
‘సాగు’ సమరం!
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే గెలుపుకోసం టీడీపీ నాయకులు ఎవరి స్థాయిలో వారు వ్యూహరచన ప్రారంభించారు. సాగునీటి సంఘాల ఎన్నికల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఏకాభిప్రాయంతో నీటిసంఘాల కార్యవర్గాన్ని ఎన్నుకునేలా సవరణ జరగడంతో ఏకాభిప్రాయం కోసం పోటీపడడం ప్రారంభమైంది. గత నెల నుంచి ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఓటర్ల జాబితాను యథాతథంగా కొనసాగించారు.
చెరువు ఆయకట్టుదారుల సర్వసభ్య సమావేశాలు హడావుడిగా నిర్వహించే ప్రయత్నాలు జిల్లావ్యాప్తంగా సాగుతున్నాయి. మేజర్, మీడియం, మైనర్ సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో 753 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 8 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 4 ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1987 చట్టాన్ని సవరిస్తూ జీఓ నంబరు 528ను ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఎన్నికల నిమిత్తం లేకుండా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి పాలక మండలి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, నలుగురు సభ్యులతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
తమ్ముళ్ల మల్లగుల్లాలు
ఓటర్ల జాబితాల నుంచి సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరిగే తంతుపై పట్టుకోసం తమ్ముళ్లు ప్రయత్నం సాగిస్తున్నారు. నీరు-చెట్టు పథకంలో జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం నడిపించినట్లే, ఈసారి కూడా అధికారదర్పంతో ఈ ఎన్నికలను తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసే నీటి సంఘాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, ఎన్నికలు ఏకగ్రీవం కావాలనే నిబంధనలకు తమ్ముళ్లు నీళ్లొదిలే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏకగ్రీవం పేరుతో నీటిసంఘాల్లో పూర్తిగా అధికారపార్టీ ఆధిపత్యం ప్రదర్శించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. గ్రామస్థాయిలో ఈ ఎన్నికలు మళ్లీ రాజకీయ వేడిని రేపాయి.
ఈనెల 14 వరకు జిల్లావ్యాప్తంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి సంఘాల పాలకమండలిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏఈలను, తహశీల్దార్లను ఆయా ప్రాంతాల ఎన్నికల అధికారులుగా నియమించారు. ఈనెల 10వ తేదీన 361 వినియోగదారుల సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. గత 4న 300 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 14 నుంచి 19వ తేదీలోపు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఒక ప్రాజెక్ట్ కమిటీ, 8 డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు, 18న రెండు ప్రాజెక్ట్ కమిటీలకు, 19న ఒక ప్రాజెక్ట్ కమిటీకి ఎన్నికలు జరుగునున్నాయి.
పకడ్బందీగా ఎన్నికలు: ఎస్‌ఈ రెడ్డయ్య
సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. 740 మంది ఏఈలను, ఆ మండల తహశీల్దార్లను ఎన్నికల అధికారులను నియమించాం. ప్రాజెక్ట్ కమిటీల ఎన్నికలను ఈఈలు, ఎస్‌ఈలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద ఈనెల 20వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం.