చంద్రబాబు దా'రుణ' మాఫీ!
* ఏపీలో 43.93 లక్షల రైతు ఖాతాలు
* పంట రుణాల మొత్తం విలుల 28 వేల కోట్లు
* రుణ మాఫీ ఇప్పట్లో లేదంటున్న కోటయ్య కమిటీ
* మాఫీపై పూటకొక్క మాట
ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రుణమాఫీ జపం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేక మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రుణమాఫీపై చంద్రబాబు సర్కారు మాయమాటలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రైతులకు భారంగా మారుతోంది.
రుణమాఫీ ఎంతవరకు చేస్తారో ముందు తెలియకపోవడంతో రైతులు సకాలంలో చెల్లించలేదు. మహిళా సంఘాల రుణాలతో కలిపి ఒక కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకే అని ప్రభుత్వం చెప్పడంతో అంతకు మించి రుణం కలిగి, ఓవర్ డ్యూస్ అయిన రుణాలకు వడ్డీ భారం పడనుంది. ఈ విధంగా ఓవర్ డ్యూస్ అయిన రైతులకు సంబంధించినవి ఏపీలో 43.93 లక్షల ఖాతాలుండగా వాటిపై 28 వేల కోట్ల మేర రుణాలున్నాయి. లక్షన్నర రూపాయల వరకే రుణ మాఫీ అని ప్రభుత్వం ముందుగా చెప్పి ఉంటే అంతకు మించి రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించి రాయితీ పొందేవారు.
బాబు ఓవర్ యాక్షన్ తో ఓవర్ డ్యూస్ భారం - ఇప్పుడు ఓవర్ డ్యూస్ కావడంతో ఆ రుణాలకు వడ్డీ రాయితీ వర్తించబోదని అధికారులు అంటున్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు కేంద్రం ఇచ్చే 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ ఓవర్ డ్యూస్ అయిన ఖాతాలకు వర్తించబోదని బ్యాంకులు అంటున్నాయి. ఓవర్ డ్యూస్ అయిన ఖాతాల వారు 12 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇటు కోటయ్య కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న రుణ మాఫీ ఇప్పట్లో అమలు కాదని తేల్చి చెప్పింది.
భగ్గుమంటున్న రైతులు - చంద్రబాబు ప్రకటనలు రైతులను నిలువునా ముంచేశాయన్నది సుస్సష్టం. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతు రుణాలు మొత్తం మాఫీ చేయాల్సిందేనంటున్నారు రైతులు. రుణాల రద్దుపై మొదటి సంతకం చేస్తానని చెప్పి..కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సంతకం చేశారని వారు మండి పడుతున్నారు. కుటుంబానికి లక్షన్నర మాత్రమే రుణమాఫీ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీవ్రంగా స్పందించింది. రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతాంగం నోట్లో టీడీపీ సర్కార్ మట్టిగొట్టిందని ఆ పార్టీ నేతలంటున్నారు.