సుష్మ, రాజెలపై మరో పిడుగు
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో ఉక్కిరిబక్కిరి అవుతున్న బీజేపీ నాయకులు సుష్మా స్వరాజ్, వసుంధరా రాజెలపై మరో పిడుగు పడింది. సొంత పార్టీ ఎంపీ ఒకరు వారి చర్యలను బహిరంగంగా తప్పుబట్టారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి చట్టపరంగా, నైతికంగా సహాయం చేసినా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. లలిత్ మోదీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
లలిత్ మోదీకి సుష్మ, రాజె సహాయం చేయడంపై రాజకీయం దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే వీరిపై సొంత పార్టీ ఎంపీ బహిరంగంగా విమర్శలు చేయడంతో కమలం పార్టీలో కలకలం రేగింది. కాగా, లలిత్ మోదీ- రాజె తనయుడు దుష్యంత్ సింగ్ పెట్టుబడులపై దర్యాప్తు కొనసాగుతోందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.