లంకలో సంక్షోభం... | Other Coutries Denounce Dissolution Of Sri Lanka Parliament As Undemocratic | Sakshi
Sakshi News home page

లంకలో సంక్షోభం...

Published Sun, Nov 11 2018 7:53 AM | Last Updated on Sun, Nov 11 2018 7:53 AM

Other Coutries Denounce Dissolution Of Sri Lanka Parliament As Undemocratic - Sakshi

శ్రీలంక ప్రధానిగా మహింద్ర రాజపక్సను నియమించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

పార్లమెంట్‌ రద్దుతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఊహించని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్‌ గడువు ఇంకా రెండేళ్లు ఉండగానే రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన 225 సభ్యుల పార్లమెంట్‌ రద్దు, ఎన్నికల నిర్వహణకు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సహా వివిధ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూ రద్దు  నిర్ణయాన్ని  సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు  ప్రధాని రాణిల్‌  విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యూఎన్‌పీ) సిద్ధమవుతోంది.
 
మొదలైన అస్థిరత...

గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు మైత్రీపాల అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించడం మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. ప్రధాని పదవిని విడిచిపెట్టేందుకు విక్రమసింఘే ససేమిరా అనడంతో విక్రమసింఘే, రాజపక్సెల మధ్య అధికారం కోసం   గత రెండువారాలుగా సాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.  ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనే దానిపై పార్లమెంట్‌లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడిని పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను సస్పెండ్‌ చేశారని ప్రతిపక్షాలు భావించాయి.

పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు  ఎరగా చూపారని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అమెరికా, తదితర దేశాల ఒత్తిళ్లలో  పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకు మూడుసార్లు సిరిసేన అంగీకరించినా  ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలు లేవనేది స్పష్టం కావడంతో  ఆ దేశాధ్యక్షుడు పార్లమెంట్‌రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. శ్రీలంక పార్లమెంటు రద్దు వార్తపై అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. సుస్ధిరత, అభ్యున్నతి కోసం  ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలను గౌరవించాల్సిన అవసరం ఉందని అమెరికా  పేర్కొంది. అధ్యక్షుడి ఆకస్మిక నిర్ణయం నేపథ్యంలో విశ్వాసపరీక్షలో నెగ్గేంత స్థాయిలో ఎంపీలను కూడగట్టుకోలేకపోయినట్లు  సిరిసేనకు చెందిన యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడమ్‌ అలయన్స్‌ (యూపీఎఫ్యే) అంగీకరించింది. 

ఆపధర్మ ప్రధానిగా రాజపక్స...
ప్రస్తుత పరిణామాలతో సభలో మెజారిటీని నిరూపించుకోకుండా తప్పించుకున్న రాజపక్స  ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త పార్లమెంట్‌ సమావేశమయ్యే (జనవరి 17) వరకు ఆపధర్మ ప్రధానిగా ఉంటారు. పార్లమెంట్‌రద్దు నిర్ణయానికి ముందే అధ్యక్షుడు సిరిసేన తన కేబినెట్‌లోకి మరికొందరు  మంత్రులను తీసుకున్నారు. పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపణకు ఈ నెల 14న విశ్వాసపరీక్ష నిర్వహణకు స్పీకర్‌ కారు జయసూరియా చేస్తున్న ప్రయత్నాలకు అధ్యక్షుడి తాజా నిర్ణయం గండి కొట్టినట్టు అయ్యింది. 

సంకీర్ణంలో  లుకలుకలు...
2015లో  సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ , విక్రమ సింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ  సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటీవలి కాలంలో  సిరిసేన,విక్రమ సింఘేల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి.  ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు,  దేశంలోని ఓడరేవును భారత్‌కు లీజు విషయంలో  విభేదాలు ఏర్పడ్డాయి. మనదేశం నుంచి సరుకుల రవాణాకు ఉపయోగపడే కొలంబోలోని ‘ఈస్ట్‌ కంటెనర్‌ టెర్మినల్‌’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే కోరుకున్నాడు.

ఈ నేపథ్యంలో సిరిసేన–విక్రమసింఘేల మధ్య విభేదాలు మరింత తీవ్రం కావడంతో మళ్లీ అధికారానికి రావాలన్న రాజపక్స ఆశలు ఫలించే అవకాశాలు ఏర్పడ్డాయి. రాజపక్సే అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు (గతంలో రెండుసార్లు)వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు.  మళ్లీ దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం  19వ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారానే అధ్యక్షుడు ఏ విధంగా ప్రధానిని తొలగించవచ్చో నిర్వచించారు. దీనిని కూడా  అధ్యక్షుడు సిరిసేన పాటించకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమైంది.

రాజపక్సతో ఇబ్బందులు...
విక్రమసింఘే ప్రభుత్వ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో ప్రధాని పదవిపై రాజపక్స కన్నేసారు. ఎల్‌టీటీఈ పట్ల అనుసరించిన కఠిన వైఖరితో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన సైనికులపై చర్యలకు విముఖంగా ఉన్న కారణంగా  శ్రీలంక మిలటరీ నుంచి రాజపక్సకు మద్దతు లభిస్తోంది.  ఎల్‌టీటీఈను అణచేసాక కూడా సింహళ బుద్దిస్ట్‌ జాతీయవాదిగా రాజపక్స మైనారిటీ తమిళియన్లు, ముస్లింల పట్ల వివక్షచూపారు. సింహళ బుద్ధిస్ట్‌ తీవ్రవాదులు శ్రీలంకలోని ముస్లింలపై చే సిన దాడులకు పరోక్ష మద్దతునిచ్చారు.

ఈ కారణంగానే 2015 ఎన్నికల్లో తమిళులు, ముస్లింలు రాజపక్సకు వ్యతిరేకంగా ఓటువేసి ఆయన ఓటమికి కారణమయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనా వైపు పూర్తిగా మొగ్గారు. సింహళ బుద్ధిస్ట్‌లకు రాజపక్స సంపూర్ణ మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో  మైనారిటీలుగా ఉన్న తమిళుల భద్రతకు ముప్పు ఏర్పడితే  భారత్‌పై దాని దుష్ప్రభావం పడుతుంది. రాజపక్స మళ్లీ అధికారానికి వస్తే శ్రీలంకలో చైనా జోక్యం పెరగగడం వల్ల మనదేశానికి అంతర్జాతీయంగా సమస్యలు ఎదురుకావడంతో పాటు దేశంలో అంతర్గతంగా తమిళుల సమస్య మళ్లీ పునరావృతమవుతుందని భారత్‌ ప్రధాన ఆందోళన.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement