కరువు నివారణకు కార్యాచరణ
► ఐదుగురు మంత్రులతో కమిటీ
► అధికారులతో మంత్రి రవీంద్ర సమీక్ష
సాక్షి,విశాఖపట్నం: రాష్ర్టం శాశ్వత కరువు నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్టు రాష్ర్ట బీసీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.రవీంద్ర అన్నారు. శాశ్వత కరువు నివారణకు ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోకరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లాకు ఇన్‌చార్జిగా వచ్చిన మంత్రి సమీక్షించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెంపునకు కృషిచేయాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరువు నివారణ పై చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను మంత్రికి జిల్లాకలెక్టర్ ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిం చారు. జిల్లాకు కరువు నివారణకు రూ.3కోట్లు కేటాయించిందన్నారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాలో 1470 చలివేంద్రా లు, రాష్ర్టప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో 204 మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హేబిటేషన్ వారీగా గొట్టపుబావుల మరమ్మతులు, కావాల్సిన చోట బోరు బావులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఎంహెచ్‌వో ద్వారా జిల్లాలో 8268 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా కేం ద్రాలు ఏర్పాటు చేశామన్నారు. చలివేంద్రాల్లో వైద్య రోగ్య సిబ్బంది ద్వారా 2,40,415 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. 3991 వైద్య అవగాహన శిబిరాలు చేసి చేసి వడగాడ్పులు, వేసవి ఎద్దడిలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు.
ఖరీఫ్‌లో పంటలకు నీటిసరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 40వేల హెక్టార్లలో కాఫీ పంటపండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్-1,2ద్వారా చేపట్టిన పనులను కలెక్టర్ వివరించారు.భూగర్భ జలమట్టా లు సాధారణ, క్లిష్ట, ఆందోళనకరంగా నమోదైన వివరాలను గ్రౌండ్ వాటర్ డీడీ శాస్త్రి వివరించారు. డ్రాట్ కంటింజెంట్ యాక్షన్‌ప్లాన్, క్రాష్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన పనులు, స్పెషల్ డెవలప్‌మెంట్ ప్రోగాం తదితర పథకాల గురించి వివరించారు.
అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ కరువు నివారణకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందంలో సభ్యుడిగా విశాఖలో కరువు పరిస్థితిని అంచనా వేసేందుకు వచ్చానన్నారు. వేసవి ఎద్దడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగ పూడి రామకృష్ణబాబు, కాపు కార్పొరేషన్ డెరైక్టర్ వై.వేణుగోపాలరావు, డీఆర్ వో చంద్రశేఖర రెడ్డి, డ్వామాపీడీ శ్రీరాములునాయుడు, ఆర్డీవోలు వెంకటేశ్వలరావు, పద్మావతి డీఎంహెచ్‌వో జె.సరోజని పాల్గొన్నారు.