మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం, హంబన్‌తోట, శ్రీలంక (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ఖాళీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం. అది శ్రీలంకలోని హంబన్‌తోట పట్టణ సమీపంలో ఉంది. ఆ పట్టణంలో అంతా మత్స్యకారులే ఉంటారు. ఆ విమానాశ్రయం నుంచి వారానికి ఒకే ఒక్క విమాన సర్వీసు నడుస్తోంది. విమానాశ్రయం భవనాలన్నీ ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. పట్టణంలోని ప్రజలు అప్పుడప్పుడు తమ ధాన్యాన్ని ఆ భవనాల్లో భద్రపర్చుకుంటారు. అలాంటి విమానాశ్రయాన్ని భారత్ ఇప్పుడు కొనాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న విమానాశ్రయం కదా? అతి చవగ్గా వస్తుందనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తుందనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు మరోటి ఉండదు.
పదులు కాదు, వందలు కాదు, ఏకంగా 300 కోట్ల డాలర్లు వెచ్చించి ఆ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఎందుకు? దాని వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనాలేమిటీ? వీటి వివరాలు తెలుసుకోవాలంటే కొంతకాలం వెనక్కి వెళ్లాలి. శ్రీలంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్స ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గం హంబన్‌తోట. అది ప్రజల ఉనికి పెద్దగా కనిపించని పట్టణం. ఆయన దాన్ని ఎలాగైనా గ్లోబల్ షిప్పింగ్ హబ్‌గా మార్చాలని అనుకున్నారు. దాంతో ఆయన పలువురు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో, ఆర్థిక సహాయ సంస్థలతో చర్చలు జరిపారు.
అలాగే ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు ప్రాజెక్ట్‌ను నిర్మించే బాధ్యతను కూడా చేపట్టాలని చైనా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పాకిస్థాన్‌ను కలుపుకొని అంతర్జాతీయ ఎకానమీ కారిడార్‌ను నిర్మిస్తున్న చైనా అందుకు అంగీకరించింది. మొత్తం ప్రాజెక్టుకు 150 కోట్ల డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా వేసిన చైనా ముందుగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఉత్తర హిందూ మహా సముద్రానికి సమీపంలోనే ఉండటం వల్ల హంబన్‌తోటను కూడా అంతర్జాతీయ రేవుగా అభివద్ధి చేయవచ్చని, అది భారత్‌లాంటి దేశాలకు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా తనకు పనికి వస్తుందని చైనా భావించింది.
అక్కడే తన నావికా దళాల స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చని భావించింది. ఇక రాజపక్స కూడా సింగపూర్ తర్వాత అంతటి రేవుగా హంబన్‌తోట అభివృద్ది చెందుతుందని కలలుగన్నారు. ఈ విషయంలో ముందుగా ఉత్సాహం చూపిన అంతర్జాతీయ పెట్టుబడుదారులు కొంతకాలానికి వెనకడుగు వేశారు. సమీపంలోనే అద్భుతమైన కొలంబో ఓడరేవు ఉండగా మరోదాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఫలితం లేదని వారు వెనక్కి వెళ్లిపోయారు. ఏకపక్షంగా హంబన్‌తోటలో రేవును నిర్మించిన చైనా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించింది.
విమానాశ్రయానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులను కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి వారానికి ఒక్క విమానం సర్వీసు మాత్రమే నేటికి నడుస్తోంది. ఖాళీగా ఉండడంతో పర్యాటకులు, జర్నలిస్టుల ఫొటో సెషన్లకు విమానాశ్రయం ఎక్కువ ఉపయోగపడుతోంది. ఇక రేవు పూర్తిగా నిరూపయోగంగానే ఉంది. రేవు యాజమాన్య హక్కులు మాత్రం శ్రీలంకనే దక్కించుకుంది. చైనా వద్దనే రాజపక్స ప్రభుత్వం అధిక వడ్డీలకు అప్పు తీసుకోవడంతో అది నేడు 300 కోట్ల డాలర్లకు చేరుకుంది.
ఆ మొత్తాన్ని చెల్లించే స్థోమత లేని శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రతినిధి బృందాన్ని(రాజపక్స లేకుండానే) చైనాకు పంపించింది. చెల్లించాల్సిన అప్పు కింద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొనుక్కోమని కోరింది. విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి అక్కడ ప్రత్యేక అంతర్జాతీయ ఆర్థిక జోన్‌ను అభివృద్ధి చేస్తే, ఓడ రేవును కూడా అంతర్జాతీయ స్థాయికి తీసుకపోవచ్చని చైనా ప్రభుత్వం కూడా భావించింది. ఒకటికి, రెండుసార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపిన చైనా అది సులువు కాదని భావించింది. ప్రస్తుతం ఈ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది.
శ్రీలంకలోని ఆ విమానాశ్రయాన్ని చైనా స్వాధీనం చేసుకున్నట్లయితే భారత్‌లోని ఏ లక్ష్యాలపైనైనా సరే చైనా సులభంగా వైమానిక దాడులు జరపవచ్చు. ఆ అవకాశం చైనాకు లేకుండా చేయాలంటే ఆ విమానాశ్రయాన్ని మనమే కొనడం ఉత్తమ మార్గమని భారత ప్రభుత్వం భావించింది. అందుకనే శ్రీలంక ముందుకు తాజా ప్రతిపాదనను తీసుకెళ్లింది. మనకు ఉపయోగపడకపోయినా ఫర్వాలేదు గానీ, శత్రువుకు ఉపయోగపడరాదన్న భావనకు ఈ ప్రతిపాదన అద్దం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment