
సాక్షి, హైదరాబాద్: భారీగా బడ్జెట్ అంచనాలు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని పాత బకాయిలు నీడలా వెంటాడుతున్నాయి. ప్రగతి పద్దులోని కీలకమైన పథకాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఎక్కువ మొత్తం బాకీలు చెల్లించేందుకే సరిపోనున్నాయి. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ పెండింగ్ బిల్లుల సమస్య తీవ్రతరం కానుంది. అదనంగా నిధులు సమకూర్చకపోతే ఈ పథకాల అమలు తీరుపై ప్రభావం పడుతుందని ఆయా శాఖల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆసరా, బియ్యం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాం త్రీకరణ, వడ్డీలేని పంట రుణాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలకు ఈ గడ్డు పరిస్థితి కనిపిస్తోంది.
ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.1,400 కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ పథకానికి కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,282 కోట్లు కేటాయించింది. ఏటేటా స్కాలర్‌షిప్పుల చెల్లిం పులకు దాదాపు రూ.2,500 కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయి. ఈ లెక్కన కేటాయించిన బడ్జెట్‌లో పాత బకాయిలు చెల్లిస్తే.. మళ్లీ దాదాపు వెయ్యి కోట్లు పెండింగ్‌లో పడనున్నాయి. రేషన్ కార్డులపై పంపిణీ చేసే బియ్యం సబ్సిడీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల విభాగానికి రూ.3,800 కోట్లు బాకీ పడింది. వచ్చే ఏడాది సైతం బియ్యం సబ్సిడీకి రూ.2,200 కోట్లు అంచనా వ్యయమవుతుంది. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.2,744 కోట్లు కేటాయించటంతో బాకీలు సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
విద్యుత్ సబ్సిడీలపై ఇంచు మించుగా అలాంటి పరిస్థితి ఉత్పన్నమవనుం ది. విద్యుత్తు చార్జీలపై ఉన్న లోటు రూ.1,400 కోట్లు, 24 గంటల విద్యుత్ సరఫరాతో పడే భారం రూ.1,500 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వచ్చే ఏడాది విద్యుత్ సంస్థలకు రూ.2,900 కోట్లు చెల్లించాలి. ఇప్ప టికే రూ.6,000 కోట్లు పాత బకాయిలు ఇవ్వా ల్సి ఉంది. దీంతో ప్రస్తుతం కేటాయించిన రూ.4,984 కోట్లు బకాయిలకే సరిపోనున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల చెల్లింపు సైతం ప్రస్తుతం అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆడపిల్లల పెళ్ళిళ్లకు కానుకగా అందించాల్సిన ఈ ఆర్థిక సాయం, దరఖాస్తు చేసుకున్నాక ఏడాదికిగానూ అంద డం లేదనే ఫిర్యాదులున్నాయి.
ఈ పథకానికి భారీగానే నిధులు కేటాయించిన ప్రభుత్వం, ఆర్థిక సాయాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్లు ప్రకటించటంతో పెండింగ్ బకాయిలు, పెరిగిన అంచనా వ్యయంతో మళ్లీ ఎదురుచూపులు తప్పవనే ఆందోళనæ వ్యక్తమవుతోంది. రైతులకు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ వాటా గత ఏడాదిగా పెండింగ్‌లో ఉంది. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కూడా చిక్కుల్లో పడుతోంది. ఎస్సీ ఎస్టీలకు 95 శాతం సబ్సిడీపై ఇచ్చే ట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ.300 కోట్లు
పెండింగ్‌లో ఉన్నాయి.
ఖర్చు లేకుండా పాత అంచనాలు
నిరుడు బడ్జెట్‌లో కేటాయించిన కొన్ని పథకాలకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. దీంతో అప్పటి కేటాయింపులనే పునరావృతం చేశారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సబ్సిడీపై ఇచ్చే స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం నిరుడు రూ.వెయ్యి కోట్లకు పైగా కేటాయించింది. అందులో నిధులేమీ ఖర్చు చేయలేదు.
ఈసారి రూ.1,682 కోట్లు కేటాయించినట్లు మళ్లీ బడ్జెట్‌లో ప్రస్తావించింది. ఎంబీసీలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో నిధులు పెట్టింది. ఇప్పటికీ ఖర్చేమీ కాకపోవటంతో అప్పటి నిధులనే మళ్లీ పునరావృతం చేసింది. ఈ బడ్జెట్‌లోనూ రూ.వెయ్యి కోట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment