దారుణం.. పరువు వేలం
► మహిళా రైతులకు పసుపుతాడే దిక్కుఅప్పు కొండంత.. చెల్లించింది గోరంత
► గతేడాది విదిల్చిన రూ.47 కోట్లు వడ్డీకి సరివడ్డీకి వడ్డీ... పెరిగి పేరుకుపోయిన అప్పులు
► తీసుకున్నరుణాలు చెల్లించాంటూ బ్యాంకర్ల ఒత్తిళ్లుచెల్లించని వారి ఆభరణాలు వేలమంటూ ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఓట్ల కోసం చంద్రబాబు ఇచ్చిన హామీ రైతుల మెడకు చుట్టుకుంది. టీడీపీ అధినేత ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటంతో జిల్లాలో వేలాదిమంది ఆడపడుచులకు పసుపుతాడే దిక్కైంది. అభరణాలపై ఆశలు వదలుకున్న వారినీ బ్యాంకర్లు వదల్లేదు. తీసుకున్న అప్పును వెంటనే చెల్లించి బంగారు ఆభరణాలను విడిపించుకోవాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. దీంతో మహిళా రైతులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లోలోన కుమిలిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారమే లక్ష్యంగా రైతులకు ఉచిత హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న రుణాలన్నీ మఫీ చేస్తానని ప్రకటించారు. బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలకు సంబంధించిన రుణాలు, వడ్డీని సైతం మాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటానని గొప్పలు చెప్పారు. బాబు గారడీ మాటలు నమ్మిన రైతులు ఓట్లేసి గద్దెనెక్కించారు.
అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా రైతుల రుణాలు మాఫీ కాలేదు. మహిళలు బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలు మెడమీదకు రాలేదు. జిల్లావ్యాప్తంగా 2,20,625 మంది రైతులు పంటల సాగు కోసం 401బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ. 921 కోట్లను అప్పుగా తీసుకున్నారు. ఈ మొత్తం 2014 మార్చి వరకు మాత్రమే. ప్రస్తుతం అసలు, వడ్డీ కలిపి ఫిబ్రవరి నెల చివరి వరకు రూ.1,359 కోట్లకు చేరింది. రైతులు బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణం మొత్తాన్ని బట్టి 7 నుంచి 14 శాతం వరకు వడ్డీ చెలించాల్సి ఉంటుంది.
అప్పు కొండంత.. చెల్లించింది గోరంత
జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు తీసుకున్న అప్పు, వడ్డీ మొత్తం కలిపి రూ.1,359 కోట్లకు చేరింది. అయితే ప్రభుత్వం గత ఏడాదిలో రూ.237 కోట్లు బంగారు తనఖా రుణాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అందులో తొలివిడతగా 20 శాతం చొప్పున రూ.47.4 కోట్లు నిధులను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఆ రూ.47.4 కోట్లు వడ్డీల కింద జమచేసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన రైతులు బంగారు ఆభరణాలపైన తీసుకున్న రుణాలకు ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లించలేదని తేలిపోయింది.
దీంతో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తీసుకోలేకపోవటంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 401 బ్యాంకుశాఖలకు చెందిన సిబ్బంది 50 వేలమందికిపైగా నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో27వేలమంది రైతుల బంగారం వేలంవేయమని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. బ్యాంకర్లు నోటీసులు ఇవ్వటంపై మీడియాలో కథనాలు రావటం తో అధికారులు జాగ్రత్తపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా బ్యాంకర్లు నేరుగా రైతుల ఇళ్లకువెళ్లి ఒత్తిడిచేయటం ప్రారంభించారు. దీంతో కొందరు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఆభరణాలను విడిపించుకుంటున్నారు. మరి కొందరు చేసేది లేక వదిలేసుకుంటున్నారు.