
‘చంద్ర’గ్రహణం వీడేదెప్పుడో..!
►అందుకోసమే ఎదురుచూస్తున్నాం
► కేంద్ర పథకాల్లో జన్మభూమి కమిటీ పెత్తనమా?
► మా పార్టీని అణగదొక్కే కుట్ర జరుగుతోంది
► బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
రాయవరం : రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందకూడదనే కుట్ర జరుగుతోందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తెలిపారు. గురువారం ఆయన స్థానిక పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ స్వయం సిద్ధంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందన్నారు.
దేవాలయ పాలక మండలిలో బీజేపీ నేతలను నామినేట్ చేయాలని స్వయంగా దేవాదాయ మంత్రి సూచించినా ఫలితం లేకపోయిందన్నారు.ఐరాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో నడుస్తున్నామన్నారు. టీడీపీలో తెగతెంపులు చేసుకుంటున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘చంద్ర’ గ్రహణం వీడే రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులై జిల్లాలో నాలుగు లక్షల మంది ఆన్‌లైన్‌లో సభ్యత్వం తీసుకున్నారన్నారు.
రాష్ర్టంలో నిరంకుశ పాలన..
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా జన్మభూమి కమిటీలు అధికారం చెలాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తుంటే కనీసం పంచాయతీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం పెట్టక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
అవసరమైతే రోడ్డెక్కక తప్పదు..
కేంద్ర ప్రభుత్వ పథకాల నిష్పాక్షిక అమలుకు అధికారులతో తాడోపేడో తేల్చుకుంటామని, అవసరమైతే రోడ్డెక్కక తప్పదన్నారు. ముద్ర రుణాల మంజూరుకు బ్యాంకులు సహకరించడంలేదన్నారు. వచ్చే నెల ఆరవ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాట్రాతి జానకిరాంబాబు, బీజేపీ నేతలు నరాల రాంబాబు, వెలగల సత్తిరెడ్డి, గేలం సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.