Mahindra Rajapaksa
-
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
-
శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలలోని శ్రీ వెకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. రాజపక్సేకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రధాని రాజపక్సే ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రాజపక్సేకు పూజారులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రధాని రాజపక్సే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. -
శ్రీలంక అధ్యక్షుడిగా 'టర్మినేటర్'
కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద్ర రాజపక్స సోదరుడు 'టర్మినేటర్' అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే గోటబయ రాజపక్స విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు. అధికారికంగా రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా ప్రకటించనున్నారు. అయితే రాజపక్స గెలిచినట్టు ఇటు ఎస్ఎల్పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి. ఆదివారం ఉదయం 12 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87శాతం ఓట్లు గెలుచుకోగా, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీకి చెందిన గృహ మంత్రి సజిత్ ప్రేమదాసకు 44.4 శాతం వరకూ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు ఎన్నికలు జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, 80 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మహీంద్ర దేశప్రియ వెల్లడించారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం.. -
ముదిరిన లంక సంక్షోభం
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టించిన రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశంలో పార్లమెంటు రద్దుకు, మధ్యంతర ఎన్నికలకు దారితీసింది. ప్రధాని పదవిలో ఉన్న రనిల్ విక్రమసింఘేను ఆకస్మికంగా ఆ పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు దాన్ని కట్టబెట్టిన సిరిసేనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. నమ్మి పదవినిచ్చిన సిరిసేనను నట్టేట ముంచి, తనతోపాటు మరో 44మంది మాజీ ఎంపీలను తీసుకుని సోదరుడు బాసిల్ రెండేళ్లక్రితం ఏర్పాటు చేసిన శ్రీలంక పొదుజన పెరిమునా(ఎస్ఎల్పీపీ)కు రాజపక్స వలసపోయారు. దాంతో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) డీలాపడింది. ఆయన వరస నిర్ణయాలను చట్టవిరుద్ధమని ప్రకటించా ల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ మొదలు కావలసి ఉండగా... సిరిసేన వీటిని బేఖాతరు చేస్తూ పార్లమెంటును రద్దు చేసి, వచ్చే జనవరి 5న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేశారు. పార్లమెంటు రద్దుకు సిరిసేన చెబుతున్న కారణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముందనుకున్నట్టు బుధవారం పార్లమెంటులో బలాబలాలు తేల్చుకోవలసి వస్తే... రనిల్, రాజపక్స వర్గాలకు చెందిన ఎంపీల మధ్య ఘర్షణలు తలెత్తి హింస చోటు చేసుకునే ప్రమాదం ఉన్నదని, అదే జరిగితే గ్రామస్థాయి వరకూ హింస చెలరేగి అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అంటున్నారు. పార్లమెంటును రద్దు చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించానని వివరిస్తున్నారు. ఇది తన అక్రమ చర్యల్ని కప్పెట్టుకోవడం తప్ప మరేమీ కాదు. రాజపక్సకు తిరిగి అధికారం కట్టబెట్టడంపై తన పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఓటింగ్ అంటూ జరిగితే తన నిర్ణయం వీగిపోవడం ఖాయమని గ్రహించబట్టే ఆయన మరో తప్పుడు చర్యకు సిద్ధపడ్డారు. ప్రధాని తొలగింపు వ్యవహారం మాదిరే పార్లమెంటు రద్దు కూడా రాజ్యాంగ విరుద్ధమే. పార్లమెంటు సభ్యుల్లో మూడింట రెండు వంతులమంది కోరితే తప్ప పార్లమెంటు రద్దు చేయరాదని మూడేళ్లక్రితం తీసుకొచ్చిన 19వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. మరో అధికరణలో పార్లమెంటు రద్దుకు సంబంధించిన అధికారం గురించిన ప్రస్తావన ఉంది గనుక సిరిసేన చర్య చెల్లుతుందని ఆయన మద్దతుదార్లు వాదిస్తున్నారు. ఆయన చర్యలపై సుప్రీంకోర్టు నిష్పాక్షికంగా విచారణ జరిపితే దీన్లోని రాజ్యాంగ విరుద్ధత తేటతెల్లమవుతుంది. ప్రజలెన్నుకునే పార్లమెంటుపై అధ్యక్షుడు నిరంకుశంగా పెత్తనం చలాయించడానికి వీల్లేదని దేశంలోని ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఉద్యమిస్తున్నారు. ఈ అపరిమిత అధికారాల తొలగింపునకు తాను సిద్ధపడతానని 2015లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సిరిసేన హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చడం కోసం 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీరా ఆచరణలోకొచ్చేసరికి దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ విషయంలో సిరిసేనతో చేతులు కలిపి రాజపక్స తప్పుచేశారు. 2005లో అధ్యక్షుడై నప్పటినుంచీ రాజపక్స చైనాకు సన్నిహితంగా మెలిగారు. వారి సహకారంతోనే తమిళ టైగర్లను తీవ్రంగా అణచివేశారు. ఈ క్రమంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు సంజాయిషీ కోరుతున్నాయి. తమిళ టైగర్ల విషయంలో చేసిన సాయానికి కృతజ్ఞతగా రాజపక్స చైనాకు భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టు లిచ్చారు. ఆ దేశం నుంచే తుపాకులు, ఇతర రక్షణ సామగ్రి కొన్నారు. 2014లో కొలంబో నౌకాశ్రయంలో చైనా జలాంతర్గామి ఉనికి వెల్లడయ్యాక మన దేశం కూడా అప్రమత్తమైంది. దాని ఫలితంగానే 2015 ఎన్నికల్లో ఏమాత్రం పొసగని విక్రమసింఘే–సిరిసేనల మధ్య అవగాహన సాధ్యపడిందని చెబుతారు. మూడున్నరేళ్ల తర్వాత ఆ అమరిక దెబ్బతినడం వెనక చైనా ఉండొచ్చునని రాజకీయ నిపుణుల అంచనా. తమ ఎంపీలను కొనడానికి చైనా డబ్బు కుమ్మరిస్తున్నదని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేత ఈమధ్యే ఆరోపించారు. ఇప్పుడు సిరిసేన, రాజపక్సల మధ్య కృత్రిమ మైత్రి కుదిర్చి, విక్రమసింఘేను సాగనంపడంలో చైనా పాత్ర ఉన్నదని స్థానిక మీడియా చెబుతోంది. కానీ సిరిసేన, రాజపక్సల మైత్రికి మెజారిటీ పార్లమెంటు సభ్యుల ఆమోదం లేకపోవడంతో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అయింది. రాజపక్స 2005–15 మధ్య సింహళ జాతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా దీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని కూడా 2015 ఎన్నికల సందర్భంగా ఆయన హెచ్చరించారు. అయితే అవినీతి, బంధుప్రీతి ఆరో పణల వల్లా, ఆర్థిక రంగంలో చవిచూసిన దారుణ వైఫల్యాల వల్లా సింహళులు ఆయన్ను తిరస్కరించారు. అటు తమిళులు, ముస్లింలలో 70 శాతంమంది అప్పట్లో సిరిసేనకు మద్దతు పలికారు. ఫలితంగా రాజపక్స వైదొలగవవలసి వచ్చింది. ఇప్పుడాయన తన బాణీ మార్చారు. జైళ్లలో మగ్గుతున్న తమిళుల విడుదలకు తమ పార్టీ అవసరమైన చర్యలు తీసుకుం టుందని కుమారుడి ద్వారా చెప్పించారు. అయితే లంక తమిళులు ఈ విషయంలో రాజపక్సను ఏమేరకు నమ్ముతారో అనుమానమే. దానిమాటెలా ఉన్నా శ్రీలంక రాజకీయ సంక్షోభం అంతర్జాతీయంగా ఆ దేశానికి అప్రదిష్ట మిగిల్చింది. ఆ దేశానికి విడుదల చేయాల్సి ఉన్న 50 కోట్ల డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. జపాన్ నుంచి రావలసిన 140 కోట్ల రుణం కూడా ఆగిపోయింది. శ్రీలంక నుంచి వచ్చే దిగుమతులకు సుంకం మినహాయింపును ఉపసంహరిస్తామని యూరప్ యూనియన్(ఈయూ) హెచ్చరించింది. వివిధ రంగాల్లో ఇప్పటికే 800 కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ప్రస్తుత అనిశ్చితిలో కొత్తగా రుణాలు మంజూరు చేసి ఆదుకోవడం కష్టమే. సిరిసేనకు ఇది గడ్డుకాలం. దీన్నుంచి గట్టెక్కలేకపోతే రాజకీయంగా తెరమరుగుకావడం ఖాయం. -
లంకలో సంక్షోభం...
పార్లమెంట్ రద్దుతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఊహించని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ గడువు ఇంకా రెండేళ్లు ఉండగానే రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన 225 సభ్యుల పార్లమెంట్ రద్దు, ఎన్నికల నిర్వహణకు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సహా వివిధ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ప్రధాని రాణిల్ విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) సిద్ధమవుతోంది. మొదలైన అస్థిరత... గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు మైత్రీపాల అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించడం మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. ప్రధాని పదవిని విడిచిపెట్టేందుకు విక్రమసింఘే ససేమిరా అనడంతో విక్రమసింఘే, రాజపక్సెల మధ్య అధికారం కోసం గత రెండువారాలుగా సాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనే దానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడిని పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను సస్పెండ్ చేశారని ప్రతిపక్షాలు భావించాయి. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అమెరికా, తదితర దేశాల ఒత్తిళ్లలో పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకు మూడుసార్లు సిరిసేన అంగీకరించినా ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలు లేవనేది స్పష్టం కావడంతో ఆ దేశాధ్యక్షుడు పార్లమెంట్‌రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. శ్రీలంక పార్లమెంటు రద్దు వార్తపై అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. సుస్ధిరత, అభ్యున్నతి కోసం ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలను గౌరవించాల్సిన అవసరం ఉందని అమెరికా పేర్కొంది. అధ్యక్షుడి ఆకస్మిక నిర్ణయం నేపథ్యంలో విశ్వాసపరీక్షలో నెగ్గేంత స్థాయిలో ఎంపీలను కూడగట్టుకోలేకపోయినట్లు సిరిసేనకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యూపీఎఫ్యే) అంగీకరించింది. ఆపధర్మ ప్రధానిగా రాజపక్స... ప్రస్తుత పరిణామాలతో సభలో మెజారిటీని నిరూపించుకోకుండా తప్పించుకున్న రాజపక్స ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త పార్లమెంట్ సమావేశమయ్యే (జనవరి 17) వరకు ఆపధర్మ ప్రధానిగా ఉంటారు. పార్లమెంట్‌రద్దు నిర్ణయానికి ముందే అధ్యక్షుడు సిరిసేన తన కేబినెట్లోకి మరికొందరు మంత్రులను తీసుకున్నారు. పార్లమెంట్లో మెజారిటీ నిరూపణకు ఈ నెల 14న విశ్వాసపరీక్ష నిర్వహణకు స్పీకర్ కారు జయసూరియా చేస్తున్న ప్రయత్నాలకు అధ్యక్షుడి తాజా నిర్ణయం గండి కొట్టినట్టు అయ్యింది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ , విక్రమ సింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటీవలి కాలంలో సిరిసేన,విక్రమ సింఘేల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, దేశంలోని ఓడరేవును భారత్‌కు లీజు విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. మనదేశం నుంచి సరుకుల రవాణాకు ఉపయోగపడే కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో సిరిసేన–విక్రమసింఘేల మధ్య విభేదాలు మరింత తీవ్రం కావడంతో మళ్లీ అధికారానికి రావాలన్న రాజపక్స ఆశలు ఫలించే అవకాశాలు ఏర్పడ్డాయి. రాజపక్సే అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు (గతంలో రెండుసార్లు)వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. మళ్లీ దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారానే అధ్యక్షుడు ఏ విధంగా ప్రధానిని తొలగించవచ్చో నిర్వచించారు. దీనిని కూడా అధ్యక్షుడు సిరిసేన పాటించకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమైంది. రాజపక్సతో ఇబ్బందులు... విక్రమసింఘే ప్రభుత్వ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో ప్రధాని పదవిపై రాజపక్స కన్నేసారు. ఎల్టీటీఈ పట్ల అనుసరించిన కఠిన వైఖరితో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన సైనికులపై చర్యలకు విముఖంగా ఉన్న కారణంగా శ్రీలంక మిలటరీ నుంచి రాజపక్సకు మద్దతు లభిస్తోంది. ఎల్టీటీఈను అణచేసాక కూడా సింహళ బుద్దిస్ట్ జాతీయవాదిగా రాజపక్స మైనారిటీ తమిళియన్లు, ముస్లింల పట్ల వివక్షచూపారు. సింహళ బుద్ధిస్ట్ తీవ్రవాదులు శ్రీలంకలోని ముస్లింలపై చే సిన దాడులకు పరోక్ష మద్దతునిచ్చారు. ఈ కారణంగానే 2015 ఎన్నికల్లో తమిళులు, ముస్లింలు రాజపక్సకు వ్యతిరేకంగా ఓటువేసి ఆయన ఓటమికి కారణమయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనా వైపు పూర్తిగా మొగ్గారు. సింహళ బుద్ధిస్ట్‌లకు రాజపక్స సంపూర్ణ మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న తమిళుల భద్రతకు ముప్పు ఏర్పడితే భారత్‌పై దాని దుష్ప్రభావం పడుతుంది. రాజపక్స మళ్లీ అధికారానికి వస్తే శ్రీలంకలో చైనా జోక్యం పెరగగడం వల్ల మనదేశానికి అంతర్జాతీయంగా సమస్యలు ఎదురుకావడంతో పాటు దేశంలో అంతర్గతంగా తమిళుల సమస్య మళ్లీ పునరావృతమవుతుందని భారత్ ప్రధాన ఆందోళన. -
కొలంబోలో విక్రమసింఘే భారీ ర్యాలీ
కొలంబో: శ్రీలంకలో రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్వాసనకు గురైన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మద్దతుదారులు మంగళవారం రాజధాని కొలంబోలో భారీ ర్యాలీ నిర్వహించారు. తనను తొలగించి, పార్లమెంట్‌ను సుప్తావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నారని విక్రమసింఘేను ఆరోపించారు. నవంబర్ 16వ తేదీన జరిగే పార్లమెంట్ సమావేశంలో బలం నిరూపించుకునేందుకు విక్రమ సింఘేతోపాటు ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్స ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విక్రమసింఘేకు మద్దతుగా యూఎన్‌పీ నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. విక్రమసింఘే ఈనెల 26వ తేదీ నుంచి ఉంటున్న ప్రధాని అధికార నివాసం వరకు ప్రదర్శనకారులు తరలివెళ్లారు. అక్కడ నిర్వహించిన సభలో విక్రమసింఘే మాట్లాడుతూ.. అధ్యక్షుడు సిరిసేన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే కుట్రపూరితంగా తనను తొలగించారని విమర్శించారు. యూఎన్‌పీతోపాటు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పక్షాలు పార్లమెంట్‌ను తక్షణమే సమావేశపరచాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. పార్లమెంట్ వేదికగా బలం నిరూపించుకునేందుకు విక్రమసింఘేకు అవకాశం ఇవ్వాలని సభలో పాల్గొన్న స్పీకర్ జయసూర్య అధ్యక్షుడిని కోరారు. ఇవే పరిస్థితులు కొనసాగితే దేశంలో రక్తపాతం తప్పదని అన్నారు. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరచాలన్న డిమాండ్‌కు 126 మంది ఎంపీలు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. తమ ర్యాలీకి లక్ష మందికి పైగా జనం హాజరయ్యారని యూఎన్‌పీ అంటుండగా 25వేల మంది మాత్రమే వచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బలం కూడగట్టుకునే పనిలో నూతన ప్రధాని మరోవైపు, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకునేందుకు నూతన ప్రధాని రాజపక్స ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్లో 16 మంది సభ్యుల బలమున్న తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) ప్రస్తుతం కీలకంగా మారిన తరుణంలో ఆ పార్టీ నేత సంపంతన్ మంగళవారం రాజపక్సతో భేటీ కావడం గమనార్హం. అయితే, బలనిరూపణ సమయంలో పార్లమెంట్లో తటస్థంగా ఉండాలని రాజపక్స తమను కోరినట్లు టీఎన్ఏ తెలిపింది. పార్లమెంట్‌లోని 225 మంది సభ్యులకుగాను విక్రమసింఘేకు 106 మంది సభ్యులుండగా, రాజపక్సకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్‌కు 95 మంది ఉన్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 18 మంది మద్దతును రాజపక్స కూడగట్టాల్సి ఉంది. కొందరు యూఎన్‌పీ సభ్యులు తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నందున బల నిరూపణలో నెగ్గుతామనీ, విక్రమసింఘేకు ఓటమి ఖాయమని రాజపక్స ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరిచి, రాజ్యాంగ సంక్షోభం తొలగించాలంటూ అధ్యక్షుడు సిరిసేనపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి పెరిగింది. -
కాల్పుల ఘటనపై రణతుంగ అరెస్ట్
కొలంబో : తన కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మంత్రి అర్జున రణతుంగను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కొలంబో క్రైమ్ పోలీసులు రణతుంగను అరెస్ట్ చేశారని, ఆయనను కోర్టులో హాజరుపరుస్తారని పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర పేర్కొన్నారు. విక్రమ సింఘేను ప్రధాని పదవి నుంచి తొలగించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మహింద్ర రాజపక్సెను ప్రధానిగా నియమించిన సంగతి తెలిసిందే. నూతన ప్రధాని మహింద్ర రాజపక్సెతో సన్నిహితంగా మెలిగే కార్మిక సంఘాల నేతలు రద్దయిన కేబినెట్ మంత్రులను వారి కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. రణతుంగ ఆదివారం తన కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా కొందరు అడ్డుకోవడంతో సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. -
పనికిరాని ఎయిర్‌పోర్టుకు.. భారత్ 300 కోట్ల డాలర్ల ఆఫర్
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ఖాళీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం. అది శ్రీలంకలోని హంబన్‌తోట పట్టణ సమీపంలో ఉంది. ఆ పట్టణంలో అంతా మత్స్యకారులే ఉంటారు. ఆ విమానాశ్రయం నుంచి వారానికి ఒకే ఒక్క విమాన సర్వీసు నడుస్తోంది. విమానాశ్రయం భవనాలన్నీ ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. పట్టణంలోని ప్రజలు అప్పుడప్పుడు తమ ధాన్యాన్ని ఆ భవనాల్లో భద్రపర్చుకుంటారు. అలాంటి విమానాశ్రయాన్ని భారత్ ఇప్పుడు కొనాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న విమానాశ్రయం కదా? అతి చవగ్గా వస్తుందనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తుందనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరోటి ఉండదు. పదులు కాదు, వందలు కాదు, ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించి ఆ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఎందుకు? దాని వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనాలేమిటీ? వీటి వివరాలు తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాలి. శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్స ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గం హంబన్‌తోట. అది ప్రజల ఉనికి పెద్దగా