ర్యాలీ నిర్వహిస్తోన్న మద్ధతుదారులు
కొలంబో: శ్రీలంకలో రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్వాసనకు గురైన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మద్దతుదారులు మంగళవారం రాజధాని కొలంబోలో భారీ ర్యాలీ నిర్వహించారు. తనను తొలగించి, పార్లమెంట్‌ను సుప్తావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నారని విక్రమసింఘేను ఆరోపించారు. నవంబర్ 16వ తేదీన జరిగే పార్లమెంట్ సమావేశంలో బలం నిరూపించుకునేందుకు విక్రమ సింఘేతోపాటు ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్స ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
విక్రమసింఘేకు మద్దతుగా యూఎన్‌పీ నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. విక్రమసింఘే ఈనెల 26వ తేదీ నుంచి ఉంటున్న ప్రధాని అధికార నివాసం వరకు ప్రదర్శనకారులు తరలివెళ్లారు. అక్కడ నిర్వహించిన సభలో విక్రమసింఘే మాట్లాడుతూ.. అధ్యక్షుడు సిరిసేన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే కుట్రపూరితంగా తనను తొలగించారని విమర్శించారు. యూఎన్‌పీతోపాటు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పక్షాలు పార్లమెంట్‌ను తక్షణమే సమావేశపరచాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు.
పార్లమెంట్ వేదికగా బలం నిరూపించుకునేందుకు విక్రమసింఘేకు అవకాశం ఇవ్వాలని సభలో పాల్గొన్న స్పీకర్ జయసూర్య అధ్యక్షుడిని కోరారు. ఇవే పరిస్థితులు కొనసాగితే దేశంలో రక్తపాతం తప్పదని అన్నారు. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరచాలన్న డిమాండ్‌కు 126 మంది ఎంపీలు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. తమ ర్యాలీకి లక్ష మందికి పైగా జనం హాజరయ్యారని యూఎన్‌పీ అంటుండగా 25వేల మంది మాత్రమే వచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బలం కూడగట్టుకునే పనిలో నూతన ప్రధాని
మరోవైపు, పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకునేందుకు నూతన ప్రధాని రాజపక్స ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్‌లో 16 మంది సభ్యుల బలమున్న తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్‌ఏ) ప్రస్తుతం కీలకంగా మారిన తరుణంలో ఆ పార్టీ నేత సంపంతన్ మంగళవారం రాజపక్సతో భేటీ కావడం గమనార్హం. అయితే, బలనిరూపణ సమయంలో పార్లమెంట్‌లో తటస్థంగా ఉండాలని రాజపక్స తమను కోరినట్లు టీఎన్‌ఏ తెలిపింది.
పార్లమెంట్‌లోని 225 మంది సభ్యులకుగాను విక్రమసింఘేకు 106 మంది సభ్యులుండగా, రాజపక్సకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్‌కు 95 మంది ఉన్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 18 మంది మద్దతును రాజపక్స కూడగట్టాల్సి ఉంది. కొందరు యూఎన్‌పీ సభ్యులు తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నందున బల నిరూపణలో నెగ్గుతామనీ, విక్రమసింఘేకు ఓటమి ఖాయమని రాజపక్స ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరిచి, రాజ్యాంగ సంక్షోభం తొలగించాలంటూ అధ్యక్షుడు సిరిసేనపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment