చంద్రబాబు మెడకు రుణమాఫీ ఉచ్చు! | Plans for Farmers Debt waiver reducing | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మెడకు రుణమాఫీ ఉచ్చు!

Published Sun, Jun 22 2014 4:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఎన్నికల సమయంలో ముందువెనక చూడకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులు, చేనేత కార్మికుల రుణాలు,  డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీపైనే తొలి సంతకం అన్నారు.  ఇప్పుడు అదే ఆయన మెడకు ఉచ్చులా బిగుసుకోనుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. టిడిపి అధికారంలోకి వచ్చింది. తీరా తొలి సంతకం దగ్గరకు వచ్చేసరికి రుణమాఫీ కాస్త రుణమాఫీ కమిటీగా మారిపోయింది. కమిటీ పేరుతో కాలయాపన మొదలైంది.  ఇక్కడే ఓ మోసం బట్టబయలైపోయింది.  వర్షాలు కురిస్తే వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి. పాత రుణాలు మాఫీ అయితేగానీ బ్యాంకులు  కొత్త రుణాలు  ఇవ్వవు. రుణమాఫీ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని హెచ్చరిస్తున్నాయి.

రుణమాఫీ అమలును ఏదోవిధంగా అమలు చేశాం అనిపించుకోవడానికి టిడిపి ప్రభుత్వం ఎత్తులకుపైఎత్తులు వేస్తోంది.  మాఫీ చేసే రుణాలను కుదించడానికి  మార్గాలను అన్వేషిస్తోంది.  50 వేల రూపాయల లోపు - లక్ష రూపాయల లోపు- రెండు ఎకరాల లోపు రైతు- అయిదు ఎకరాల లోపు రైతు - రుణం తీసుకున్నా కాలం - ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ....ఇలా  ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా అనేక ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది.  అందులో ప్రధానమైనది రుణాల రీషెడ్యూల్‌. రుణాల రీషెడ్యూల్ అంటే ఇప్పటికే రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలను వెంటనే చెల్లించవలసిన అవసరంలేకుంవడా, వాటిని మూడు సంవత్సరాల కాలంలోపల చెల్లించే అవకాశం ఇస్తారు. అలా రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రీషెడ్యూల్ అనేది రుణాల రద్దు కాదు, బకాయిలు అలానే ఉంటాయి,  చెల్లింపునకు గడువు పొడిగింపు మాత్రమే.  రుణాలను రీషెడ్యూల్ చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, బ్యాంకులను, రిజర్వు బ్యాంకును కోరింది. పాత బకాయిలు అలా ఉంచి, బ్యాంకులు కొత్త రుణాలు ఎక్కడ నుంచి ఇస్తాయి? నగదు సర్క్యులేషన్ ఎలా? పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని రిజర్వు బ్యాంకు మొదటి నుంచి చెబూతూనే ఉంది. రుణాల రీషెడ్యూల్కు బ్యాంకులు సుముఖంగాలేవు. రైతులు కూడా అందుకు అంగీకరించడంలేదు. రైతులు రుణమాఫీని కోరుకుంటున్నారు. చెల్లించడానికి వాయిదానికాదు.

 రైతు రుణమాఫీపై అధ్యయనం కోసం నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ పమిడి కోటయ్య అధ్యక్షతన నియమించిన  కమిటీ ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమైంది.  ఈ సమావేశంలో  మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి  పాల్గొన్నారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ  రుణమాఫీపై వివరాల సేకరణకు కొంత సమయం కావాలని కమిటీ కోరినట్లు తెలిపారు. కాలయాపన కోసం ఇటువంటి మాటలు చెబుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. రుణమాఫీ, రీషెడ్యూల్కు సంబంధించి కోటయ్య కమిటీ రిజర్వు బ్యాంకుకు మూడు రోజుల క్రితం ఒక లేఖ రాసింది. ఆర్బిఐ నుంచి ఎటువంటి సమాధానం లేదు. దాంతో  కోటయ్య కమిటీ ఆర్బిఐ అధికారులను నేరుగా కలవనుంది.

ఇదిలా ఉంటే ఒక కుటుంబానికి ఒక రుణమాఫీ మాత్రమే వర్తించేలా ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షిటీవీకి చెప్పారు. రుణమాఫీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఒప్పుకునేలా  కోటయ్య కమిటీ  ప్రయత్నిస్తోందన్నారు. రిజర్వ్‌ బ్యాంకు నుంచి సమాధానం వచ్చిన తరువాత రుణమాఫీపై స్పష్టత వస్తుందని చెప్పారు.

రైతుల రుణబకాయిలను నగదు రూపంలో చెల్లించకుండా బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితిలేదు. ప్రభుత్వ హామీలను బ్యాంకులు అంగీకరించవు. ఆ విషయం రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మోసపోయినట్లు రైతులు గుర్తించడం మొదలైంది. ఏదిఏమైనా ఇప్పుడు చేయగలిగిందిలేమీలేదు. చంద్రబాబు నాయుడుకు అయిదేళ్లకు అధికారం కట్టబెట్టారు. భరించకతప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement