కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాదీ జిల్లావాసులకు కరువు తప్పేటట్లు లేదు. దాదాపు 6.50 లక్షల మంది పరిస్థితి ఇదే. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే నెల రోజులు గడిచిపోయింది. కాని వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భూమిలో తేమ లేక, చినుకు జాడ లేక కళ్లముందే లేత మొక్కలు ఎండల తీవ్రతకు మాడిపోతుండటంతో రైతులు విలవిల్లాడుతున్నారు.
ముందుకు సాగని ఖరీప్..
రోజులు గడిచిపోతున్న ఖరీఫ్ పనులు ముందుకు సాగడం లేదు. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 1,07,279 హెక్టార్లలో విత్తనం పనులు పూర్తయ్యాయి. ఈ సారి ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండటం, రుతు పవనాల జాడ లేకపోవడం, కనీసం అల్ప పీడనాలు కూడా లేకపోవడంతో వాతావరణం ఎండాకాలం మాదిరిగానే ఉంటోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
జిల్లా సాధారణ సాగు 5,85,351 హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 73,965 మాత్రమే విత్తనం పడింది. గతేడాదితో పోలిస్తే 23315 హెక్టార్లలో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. వివిధ మండలాల నుంచి అందిన సమాచారం మేరకు 25 వేల హెక్టార్లలో మొలకెత్తిన మొక్కలు ఎండిపోగా, మరో 20 వేల హెక్టార్లలో తేమ లేకపోవడం వల్ల విత్తనం మొలకెత్తనే లేదు. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎండల ధాటికి భూములు పగుళ్లు వస్తున్నాయి.
అడుగంటిన భూగర్భ జలాలు..
జూన్ నెలలో 77.1 మి.మీ., వర్షపాతం నమోదు కావాలి. అయితే 64 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదు అయింది. జిల్లాలో చెరువులు, కుంటలన్నీ నీరు లేక వెలవెలపోతున్నాయి. ఇందువల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాధారం కింద 65,544 హెక్టార్లలోనూ, బావులు, బోర్ల కింద 8421 హెక్టార్లలోనూ విత్తన పడింది. బావులు, బోర్లలో నీటి మట్టం పూర్తిగా పడిపోవడం, విద్యుత్ కోతల వల్ల 80 శాతం పంటలు దెబ్బతిన్నాయి. ఆదోని మండలంలో భూగర్భ జలాలు 55 మీటర్ల అడుగుకు వెళ్లిపోయాయంటే భూగర్భ జలాలు ఏ స్థాయికి పడిపోయాయో తెలుస్తోంది. ఒకవైపు పంటలు ఎండుతుండగా గ్రామాలు దాహార్తి బారిన పడుతున్నాయి. జిల్లాలో దాదాపు 300 గ్రామాల్లో వారానికి ఒక రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
కరువు తప్పదా...
ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు రుతు పవనాలు జాడ లేకపోవడంతో ఈ ఏడాది కరువు తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గతేడాది జూన్ ప్రథమార్థంలో వర్షాలు లేకపోయినా ద్వితీయార్థంలో వర్షాలు విస్తృతంగా పడ్డాయి. అందువల్లనే గతేడాది జూన్ 28 నాటికే 1,03,279 హెక్టార్లలో విత్తనం పడింది. ఈ సారి జూన్ మొదటి వారంలో వర్షాలు పడినా తర్వాత మొండికేయడంతో పంటల సాగు 73,965 హెక్టార్లకే పరిమితం అయింది. ఈ సారి జిల్లా కరువు బారిన పడే ప్రమాదం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారమే జిల్లాలో 23 మండలాల్లో ఖరీఫ్ పరిస్థితి దయనీయంగా ఉందని, మిగిలిన మండలాల్లో మరో నాలుగైదు రోజుల్లో వర్షాలు పడకపోతే పంటల భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంటున్నారు.
అప్పుల ఊబిలో రైతులు..
చంద్రబాబు ప్రభుత్వ విధానాల వల్ల రైతులు బ్యాంకుల నుండి పంట రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతుండటం వల్ల పెట్టిన పెట్టుబడులు మట్టి పాలవుతున్నాయి. జిల్లాలో 6.50 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 90 శాతం మంది అప్పుల్లో మునిగి తేలుతున్నారు.
తరుముకొస్తున్న కరువు..!
Published Wed, Jul 2 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement