
కలగా సొంతగూడు
మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనపడటం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా గృహ నిర్మాణంపై దృష్టి సారించడం లేదు. గతంలో నిర్మించిన గృహాలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వకుండా ఏడాదిగా పెండింగ్‌లోనే పెట్టారు. ఒక్కొక్క పక్కా గృహం నిర్మాణ వ్యయాన్ని రూ.1.50 లక్షలకు పెంచినట్లు ప్రకటించడమే తప్ప ఈ ఏడాది కాలంలో ఒక్క ఇంటికీ అనుమతులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఖరితో పేదలు గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
గతంలో నిర్మించిన ఇళ్లకైనా బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ లబ్ధిదారులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. గృహం నిర్మిం చుకున్న వారు బిల్లుల కోసం, దరఖాస్తు చేసుకున్న వారు అనుమతుల కోసం గృహనిర్మాణ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రభుత్వం కరుణించడం లేదు. గతంలో నిర్మించిన గృహాల్లో అవకతవకలు జరిగాయని, వాటిని జియోట్యాగింగ్ ద్వారా గుర్తిస్తున్నామని చెప్పడం తప్ప నూతన గృహాల నిర్మాణానికి ఎప్పటికి అనుమతులు వస్తాయో అధికారులకే తెలియని పరిస్థితి నెలకొంది. గుడిసెలు లేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత నూతన గృహాల మంజూరు ఇవ్వకుండా ఏడాది కాలంగా పేదల సహనానికి పరీక్ష పెడుతున్నారు.
చెల్లించాల్సిన బిల్లులు రూ.12.44 కోట్లు
2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి టీడీపీ అధికారం చేపట్టే నాటికి జిల్లాలో 1,80,171 గృహాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 1,57,231 గృహాలు పూర్తయ్యాయని నమోదయ్యాయి. వివిధ దశల్లో ఉన్న గృహాలు 22,940 ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వివిధ దశల్లో ఉన్న వాటిలో పునాదికి దిగువస్థాయిలో 3622, పునాది స్థాయిలో 11,870, లెంటల్ స్థాయిలో 1,785, రూఫ్ లెవల్లో 5,663 గృహాలు ఉన్నట్లు గృహనిర్మాణశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటికి ఆయా దశలను బట్టి బిల్లులు చెల్లిం పుల కోసం రూ.12.44 కోట్లు అవసరమవుతాయని ఈ నిధులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి చేరడమే తప్ప నగదు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇందిరా అవాస్‌యోజన ద్వారా 6,056 గృహా లను నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు.
జియో ట్యాంగింగ్ పేరుతో జాప్యం
జిల్లాలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయని, వాటిని జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఈ సమాచారాన్ని శాటిలైట్‌కు అనుసంధానం చేస్తున్నామని పాలకులు చెబుతూ వస్తున్నారు. ఇంకా 13,288 గృహాలకు సంబంధించిన వివరాలను జియో ట్యాగింగ్ పద్ధతికి అనుసంధానం చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2004వ సంవత్సరం నుంచి ప్రారంభమై పూర్తయిన గృహాలతో పాటు వివిద దశల్లో ఉన్న గృహాలకు సంబంధించి లబ్ధిదారుల ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంకా జిల్లాలో 25,922 గృహాలకు సంబంధించిన ఆధార్ నంబర్లను సీడింగ్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జియో ట్యాంగింగ్, ఆధార్ అనుసంధానం ప్రక్రియలు ఎప్పటికి పూర్తవుతాయనేది అధికారులకే తెలియాలి.
జన్మభూమి కమిటీలు పరిశీలించాకే బిల్లులు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గృహాల బిల్లులు చెల్లింపు ప్రకియను జన్మభూమి కమిటీలు పరిశీలించాకే చేపడతామని ప్రకటించింది. ఇందుకోసం గ్రామ, మండల, మునిసిపాటిటీ స్థాయిలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా జాప్యం చేయడం గమనార్హం. ప్రభుత్వం గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో, అనుమతులు ఇచ్చే అంశంలో సాచివేత ధోరణితో వ్యవ హరిస్తుండటంతో పేదలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నూతన గృహాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సంగతి ఎలా ఉన్నా గ్రామాలు, పట్టణాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు తాము సూచించిన వారికే గృహాలు మంజూరవుతాయని హడావుడి చేస్తూ దరఖాస్తుదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.