
చంద్రబాబుతో కోటయ్య కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆదివారం కోటయ్య కమిటీ హైదరాబాద్ లో భేటీ అయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆదివారం కోటయ్య కమిటీ హైదరాబాద్లో భేటీ అయింది. రైతు రుణమాఫీ విధి విధానాలపై రూపొందించిన నివేదికను కమిటీ చంద్రబాబుకు అందజేసింది. ఆ కమిటీ నివేదికపై మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబులతోపాటు ఢిల్లీలో ప్రభుత్వ ఆధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో చంద్రబాబు చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా రైతు రుణమాఫీ ఫైల్పై సంతకం చేస్తానంటూ ప్రకటించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం రైతు రుణమాఫీపై విధి విధానలపై కోటయ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణాలు రూ.87,612 కోట్లు. కాగా పంట రుణాలు రూ.34,105 కోట్లు. పంటకోసం బంగారంపై తీసుకున్న రుణాలు రూ.20,102 కోట్లు. టర్మ్ లోన్స్ కింద రూ.1,419 కోట్లు. టర్మ్ లోన్స్గా మారిన పంటరుణాలు రూ. 7 వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ. 14, 204 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.10,782 కోట్లు ఉన్నాయి.