వేమూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాదయాత్ర
రోడ్ల నిర్మాణాలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం
ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
పథకాల అమల్లో అవినీతిని సహించేది లేదని హెచ్చరిక
మురుగుతో ఇబ్బంది పడుతున్నట్టు ఏకరువు పెట్టిన మహిళలు
చుండూరు/ కొల్లూరు/ అమృతలూరు : తెలుగుదేశం పార్టీ తలపెట్టిన జనచైతన్య యాత్రలను మంగళవారం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వేమూరులో ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభ లో ప్రసంగించారు. 14 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎలా నిర్వహించాలనే దానిపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. తొలుత మార్కెట్ యార్డుకు చేరుకున్న సీఎం స్వయంగా బుల్లెట్ నడుపుతూ రైలు గేటు వరకు వచ్చారు. అక్కడి నుంచి పాదయాత్రగా సభా వేదిక వద్దకు రావాల్సి ఉండగా, ఆయన దళితవాడలోకి ప్రవేశించి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు డ్వాక్రా, రైతు రుణమాఫీలపై ముఖ్యమంత్రిని నిలదీశారు. రుణమాఫీ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాకపోవడంతో వడ్డీలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా మురుగు సమస్య కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు మహిళలు ఏకరువు పెట్టారు. వీటిని పరిశీలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి ముందుకు కదిలారు. అదే ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆ తరువాత సభావేదిక వద్దకు చేరుకుని ప్రసంగించారు.
పోతార్లంకకు నిధులు ....
కొల్లూరు మండలంలో ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందించే పోతార్లంక సాగునీటి పథకం పునఃనిర్మాణానికి రూ.49.6కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లంక గ్రామాల్లో రైతుల సాగులో ఉన్న జమిందారీ భూములకు త్వరలో పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తానని తెలిపారు. జంపని చక్కెర కర్మగార ఉద్యోగులకు న్యాయం చేసి, కర్మగార భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని చెప్పారు. పెరవలి- పెరవలిపాలెం మధ్య కూలిన వంతెనను పునః నిర్మిస్తామని ప్రకటించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు రెండవ పంట సాగుకు అవసరమైన విత్తనాలను 80శాతం సబ్సిడీపై ఇస్తున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు.
రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు పూర్తి చేయాలి.
జనచైతన్య యాత్రకు వేమూరు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రోడ్లు, మురుగు కాల్వలపైనే ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేశారు. అలాగే వాటి నిర్మాణాలకు రూ.5.50 కోట్ల నిధులు అవసరమవుతాయని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీనిపై స్పందించిన సీఎం రోడ్డు నిర్మాణాలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తానని ప్రకటించారు. నిర్మాణంలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట కిమిడి కళా వెంకట్రావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ , రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్, సర్పంచ్ మన్నె వాణి, ఎంపీటీసీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జనచైతన్య యాత్రలకు శ్రీకారం
Published Wed, Dec 2 2015 1:00 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement