
డిస్కం నిర్లక్ష్యం!
జిల్లాలో పేరుకుపోతున్న బకాయిలు
వసూలు కాని కస్టమర్ సర్వీసు చార్జీలు
ఉచిత విద్యుత్‌లోనే రూ.6.5 కోట్ల బకాయిలు
సీఎండీకి నివేదిక పంపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్
తిరుపతి రూరల్: జిల్లాలోని డిస్కం అధికారులు రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. బకాయిలు రూ.కోట్లలో పెరిగిపోతున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టకపోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తప్పుపట్టింది. వ్యవసాయ కనెక్షన్ల వినియోగదారుల నుంచే రూ.6.50 కోట్లు వసూలు చేయాల్సివున్నట్లు గుర్తించి, ఆ మేరకు డిస్కం సీఎండీకి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్ నివేదికను పంపారు.
అసలు కథ ఏంటంటే...
రైతులను ఆదుకునేందుకు నాటి ప్రభుత్వం 2004లో రైతులందరికీ ఉచిత విద్యుత్‌ని అందజేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం, సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేందుకు ఉచిత విద్యుత్‌ని పొందే ప్రతి వినియోగదారుడు ప్రతి నెలా హార్స్‌పవర్‌కి కేవలం రూ.30 మాత్రం కస్టమర్ సర్వీసు చార్జీల కింద చెల్లించాల్సి ఉంది. అంటే ఏడాదికి రూ.360 డిస్కంకు చెల్లించాలి. కానీ 2005 నుంచి ఈ కస్టమర్ సర్వీస్ చార్జీలను వసూలు చేయడంలో జిల్లాలోని డిస్కం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నారు.
జిల్లాలో రూ.6.50 కోట్ల బకాయిలు
జిల్లాలో తిరుపతి, తిరుపతి రూరల్, పుత్తూరు, చిత్తూరు, చిత్తూరు రూరల్, మదనపల్లె, పీలేరు మొత్తం ఏడు డివిజన్లలో 2,65,221 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 2005-06 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ కనెక్షన్లకు సంబంధించి కస్టమర్ సర్వీస్ చార్జీల కింద రూ.6.50 కోట్ల బకాయిలున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో గుర్తించారు. డిస్కం అధికారులు ఈ బకాయిలను వెంటనే వసూళ్లు చేయించాలని సూచించారు.
వసూలు చేస్తున్నాం...
జిల్లాలో వ్వవసాయ కనెక్షన్లకు సంబంధించి కస్టమర్ సర్వీస్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నది వాస్తవమే. వాటిని వసూలు చేస్తున్నాం. కరువు పరిస్థితుల వల్ల కొంత ఆలస్యంగా వసూలు అవుతున్నాయి.
- హరినాథ్‌రావు, ఎస్‌ఈ, డిస్కం తిరుపతి ఆపరేషన్ సర్కిల్