కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సాగుకు ప్రభుత్వంతోపాటు ప్రకృతి కూడా సహకరించడం లేదు. ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఆశించిన వర్షం కురవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రుణమాఫీపై ఎటూ తేల్చకుండా కాలయపన చేస్తున్నారు. మార్గదర్శకాల కోసం మొదట కోటయ్య కమిటీని వేశారు.. నిధుల సమీకరణ కోసమంటూ మరో కమిటీని నియమించారు.
ఇది పని పూర్తిచేసి రైతులకు రుణమాఫీ అయ్యే సరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లాలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం బ్యాంకర్లను కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. అయితే వారు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదిలా ఉండగా బంగారంపై వ్యవసాయ రుణాలు తీసుకున్న అన్నదాతల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. రికవరీల కోసం బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. శిరివెళ్ల మండలంలో దాదాపు 200 మందికి నోటీసులు అందాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెట్టుబడుల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రుణాలు దొరకక అల్లాడుతున్నామని పలువురు రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో కాడి వదిలేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి తగ్గిన సాగు..
ఇంతవరకు సరైన వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్ సాగులో పురోగతి కనిపించడం లేదు. అంతంత మాత్రం తేమలో విత్తనాలు వేసినా అవి మొలకెత్తలేదు. మొలకెత్తిన పైర్లు వానలు లేక ఎండిపోతున్నాయి. అరకొర పదనులో ఈ ఏడాది 1.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. అలాగే 33 వేల హెక్టార్లలో వేరుశనగను విత్తారు. అక్కడక్కడ మొక్కజొన్న, ఆముదం, కంది పంటలు సాగు చేశారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ. కాగా, 66.5 మి.మీ నమోదైంది. జూలై నెలలో 117 మి.మీకు గాను 85 మి.మీ వర్షపాతం నమోదయింది.
వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు చెరువుల్లో చుక్క నీరు లేదు. అలాగే ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 2.56 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంతంత మాత్రం తేమలో పంటలు వేయడంతో కొద్ది రోజుల బెట్టను తట్టుకోలేక ఎండిపోతున్నాయి. జిల్లాలో దాదాపు 25 మండలాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తి నిరాశజనకంగా మారింది.
చాగలమర్రి మండలంలో ఈ నెల అత్యల్ప వర్షపాతం నమోదయింది. కేవలం 4.6 మి.మీ. వర్షం మాత్రమే ఇక్కడ కురిసింది. అలాగే వెల్దుర్తి, బేతంచెర్ల, ఉయ్యాలవాడ మండలాల్లో అతి తక్కువగా వర్షాలు కురిశాయి. మద్దికెర, పాణ్యం, క్రిష్ణగిరి, కోడుమూరు, ఆస్పరి, పగిడ్యాల, గోనెగండ్ల, జూపాడుబంగ్లా, ఎమ్మిగనూరు, నందవరం, ఓర్వకల్లు, దేవనకొండ, దొర్నిపాడు, ప్యాపిలి, తుగ్గలి, పత్తికొండ, రుద్రవరం తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. జిల్లాలో 88645 హెక్టార్లలో వరిని పండించాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుల్లోకి నీరు చేరకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రమాద స్థాయిలో భూగర్భజలాలు
ఆశాజనకంగా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. జిల్లాలో బావులు, బోర్ల కింద దాదాపు 20 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు పడిపోతుండటంతో పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లో 10.77 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు మే నెలలో 11.13 మీటర్లకు పడిపోయాయి. జూన్ నెలలో 11.40 మీటర్లకు తగ్గిపోయాయి.
ఖరీఫ్.. కటకట
Published Sun, Jul 27 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement