సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి మాట్లాడడంతో ఆమెకు కోపమొచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టించిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న (గురువారం) సాయంత్రం విజయవాడ గాయత్రినగర్‌లోని మెట్రోపాలిటన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డికి, నల్లారి అమర్‌నాథ్‌రెడ్డి (కిషోర్ కుమార్ రెడ్డి కుమారుడు)కి ఆయన కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కిషోర్‌కుమార్‌రెడ్డి తండ్రి నల్లారి అమర్‌నాథ్‌రెడ్డితోపాటు తాను ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పారు. నల్లారి కుటుంబం ప్రజాసేవ కోసం నిబద్దతతో పనిచేస్తోందన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని విభజించవద్దని అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పోరాడారని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించి జిల్లాను అభివృద్ధి చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment