లలిత్ కోసం సిఫారసు చేయలేదు
రాజ్యసభలో సుష్మా స్వరాజ్ స్పష్టీకరణ
* సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం
న్యూఢిల్లీ: లలిత్ మోదీ విషయంలో తనపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలమీద విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆమె సోమవారం రాజ్యసభలో ఖండించారు. వివాదాస్పదుడైన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వాల్సిందిగా తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫారసు చేయలేదని స్పష్టంచేశారు. ఈ విషయంలో విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
లలిత్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండగా, కొద్దిసేపు ఆమె మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగడంవల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను వాయిదా వేయడంతో ఆమె తన వాదనను పూర్తిగా చెప్పలేకపోయారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే సభ సజావుగా సాగడం లేదని, లలిత్‌గేట్ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రధాని స్పష్టం చేసేవరకు సభ కుదుటపడదని అన్నారు. డిప్యూటీ చైర్మన్ జోక్యంచేసుకుని చర్చ ప్రారంభిస్తేనే ప్రధాని సమాధానం చెప్పడానికి వీలుంటుందని సూచించారు.
గందరగోళం నడుమ సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి మొదలయ్యాకా అదే పరిస్థితి కొనసాగడంతో ప్రశ్నోత్తరాలు మరోసారి వాయిదాపడ్డాయి. 2గంటలప్పుడు సభ తిరిగి మొదలయ్యాక పరిస్థితిలో మార్పు లేకపోవడంతో చెప్పుకోదగ్గ కార్యక్రమాలేమీ చేపట్టకుండానే రోజు మొత్తానికి వాయిదాపడింది. సుష్మా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. నోటీసు ఇవ్వకుండానే మంత్రి ప్రకటన చేయడం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని, దానిని రికార్డుల్లోకి తీసుకోరాదని కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కోరారు.