తమ్ముళ్ల పెత్తనం ఎక్కువైంది
► అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు
► ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని నిలదీసిన వైఎస్సార్సీపీ సభ్యులు
► నిరసనగా మండలమీట్ బహిష్కరణ
సంజామల: తమ గ్రామాల్లో తెలుగుతమ్ముళ్ల పెత్తనం ఎక్కువైంది. అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో పాటు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా చేస్తున్నారు. ఇలా చేస్తే ఎలా’ అని అధికారపార్టీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. మీ పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. బుధవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిన ఎమ్మెల్యే స్థానిక టీడీపీ నేత స్వగృహానికి వెళ్లాడు. ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో 11.45 గంటలకు సభ ప్రారంభమైంది.
రెవెన్యూ,వ్యవసాయ శాఖలపై చర్చ జరుగుతుండగా ఎమ్మెల్యే సభకు వచ్చారు. గ్రామాల్లో అభివృద్ధిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకుంటున్నారని, జన్మభూమి కమిటీలు ప్రభుత్వ పథకాలు అనర్హులకు కట్టబెడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ సమస్యలు ఉంటే సభదృష్టికి తీసుకురావాలని చెప్పగా సభ్యుల ఆమోదంతో ఎంపీపీ చేసిన తీర్మానాలనే అధికారపార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, సభకు వారు ఎక్కడ విలువ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆకుమల్లలో మండల తీర్మానంతో రూ. 8 లక్షలతో రోడ్లు వేసేందుకు పనులు ప్రారంభిస్తే పంచాయతీరాజ్ ఏఈ రామప్ప పనులు నిలుపుదల చేయాలని హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పారన్నారు.
ఎమ్మెల్యే చెప్పడంతోనే పనులు నిలిపినట్లు గ్రామంలోని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఇలా అభివృద్ధిని అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ఎంపీపీ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో కొద్దిసేపు సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారటీడీపీ తీరును నిరసిస్తూ జెడ్పీటీసీ సభ్యులు డి.చిన్నబాబు,మండల ఉపాధ్యక్షురాలు సక్ష్మివుశేనమ్మ, సభ్యులు అన్నపూర్ణాభాయి, రాజేశ్వరమ్మ,పార్వతమ్మ,శ్రీనివాసులు, కోఆప్సన్ సభ్యులు మగ్బుల్ ఉశేన్ తదితరులు సభను బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. తిరిగి గంట తర్వాత సభను ప్రారంభించగా సభ్యులెవరూ రాకపోవంతో ఎంపీపీ సభను మరుసటిరోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వ్యుహరచనతో సభకు హాజరైన ఎమ్మెల్యేకు భంగపాటు ఎదురైంది.