డ్వాక్రా సంఘాలకు రుణాలు బంద్
బ్యాంకులకు బకాయి పడితే కొత్త లోన్లు లేవు
కుటుంబ సభ్యులు బాకీ ఉన్నా కొత్త రుణాలివ్వం
సర్క్యులర్‌ను జారీచేసిన బ్యాంకర్లు
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమన్న కలెక్టర్
ఎస్‌హెచ్‌జీలకు నిలిచిన రుణ వితరణ
రుణాలు మాఫీ అవుతాయని చెల్లించని సంఘాలు
బ్యాంకుల తాజా నిర్ణయంతో బెంబేలు
కర్నూలు: డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు లభించడం లేదు. బకాయి పడిన సంఘాల్లోని సభ్యులకు కొత్త రుణాలు ఇవ్వమని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. పాత అప్పులు తీర్చేవరకూ కొత్త రుణాలు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. సంఘాల్లోని మహిళలతో పాటు వారి కుటుంబ సభ్యులు బ్యాంకులకు బకాయి ఉన్నా కొత్త రుణాలు ఇవ్వమని పేర్కొంటున్నాయి. ఈ మేరకు అన్ని శాఖలకు బ్యాంకు యాజమాన్యాలు ఉత్తర్వులను జారీచేశాయి. దీంతో డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు లభించడం లేదు. అయితే, ఇది ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమని.. కుటుంబ సభ్యులు బకాయి ఉంటే సంఘాలకు రుణాలు ఇవ్వమనడం సరికాదంటూ బ్యాంకులకు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్లేఖ రాశారు. అయినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి.
రుణాలు మాఫీ అవుతాయని...!
వాస్తవానికి డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయలేదు. అయితే, రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో అనేక డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు రుణాలను చెల్లించలేదు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు అలాగే ఉండిపోయాయి. సమయం మించిపోతుండటంతో ఈ రుణాలు కాస్తా నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)లుగా మారిపోతున్నాయి. వరుసగా మూడు నెలలపాటు రుణాలు చెల్లించకపోతే ఆ రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో పెరిగిపోతున్న ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకోవడానికి బ్యాంకులు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు కానీ... వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బ్యాంకుకు రుణం బాకీ పడి ఉంటే కొత్త రుణాలు ఇవ్వకూడదనేదే ఆ నిర్ణయం. ఈ నిర్ణయంతో డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు లభించడం లేదు. ఒకవైపు రుణాలు మాఫీ కాక... కొత్త రుణాలు రాకపోవడం ఒక సమస్య అయితే, మరోవైపు కుటుంబంలో ఎవరు అప్పు ఉన్నా కొత్త రుణాలు ఇవ్వకూడదన్న బ్యాంకుల నిర్ణయంతో డ్వాక్రా సంఘాలు బెంబేలెత్తిపోతున్నాయి.
ఇచ్చింది 28 శాతమే...!
వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా సంఘాలకు రూ. 712 కోట్ల మేర రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. అయితే, జనవరి చివరినాటికి కేవలం రూ. 201 కోట్ల రుణాల పంపిణీ మాత్రమే జరిగింది. అంటే కేవలం 28 శాతం మాత్రమే. పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు లభించక డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమ రుణాలను మాఫీ చేస్తాయని తాము చెల్లించలేదని... తీరా అవి మాఫీ కాకపోవడంతో ఎన్‌పీఏలుగా మారాయని వారు అంటున్నారు. ఎన్‌పీఏలుగా మారడంతో బ్యాంకులు కాస్తా కొత్త కొత్త నిబంధనలతో రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయని వాపోతున్నారు.
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధం!
బ్యాంకులు తీసుకున్న నిర్ణయంపై కలెక్టర్ విజయమోహన్ తీవ్రంగా మండిపడ్డారు. బ్యాంకుల నిర్ణయం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. కుటుంబ సభ్యులు బకాయి ఉంటే ఇతర సభ్యులకు రుణాలివ్వమని చెప్పడం సరికాదంటూ గతంలో ఆర్‌బీఐ సర్క్యులర్ నెంబరు 10ని జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిబంధనలను తుంగలో తొక్కుతూ రుణాలివ్వమని చెప్పడం సరికాదని ఇప్పటికే బ్యాంకర్లతో కలెక్టర్ పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన లేఖ కూడా రాసినట్టు తెలిసింది. అయితే, బ్యాంకులు మాత్రం దీనిని లెక్కపెట్టడం లేదు. ఎన్‌పీఏలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని... అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. మొత్తం మీద డ్వాక్రా సంఘాలకు కొత్త రుణాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
బ్యాంకులతో చర్చిస్తున్నాం
డ్వాక్రా సంఘాల్లోని వారే కాకుండా వారి కుటుంబంలోని ఇతర సభ్యులు రుణం బాకీ పడి ఉంటే కొత్త రుణం ఇవ్వమని బ్యాంకులు ఆదేశాలు జారీచేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇది సబబు కాదు అని ఇప్పటికే బ్యాంకులకు స్పష్టం చేశాం. గతంలో ఆర్‌బీఐ జారీచేసిన సర్క్యులర్ ప్రకారం కుటుంబంలోని ఇతరులు బాకీ ఉంటే... ఇతర కుటుంబ సభ్యులకు రుణాలు ఇవ్వలేమని చెప్పడం సరికాదు. ఇదే విషయాన్ని తాజాగా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్యాంకులకు స్పష్టం చేశాం. - రామకృష్ణ,
ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్‌డీఏ- వెలుగు
రుణం.. గగనం!
Published Tue, Feb 17 2015 2:44 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement