ఎమ్మెల్యే పదవులు తాకట్టు పెట్టారు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
వెంకటాచలం(ముత్తుకూరు) : వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులను తాకట్టుపెట్టి టీడీపీలో చేరారని, భవిష్యత్తులో ఇటువంటి ఫిరాయింపుదారులకు పుట్టగతులు ఉండవని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాచలం మండలంలోని కంటేపల్లి ఎస్టీకాలనీ, గంగిరెద్దులకాలనీల్లో రూ.16 లక్షలతో నిర్మించిన రెండు సిమెంట్ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీకాలనీలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేస్తున్నందున టీడీపీలో చేరామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చేసే పార్టీలో ఏం అభివృద్ధి కనిపించి చేరారని ఎద్దేవా చేశారు. ప్రతిష్ట కలిగిన పార్టీలో ఉండలేక ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు తూట్లు పొడిచి టీడీపీలో చేరి పరువు పోగొట్టుకుంటున్నారన్నారు. పార్టీ మారి చేరే ఎమ్మెల్యేలకు టీడీపీలో కనీస గౌరవం ఉండదన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీ మునిగిపోయే నావన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఛీత్కరించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, సర్పంచ్ శాంతి, ఎంపీటీసీ సభ్యులు వెంకమ్మ, ఎంపీడీఓ సుగుణమ్మ, తహశీల్దార్ సుధాకర్, నాయకులు కనుపూరు కోదండరామిరెడ్డి, ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, కరియావుల చెంచుకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.