కనిపించని పట్టణం. ఆయన దాన్ని ఎలాగైనా గ్లోబల్ షిప్పింగ్ హబ్‌గా మార్చాలని అనుకున్నారు. దాంతో ఆయన పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో, ఆర్థిక సహాయ సంస్థలతో చర్చలు జరిపారు. అలాగే ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ప్రాజెక్ట్‌ను నిర్మించే బాధ్యతను కూడా చేపట్టాలని చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పాకిస్థాన్‌ను కలుపుకొని అంతర్జాతీయ ఎకానమీ కారిడార్‌ను నిర్మిస్తున్న చైనా అందుకు అంగీకరించింది. మొత్తం ప్రాజెక్టుకు 150 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా వేసిన చైనా ముందుగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఉత్తర హిందూ మహా సముద్రానికి సమీపంలోనే ఉండటం వల్ల హంబన్‌తోటను కూడా అంతర్జాతీయ రేవుగా అభివద్ధి చేయవచ్చని, అది భారత్‌లాంటి దేశాలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా తనకు పనికి వస్తుందని చైనా భావించింది. అక్కడే తన నావికా దళాల స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని భావించింది. ఇక రాజపక్స కూడా సింగపూర్ తర్వాత అంతటి రేవుగా హంబన్‌తోట అభివృద్ది చెందుతుందని కలలుగన్నారు. ఈ విషయంలో ముందుగా ఉత్సాహం చూపిన అంతర్జాతీయ పెట్టుబడుదారులు కొంతకాలానికి వెనకడుగు వేశారు. సమీపంలోనే అద్భుతమైన కొలంబో ఓడరేవు ఉండగా మరోదాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఫలితం లేదని వారు వెనక్కి వెళ్లిపోయారు. ఏకపక్షంగా హంబన్‌తోటలో రేవును నిర్మించిన చైనా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించింది. విమానాశ్రయానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులను కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి వారానికి ఒక్క విమానం సర్వీసు మాత్రమే నేటికి నడుస్తోంది. ఖాళీగా ఉండడంతో పర్యాటకులు, జర్నలిస్టుల ఫొటో సెషన్లకు విమానాశ్రయం ఎక్కువ ఉపయోగపడుతోంది. ఇక రేవు పూర్తిగా నిరూపయోగంగానే ఉంది. రేవు యాజమాన్య హక్కులు మాత్రం శ్రీలంకనే దక్కించుకుంది. చైనా వద్దనే రాజపక్స ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పు తీసుకోవడంతో అది నేడు 300 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఆ మొత్తాన్ని చెల్లించే స్థోమత లేని శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని(రాజపక్స లేకుండానే) చైనాకు పంపించింది. చెల్లించాల్సిన అప్పు కింద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొనుక్కోమని కోరింది. విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి అక్కడ ప్రత్యేక అంతర్జాతీయ ఆర్థిక జోన్‌ను అభివృద్ధి చేస్తే, ఓడ రేవును కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకపోవచ్చని చైనా ప్రభుత్వం కూడా భావించింది. ఒకటికి, రెండుసార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపిన చైనా అది సులువు కాదని భావించింది. ప్రస్తుతం ఈ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. శ్రీలంకలోని ఆ విమానాశ్రయాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్లయితే భారత్‌లోని ఏ లక్ష్యాలపైనైనా సరే చైనా సులభంగా వైమానిక దాడులు జరపవచ్చు. ఆ అవకాశం చైనాకు లేకుండా చేయాలంటే ఆ విమానాశ్రయాన్ని మనమే కొనడం ఉత్తమ మార్గమని భారత ప్రభుత్వం భావించింది. అందుకనే శ్రీలంక ముందుకు తాజా ప్రతిపాదనను తీసుకెళ్లింది. మనకు ఉపయోగపడకపోయినా ఫర్వాలేదు గానీ, శత్రువుకు ఉపయోగపడరాదన్న భావనకు ఈ ప్రతిపాదన అద్దం పడుతోంది.