
కొత్త పింఛన్లకు మోకాలడ్డు
ఏడాదిగా కొత్తగా ఒక్కటంటే ఒక్క పింఛన్ ప్రభుత్వం మంజూరు చేసిన పాపానపోలేదు...
- జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేస్తేనే..
- సగానికిపైగా కోత
- క్లియరెన్స్ ఇవ్వని ఆర్థికశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఏడాదిగా కొత్తగా ఒక్కటంటే ఒక్క పింఛన్ ప్రభుత్వం మంజూరు చేసిన పాపానపోలేదు. గతేడాది రెండు విడతల్లోనిర్వహించిన జన్మభూమి, మావూరు కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను అధికారులు వడపోసి అర్హులను ఎంపిక చేశారు. వాటిని కమిటీల ఆమోదముద్ర కోసం పెండింగ్ ఎట్ గవర్నమెంట్ అంటూ పక్కన పెట్టేశారు. దీంతో తమకు పింఛన్లు అందుతాయో లేదో కూడా తెలియక వందలాది మంది ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం 3,03,875 పింఛన్లు ఉండగా, గతంలో తొలిగించిన పింఛన్లలో రోల్‌బ్యాక్ కింద మే నుంచి 4,725మందికి. పునరుద్ధరించగా, జూన్ నెల నుంచి మరో839రోల్‌బ్యాక్ పింఛన్లు పునరుద్ధరించనున్నారు.
కాగా కొత్త పింఛన్ల కోసం రూరల్ పరిధిలోనే అత్యధికంగా 3,41,826 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో తొలి విడతలో కొత్త పింఛన్ల కోసం 36,550 మంది అర్హులుగా గుర్తించి అధికారులు అప్‌లోడ్ చేశారు. వీటిని తిరిగి పరిశీలనకు జన్మభూమి కమిటీలకు ప్రభుత్వం పంపింది. వీరిలో ఎవరు గత ఎన్నికల్లో టీడీపీకి పనిచేశారు...ఎవరు తమ పార్టీకి సానుభూతిపరులు ఎవరు అన్నది వడపోసి చివరకు 17,414 మందిని లెక్కతేల్చారు. వీరికి పింఛన్లు మంజూరుచేయవచ్చునంటూ జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేశాయి. మిగిలిన 19,136 అర్హులే అయినప్పటికీ వారంతా టీడీపీ అనుకూలురు కాదంటూ అనర్హులుగా ప్రకటించి రిజక్ట్ చేశారు.
జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన 17,414 మందికి కొత్త పింఛన్ల జారీ కోసం గతనెలలోనే ప్రభుత్వానికి నివేదించింది. ఇక జీవీఎంసీ పరిధిలో రోల్‌బ్యాక్ పింఛన్లతో కలిపి ప్రస్తుతం 62వేలు ఉండగా,13వేల మంది దరఖాస్తు చేసుకోగా,వాటిలో కొత్త పింఛన్ల కోసం 7456 మందిని అర్హులుగా అధికారులు గుర్తిస్తే జన్మభూమి కమిటీలు 6006 మందికే ఆమోద ముద్ర వేశారు. ఇలా జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేసిన 23,420 పింఛన్లను జూన్ ఒకతో తేదీ నుంచి పంపిణీచేయాల్సి ఉంది.
కానీ రాష్ర్ట ఆర్థిక శాఖ వీటి మంజూరు విషయంలో ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మంజూరైన వారంతా కళ్లల్లో ఒత్తులేసుకుని మరికొంతకాలం నిరీక్షించక తప్పని పరిస్థితి. ఇలా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో రూ.3.54లక్షల మంది పింఛన్ల కోసందరఖాస్తు చేసుకుంటే అధికారులు పార్టీలకతీతంగా 44వేల మంది అర్హులుగా తేలిస్తే జన్మభూమి కమిటీలు వాటిలో 20వేల మందికి కోత పెట్టి కేవలం 24వేల మందికి మాత్రమే సిఫారసు చేశారు. ఒక్క పింఛన్ల విషయంలోనే కాదు..ఈ కమిటీలు వేలుపెట్టని శాఖంటూ లేదనే చెప్పాలి. ఇలా జన్మభూమి కమిటీల వ్యవస్థ సమాంతర అధికార వ్యవస్థగా వేళ్లూను కుంటుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అధికార యంత్రాంగానికి భవిష్యత్‌లో చేష్టలుడిగే పరిస్థితి ఏర్పడుతుంది.