలా వడ్డీ రైతులకు వర్తిస్తోంది. రీషెడ్యూల్ చేస్తే పావలా వడ్డీ వర్తించదు. సకాలంలో చెల్లించని రుణాలపై 13.5% వడ్డీ పడుతుంది. రీషెడ్యూల్ అనగానే రైతులకు అది భారమే తప్ప మేలు కాదు. పైగా రుణాల రీషెడ్యూల్ తరువాతైనా వాటిని వడ్డీలతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిందే. అప్పుడైనా ఈ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందా? అంటే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టతలేదు. ప్రభుత్వం చెల్లించకపోతే రైతుల నుంచి బ్యాంకులు వడ్డీతో సహా వసూలు చేయతప్పదు. వాస్తవానికి పావలా వడ్డీ కాస్తా ఏడాది దాటాక 13.5%గా మారుతుంది. అది ఏడేళ్ల పాటు కొనసాగితే వడ్డీ మీద మళ్లీ చక్రవడ్డీలు పడి ఈ రుణ భారం భారీగా పెరిగిపోతుంది. రైతులు అసలూ కట్టలేక వడ్డీలూ చెల్లించలేక.. మరింత దయనీయ పరిస్థితుల్లో పడిపోతారు.
 అత్యవసరమైతే భూమి పత్రాలూ రావు: అదీగాక.. రైతుల భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రీషెడ్యూల్ వల్ల భూముల పత్రాలు బ్యాంకుల వద్దే ఉండిపోతాయి. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని అమ్మి తన కష్టాలను గట్టెక్కించుకోవాలనుకునే రైతులకు ఆ అవకాశం ఉండదు. భూమి పత్రాలు బ్యాంకుల నుంచి తీసుకోవాలంటే తానే స్వయంగా రుణం కట్టుకోవాలి తప్ప మరో మార్గం లేదు.  

రీషెడ్యూల్ అయ్యేదీ రూ. 10,000 కోట్లే: పైగా.. రీషెడ్యూల్ అనేది పంట రుణాలకు తప్ప టర్మ్, బంగారు రుణాలకు వర్తించదు. రాష్ట్రంలోని 572 మండలాలకే రీషెడ్యూల్ అమలవుతుంది. 86 మండలాలు రీషెడ్యూల్ పరిధిలో లేవు. దీంతో పంట రుణాల కింద ప్రస్తుత లెక్కల ప్రకారం కేవలం రూ. 10,500 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ అవుతాయి. ప్రస్తుతం వ్యవసాయరుణాల బకాయిలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ. 87,612 కోట్లు ఉన్నాయి. మిగతా మొత్తం రుణాల సంగతి ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్న. దాదాపు రూ. 78,000 కోట్లు వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు కనీసం రీషెడ్యూల్ కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా ఇలావుంటే.. డ్వాక్రా రుణాల మాఫీని చంద్రబాబు అసలు పట్టించుకోవడమే లేదు. రూ. 14,000 కోట్ల డ్వాక్రా రుణాల సంగతి తేల్చకపోవడంతో ఇప్పటికే బ్యాంకులు బకాయిల వసూలుకు మహిళా గ్రూపులపై ఒత్తిడి చేస్తున్నాయి.

రకరకాల మాటలతో మాయ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి బంగారు రుణాలపై మాఫీ వర్తించదని, మరోసారి కుటుంబానికి ఒక్కటే రుణమంటూ ప్రకటనలు చేస్తున్నారు. రుణాల మాఫీపై ఏదో చేస్తున్నట్లు కనిపించడానికే ఇలాంటి ప్రకటనలన్నది స్పష్టమవుతోంది. ఒకపక్క రీ షెడ్యూల్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నట్లు దాని కోసం ఎంతో కసరత్తు చేస్తున్నట్లుగా బయటకు ఫోకస్ ఇస్తుండటమే కాక.. బంగారు రుణాల మాఫీ ఉండదని, రుణాల రీషెడ్యూల్‌ను నాలుగేళ్లు, ఏడేళ్లు ఉంటుందని, ఆ తరువాత రుణాలు ఎవరు చెల్లించాలో తదుపరి నిర్ణయిస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ పదవీకాలం అప్పటికి ముగుస్తుంది కనుక ఆపై రుణాల మాఫీ బాధ్యత టీడీపీపై ఉండదన్న భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కాలపరిమితి అయిదేళ్లే. ఏడేళ్ల తరువాత రైతుల రుణాలు ఎవరు తీర్చాలి? ప్రభుత్వం తీరుస్తుందా? రైతులే కట్టుకోవాలా? అంటే దానిపై స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తుండడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement