లలిత్ మోదీ కోసం ప్రయాణ పత్రాలు కోరలేదు
సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేసినట్లు వచ్చిన ఆరోపణల విషయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తనను సమర్థించుకున్నారు. మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను ఎవరికీ విజ్ఞప్తి లేదా సిఫార్సు చేయలేదని శనివారం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలు తన రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆమె పలు ట్వీట్లు చేశారు. బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లలిత్ పోర్చుగల్ వెళ్లేందుకు అనుమతించాలంటూ బ్రిటన్ ఎంపీ కీత్ వాజ్‌తో తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
మానవతా దృష్టితోనే మోదీకి సాయం చేసినట్లు గతంలో చేసిన స్పందిస్తూ ‘బ్రిటన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా ఆ దేశ ప్రభుత్వానికే వదిలేశాను. దీనిపై తొలి రోజునే ట్వీట్ చేశా. నేను ప్రతిరోజూ ప్రజలకు సాయం చేస్తా. అది కూడా ఒకే ట్వీట్ ద్వారా. ఆవిడ (లలిత్ మోదీ భార్య) గత 17 ఏళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు కేన్సర్ తిరగబెట్టడం ఇది పదోసారి’ అని సుష్మ పేర్కొన్నారు.