‘మెప్మా’ బినామీల దందా! | removal of the names of 250 people linked to Aadhaar | Sakshi
Sakshi News home page

‘మెప్మా’ బినామీల దందా!

Published Mon, Mar 6 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

removal of the names of 250 people linked to Aadhaar

చేతులు మారుతున్న ప్రభుత్వ నిధులు
రెండేసి బ్యాంకుల నుంచి రుణాలు..
ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు
ఆధార్‌ అనుసంధానంతో  250 మంది పేర్ల తొలగింపు


నర్సంపేట : నర్సంపేట నగర పంచాయతీ పరిధిలోని మురికివాడల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ద్వారా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల్లో బినామీల దందా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ని«ధులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత నెల నుంచి ఆధార్‌ అనుసంధానం చేస్తుండడంతో 250 మంది పేర్లను కూడా తొలగించారు. అయితే, ఇప్పటికే పలువురు బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు రెండు స్వయం సహాయ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకోని రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రుణాలను బ్యాంకులకు తిరిగి డబ్బులు చెల్లించడం లేదని చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ బ్యాంకుకు చెల్లించాల్సిన డబ్బును  కాజేయడంతో సంఘంలోని సభ్యుల నడుమ గొడవ జరిగింది.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు..
మహిళా స్వయం సహాయక సంఘాల్లో అక్రమాలను నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా సంఘాల్లోని బినామీలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నర్సంపేట మెప్మా సంస్థకు చెందిన 699 స్వయం సహాయక సంఘాల్లో 7,280 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 1800 మంది వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయగా 250 మంది పేర్లు రెండు సంఘాల్లో నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో వారిని పేర్లను తొలగించారు. తద్వారా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే పక్కదారి
మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడానికి గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇందిరాక్రాంతి పథకం(ఐకేపీ) పేరును ఇప్పుడు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)గా మార్చారు. దీనిద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వ రుణాలు ఇస్తోంది. మహిళలు బృందాలుగా ఏర్పడి వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం కల్పించింది. నర్సంపేట పట్టణంలోని 20 వార్డుల్లో దాదాపు 40వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో 699 స్వయం సహాయ సంఘాల్లో 7,280 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. ఒక్కో గ్రూపులో ఐదుగురి నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఒక్కో స్వయం సహాయక సంఘం సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణాలను ఇప్పిస్తోంది. ఈ రుణంతో కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందాల్సి ఉంటుంది. ఇలా నగర పంచాయతీకి సంబంధించి ఐదు బ్యాంకుల నుంచి 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.4.50 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం విధించగా... మెప్మా అధికారులు 575 సంఘాలకు రూ.4 కోట్ల రుణాలు ఇప్పించారు. అయితే, రుణాలు పొందిన కొందరు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్టు రెండు గ్రూపుల్లో పేరు నమోదు చేసుకోని రెండుసార్లు బ్యాంక్‌ రుణాలు తీసుకోని తిరిగి చెల్లించడంలేదు.

ఇంతకుముందు స్వయం సహాయక సంఘాల సభ్యులు అక్రమంగా రెండుచోట్ల రుణాలు తీసుకున్నా, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోయినా అధికారులు అంతగా పట్టించుకునే వారు కాదు. బ్యాంకు అధికారులు రెండు, మూడేళ్లకోసారి మారుతుండడంతో రుణాలు పొందిన మహిళా సంఘాల నుంచి బకాయిలు రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెబుతున్నారు. ఇలా కొన్నేళ్లుగా రూ.లక్షల్లో నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో బ్యాంక్‌ రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధార్‌ నంబర్లు అనుసంధానం చేయడంతో రెండు చోట్ల రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. తద్వారా ఒక సభ్యురాలు నివాసం ఉండే చోటే రుణం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని పరకాల, నర్సంపేట నగర పంచాయతీ సంఘాల్లోనూ çపూర్తిస్థాయిలో ఆధార్‌ అనుసంధానం చేస్తే అక్రమంగా రుణాలను పొందడాన్ని అరికట్టొచ్చని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement