న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల ప్రక్షాళన కార్యక్రమంతో దేశ బ్యాకింగ్ రంగంలో వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గణనీయంగా పెరిగిపోగా, అవి కాస్త నెమ్మదిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–డిసెంబర్ కాలంలో ఇవి చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఫిక్కీ–ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తాజా సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 19 ప్రభుత్వరంగ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల నుంచి సర్వే కోసం అభిప్రాయాలను సేకరించారు. 58 శాతం మంది ఎన్‌పీఏలు పెరిగినట్టు పేర్కొనగా, అంతకుముందు నిర్వహించిన సర్వేలో 80 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు తెలిసింది. మెటల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల రంగాలకు ఇచ్చిన రుణాలు ఎక్కువగా ఎన్‌పీఏలుగా మారాయి.
తమ రుణాలను పునరుద్ధరించాలన్న అ భ్యర్థనలు ఎక్కువైనట్టు కేవలం 28 శాతం బ్యాంకులే తెలిపాయి. ఇది అంతకుముందు సర్వేలో 40 శాతం కావడం గమనార్హం. ఎన్‌పీఏలకు చేసే నిధుల కేటాయింపులకు పూర్తిగా పన్ను మినహాయింపు కల్పిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించాలని బ్యాంకులు కోరాయి. ‘‘కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించాలని చాలా వరకు బ్యాంకులు డిమాండ్ చేశాయి. అలాగే, మ్యాట్ (కనీస ప్రత్యామ్నాయ పన్ను)ను 15 శాతానికి తీసుకురావాలని కోరాయి. వ్యక్తులకు పన్ను మినహాయింపులు, రాయితీలను పెంచాలని కూడా డిమాండ్ చేశాయి. దీనివల్ల కార్పొరేట్, రిటైల్ రుణాలకు డిమాండ్ పెరుగుతుంది’’అని ఫిక్కి తన నివేదికలో పేర్కొంది. కాగా, భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు మారుతున్నందున బ్యాంకులు రుణాలకు సంబంధించి అదనంగా రూ.89,000 కోట్ల మేర కేటాయింపులు చేయాల్సి రావచ్చని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ పేర్కొంది.
తగ్గుతున్న మొండి బకాయిల భారం!
Published Thu, Jan 25 2018 12:19 AM | Last Updated on Thu, Jan 25 2018 12:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment