శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టించిన రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశంలో పార్లమెంటు రద్దుకు, మధ్యంతర ఎన్నికలకు దారితీసింది. ప్రధాని పదవిలో ఉన్న రనిల్ విక్రమసింఘేను ఆకస్మికంగా ఆ పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు దాన్ని కట్టబెట్టిన సిరిసేనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. నమ్మి పదవినిచ్చిన సిరిసేనను నట్టేట ముంచి, తనతోపాటు మరో 44మంది మాజీ ఎంపీలను తీసుకుని సోదరుడు బాసిల్ రెండేళ్లక్రితం ఏర్పాటు చేసిన శ్రీలంక పొదుజన పెరిమునా(ఎస్‌ఎల్‌పీపీ)కు రాజపక్స వలసపోయారు. దాంతో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) డీలాపడింది. ఆయన వరస నిర్ణయాలను చట్టవిరుద్ధమని ప్రకటించా ల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ మొదలు కావలసి ఉండగా... సిరిసేన వీటిని బేఖాతరు చేస్తూ పార్లమెంటును రద్దు చేసి, వచ్చే జనవరి 5న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేశారు. పార్లమెంటు రద్దుకు సిరిసేన చెబుతున్న కారణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముందనుకున్నట్టు బుధవారం పార్లమెంటులో బలాబలాలు తేల్చుకోవలసి వస్తే... రనిల్, రాజపక్స వర్గాలకు చెందిన ఎంపీల మధ్య ఘర్షణలు తలెత్తి హింస చోటు చేసుకునే ప్రమాదం ఉన్నదని, అదే జరిగితే గ్రామస్థాయి వరకూ హింస చెలరేగి అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అంటున్నారు.
పార్లమెంటును రద్దు చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించానని వివరిస్తున్నారు. ఇది తన అక్రమ చర్యల్ని కప్పెట్టుకోవడం తప్ప మరేమీ కాదు. రాజపక్సకు తిరిగి అధికారం కట్టబెట్టడంపై తన పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఓటింగ్ అంటూ జరిగితే తన నిర్ణయం వీగిపోవడం ఖాయమని గ్రహించబట్టే ఆయన మరో తప్పుడు చర్యకు సిద్ధపడ్డారు. ప్రధాని తొలగింపు వ్యవహారం మాదిరే పార్లమెంటు రద్దు కూడా రాజ్యాంగ విరుద్ధమే. పార్లమెంటు సభ్యుల్లో మూడింట రెండు వంతులమంది కోరితే తప్ప పార్లమెంటు రద్దు చేయరాదని మూడేళ్లక్రితం తీసుకొచ్చిన 19వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. మరో అధికరణలో పార్లమెంటు రద్దుకు సంబంధించిన అధికారం గురించిన ప్రస్తావన ఉంది గనుక సిరిసేన చర్య చెల్లుతుందని ఆయన మద్దతుదార్లు వాదిస్తున్నారు. ఆయన చర్యలపై సుప్రీంకోర్టు నిష్పాక్షికంగా విచారణ జరిపితే దీన్లోని రాజ్యాంగ విరుద్ధత తేటతెల్లమవుతుంది. ప్రజలెన్నుకునే పార్లమెంటుపై అధ్యక్షుడు నిరంకుశంగా పెత్తనం చలాయించడానికి వీల్లేదని దేశంలోని ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఉద్యమిస్తున్నారు. ఈ అపరిమిత అధికారాల తొలగింపునకు తాను సిద్ధపడతానని 2015లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సిరిసేన హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చడం కోసం 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీరా ఆచరణలోకొచ్చేసరికి దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.
ఈ విషయంలో సిరిసేనతో చేతులు కలిపి రాజపక్స తప్పుచేశారు. 2005లో అధ్యక్షుడై నప్పటినుంచీ రాజపక్స చైనాకు సన్నిహితంగా మెలిగారు. వారి సహకారంతోనే తమిళ టైగర్లను తీవ్రంగా అణచివేశారు. ఈ క్రమంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు సంజాయిషీ కోరుతున్నాయి. తమిళ టైగర్ల విషయంలో చేసిన సాయానికి కృతజ్ఞతగా రాజపక్స చైనాకు భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టు లిచ్చారు. ఆ దేశం నుంచే తుపాకులు, ఇతర రక్షణ సామగ్రి కొన్నారు. 2014లో కొలంబో నౌకాశ్రయంలో చైనా జలాంతర్గామి ఉనికి వెల్లడయ్యాక మన దేశం కూడా అప్రమత్తమైంది. దాని ఫలితంగానే 2015 ఎన్నికల్లో ఏమాత్రం పొసగని విక్రమసింఘే–సిరిసేనల మధ్య అవగాహన సాధ్యపడిందని చెబుతారు. మూడున్నరేళ్ల తర్వాత ఆ అమరిక దెబ్బతినడం వెనక చైనా ఉండొచ్చునని రాజకీయ నిపుణుల అంచనా. తమ ఎంపీలను కొనడానికి చైనా డబ్బు కుమ్మరిస్తున్నదని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేత ఈమధ్యే ఆరోపించారు. ఇప్పుడు సిరిసేన, రాజపక్సల మధ్య కృత్రిమ మైత్రి కుదిర్చి, విక్రమసింఘేను సాగనంపడంలో చైనా పాత్ర ఉన్నదని స్థానిక మీడియా చెబుతోంది. కానీ సిరిసేన, రాజపక్సల మైత్రికి మెజారిటీ పార్లమెంటు సభ్యుల ఆమోదం లేకపోవడంతో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అయింది.
రాజపక్స 2005–15 మధ్య సింహళ జాతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా దీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని కూడా 2015 ఎన్నికల సందర్భంగా ఆయన హెచ్చరించారు. అయితే అవినీతి, బంధుప్రీతి ఆరో పణల వల్లా, ఆర్థిక రంగంలో చవిచూసిన దారుణ వైఫల్యాల వల్లా సింహళులు ఆయన్ను తిరస్కరించారు. అటు తమిళులు, ముస్లింలలో 70 శాతంమంది అప్పట్లో సిరిసేనకు మద్దతు పలికారు. ఫలితంగా రాజపక్స వైదొలగవవలసి వచ్చింది. ఇప్పుడాయన తన బాణీ మార్చారు. జైళ్లలో మగ్గుతున్న తమిళుల విడుదలకు తమ పార్టీ అవసరమైన చర్యలు తీసుకుం టుందని కుమారుడి ద్వారా చెప్పించారు. అయితే లంక తమిళులు ఈ విషయంలో రాజపక్సను ఏమేరకు నమ్ముతారో అనుమానమే. దానిమాటెలా ఉన్నా శ్రీలంక రాజకీయ సంక్షోభం అంతర్జాతీయంగా ఆ దేశానికి అప్రదిష్ట మిగిల్చింది. ఆ దేశానికి విడుదల చేయాల్సి ఉన్న 50 కోట్ల డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. జపాన్ నుంచి రావలసిన 140 కోట్ల రుణం కూడా ఆగిపోయింది. శ్రీలంక నుంచి వచ్చే దిగుమతులకు సుంకం మినహాయింపును ఉపసంహరిస్తామని యూరప్ యూనియన్(ఈయూ) హెచ్చరించింది. వివిధ రంగాల్లో ఇప్పటికే 800 కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ప్రస్తుత అనిశ్చితిలో కొత్తగా రుణాలు మంజూరు చేసి ఆదుకోవడం కష్టమే. సిరిసేనకు ఇది గడ్డుకాలం. దీన్నుంచి గట్టెక్కలేకపోతే రాజకీయంగా తెరమరుగుకావడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment