ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
పదిరోజుల్లోగా స్పందించకపోతే ఉద్యమం ఉధృతం: కృష్ణయ్య
హైదరాబాద్: రూ.850 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఈ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయపార్టీలు, విద్యార్థి, యువజన, బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రాష్ట్ర బంద్, కళాశాలల బహిష్కరణ, తదితర రూపాల్లో ఆందోళన తీవ్రతర ం చేస్తామని హెచ్చరించాయి. ఫీజు బకాయిలు చె ల్లించాలని, ఈ ఏడాది దరఖాస్తులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, రమ్య, సీపీఐ నేత రాంనర్సింహారావు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఉదయం ఆర్.కృష్ణయ్యకు బీసీ హాస్టల్ విద్యార్థి వెంకటేష్ పూలమాల వేసి దీక్షను ప్రారంభించగా, సాయంత్రం పొన్నాల లక్ష్మయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్ .కృష్ణయ్య మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.
రాజకీయాలకు అతీతంగా రావాలి: పొన్నాల
రాజకీయాలకు అతీతంగా పేదల పక్షాన పోరాడేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రె డ్డి మాట్లాడుతూ ఫీజుల విషయంలో ఏ ముఖ్యమంత్రీ వ్యవహరించని విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎవరి దీక్షకైనా మద్దతిస్తాం: వైఎస్సార్‌సీపీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు కోసం ఎవరు దీక్ష చేసినా పార్టీలకతీతంగా తమ పార్టీ మద్దతిస్తుందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.ఫీజు బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నీరుగార్చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు.