రుణమాఫీపై బ్యాంకర్లకు స్పష్టత ఇవ్వని చంద్రబాబు!
రుణమాఫీపై బ్యాంకర్లకు స్పష్టత ఇవ్వని చంద్రబాబు!
Published Mon, Jun 30 2014 8:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
హైదరాబాద్: రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య అనిశ్చితి కొనసాగుతోంది. రుణమాఫీపై బ్యాంకర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. ఎంత మేరకు రైతులకు రుణాలు మాఫీ చేస్తారో, ఎంతకాలం వరకు రుణాలు మాఫీ చేస్తారనే విషయాన్ని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పకపోవడంతో బ్యాంకర్లు తికమకపడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఖరీఫ్ పంటకు మాత్రం రైతులకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులున్నాయని, తొందర్లోనే రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామనడంతో చంద్రబాబు దాటవేత ధోరణిని ఎంచకున్నట్టు కనిపిస్తోంది.
రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయండని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. రుణాలు చెల్లించకపోయినా రుణమాఫీ పథకం వర్తించేలా చూస్తామన్నారు. బంగారు రుణాలపై కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాతో రుణమాఫిపై మాట్లాడుతున్నామని, అయితే ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని చంద్రబాబు తెలిపారు. బకాయిల చెల్లింపుల కోసం రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
Advertisement