మరో మెలిక | government Farm loan waiver | Sakshi
Sakshi News home page

మరో మెలిక

Published Tue, Dec 23 2014 2:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మరో మెలిక - Sakshi

మరో మెలిక

ప్రొద్దుటూరు: ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు అనేక రకాల ఆంక్షలు విధించడంతో రైతులు చాలా వరకు నష్టపోయారు. ఇందుకు సంబంధించి అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో రైతులను రుణ విముక్తి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తర్వాత ఇందుకు సంబంధించి కోటయ్య కమిటీ వేయడం, రూ.1.5లక్షలకు పరిమితం చేయడం, బ్యాంక్‌ల్లో ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు ఇవ్వాలనడం, కుటుంబానికంతా కలిపి రూ.1.50లక్ష వరకే మాఫీ వర్తిస్తుందని చెప్పడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు, ఇలా ఎన్నో రకాల ఆంక్షలు విధించడంతో ఎక్కువ మంది రైతులు రుణమాఫీకి అర్హత పొందలేకపోయారు. ఇన్ని అడ్డంకులు దాటుకుని రుణమాఫీ అర్హత పొందిన రైతులకు ప్రస్తుతం మరో నిబంధన విధించారు.
 
వారికి వచ్చిన మొత్తాన్ని నేరుగా ఇవ్వకుండా ఈ నిబంధనను విధించారు. రైతు తీసుకున్న రుణం మొత్తంలో మాఫీ అర్హత పొంది ఉంటే తొలివిడత మొత్తం పోను మిగతా బాకీని తాను చెల్లిస్తానని రైతు బ్యాంక్ అధికారులకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. వాస్తవానికి ఐదేళ్లల్లో పూర్తి మొత్తాన్ని వడ్డీ సహా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం తొలివిడత మాత్రమే చెల్లించి మిగతా డబ్బును తాము చెల్లిస్తామని అన్ని బ్యాంకుల్లో రైతులతో అఫిడవిట్లు తీసుకుంటుండడం గమనార్హం. ఈ ప్రకారం ప్రభుత్వం రుణాన్ని చెల్లించకపోయినా యధావిధిగా వడ్డీ సహా రైతు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకర్లు ఈ అఫిడవిట్ ఫారాన్ని తయారు చేయగా ఇందులో రైతు కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది.

దీని వల్ల ప్రభుత్వానికి బదులు రుణం చెల్లించడంలో రైతు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే రుణమాఫీ మొత్తాన్ని అప్పులోకి బ్యాంకర్లు జమ చేసుకుని కొత్త రుణాలు ఇస్తున్నారు. సాధారణంగా పంట రుణం తీసుకునే సమయంలోనే రైతులు అనేక సంతకాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించడం జరుగుతుంది. అయితే రుణమాఫీకి సంబంధించి మిగతా బాకీని చెల్లించేందుకుగాను ఈ అఫిడవిట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని గతంలో ఇచ్చిన అఫిడవిట్‌తో సంబంధం లేదని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్లోనే అఫిడవిట్ అంశం ఉందని ఓ బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement