సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు పరుష వ్యాఖ్యలు చేశారు. వారి పనితీరు బాగోలేదంటూ మండిపడ్డారు. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సంతృప్త స్థాయి పెంచడంలో దారుణంగా విఫలమయ్యారని ఆక్షేపించారు. మిమ్మల్ని మేము ఎందుకు మేపాలంటూ ఔట్‌సో ర్సింగ్ ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యద ర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. గృహ నిర్మాణాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచాలని సూచించారు. పరిష్కార వేదిక ద్వారా రియల్ టైమ్‌లో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.
అవసరమైనచోటల్లా పీపీపీ
రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి దాకా ప్రజా సాధికార సర్వే నిర్వహించామని, భూ సమస్యల పరిష్కారానికి భూధార్ తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టామని, మునిసిపల్ పరిపాలనలో పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లామన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పీపీపీ విధానంలో ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలొచ్చాయని చెప్పకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాలు, వస్తువుల పంపిణీలో ప్రజల నుంచి మరింత సంతృప్తి వ్యక్తం కావాలన్నారు. 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని, జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు లభిస్తోందని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రతి సోమవారం వ్యవసాయం, అనుబంధ రంగాలలపై టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి మంగళవారం ఇ–ప్రగతి, ప్రతి బుధవారం రాజధాని, సంక్షేమంపై టెలికాన్ఫరెన్సులతో దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు.
ఇక ఆర్నెల్లపాటు సర్కారు ప్రచారోద్యమం
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూలై 15కి 1,500 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాల ద్వారా ప్రచారోద్యమం చేపట్టాలని సీఎం సూచించారు. సంతృప్తి శాతం పెరగడంలో సర్వీసు ప్రొవైడర్లు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అక్టోబర్‌లోగా ఈ ప్రగతి పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని సర్వీసులను ఆన్‌లైన్‌లో చేర్చి శాఖాధిపతుల్లో కాగిత రహిత పాలన రావాలన్నారు.
75 లక్షలకుపైగా పేద కుటుంబాల ఎదురుచూపులు
రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం 75 లక్షలకు పైగా పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది. నాలుగేళ్లుగా దరఖాస్తులు.. పరిశీలన దశ దాటి ముందుకు కదలడం లేదు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీరు, పెన్షన్లు తదితర పథకాల మంజూరు కోసం అందిన 75,17,255 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయినా మంజూరు చేయాల్సి ఉందని వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడైంది. ఆర్థికేతర అంశాలతో కూడిన మరో 3,02,750 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment