♦ బాలికతో తహసీల్దార్ విజయకుమారి
♦ పాతకోల్కుంద గ్రామంలో
♦ బాల్య వివాహ ఏర్పాట్లు నిలిపివేత
♦ వధువు, వరుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్
మోమిన్‌పేట: బలవంతంగా పెద్దలు నీకు పెళ్లి చేయాలని చూస్తే నాకు ఫోన్ చెయ్.. వెంటనే వివాహాన్ని నిలిపివేసి మీ తల్లిదండ్రులను జైలుకు పంపిస్తాం.. దాంతోపాటు నువ్వు చదువుకునేందుకు చైల్డ్ హోంకు పంపిస్తామని తహసీల్దార్ విజయకుమారి ఓ బాలికకు ధైర్యం చెప్పారు. ఈనెల 6న మండల పరిధిలోని పాత కోల్కుంద గ్రామానికి చెందిన రాములు, మాణెమ్మ దంపతుల కూతురు శివలీల(15)కు ఇదే మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కోల్కుంద కిష్టయ్య కుమారుడు పేతూరుతో వివాహం చేసేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
పదో తరగతి చదువుతున్న బాలిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. శివలీల పెళ్లి విషయం 1098కి సమాచారం అందడంతో సోమవారం ఆమె తల్లిదండ్రులను, పేతూరు తల్లిదండ్రులను తహసీల్దార్ విజయకుమారి తన కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అమ్మాయికి మైనారిటీ తీరేవరకు పెళ్లి చేయబోమని బాలిక తల్లిదండ్రులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయకుమారి బాలికకు ధైర్యం చెప్పారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు.
బాగా చదువుకొని జీవితంలో నీ సొంతకాళ్లపై నిలబడాలని సూచించారు. మీ తల్లిదండ్రులు నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నాకు ఫోన్ చెయ్.. ఆ తర్వాత నేను చూసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కాంతారావు, పీఎస్‌ఐ వెంకటేశ్వర్లు, 1098 సిబ్బంది దేవకుమారి తదితరులు ఉన్నారు.