చేదెక్కిన ‘చక్కెర’ బతుకులు | Fluttering wage employees in 9 months | Sakshi
Sakshi News home page

చేదెక్కిన ‘చక్కెర’ బతుకులు

Published Mon, Aug 11 2014 4:48 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

Fluttering wage employees in 9 months

  •       9 నెలలుగా వేతనాల్లేక అల్లాడుతున్న ఉద్యోగులు
  •      400మంది ఉద్యోగులకు రూ.3.5కోట్ల బకాయిలు
  •      గతేడాది రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.9.87కోట్లు
  •      {పైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలిస్తున్న రైతులు
  •      ఈసారి ఇంకా ఉద్యోగులను రీకాల్ చేయని వైనం
  •      నేడు చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ
  •      పాలకమండలి సమావేశం
  • సాక్షి, చిత్తూరు:  ‘‘సూర్యప్రకాష్(పేరు మార్చాం) చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలో ఉద్యోగి. ఈయనకు 9 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఇతనికి  ముగ్గురు పిల్లలు. జూన్, జూలైలో పిల్లల చదువుకోసం ఫీజులు, దుస్తులు, పుస్తకాల కోసం 40వేల రూపాయలు  ఖర్చయ్యూరుు. జూన్‌లో 50వేల రూపాయలు అప్పు చేశాడు. ప్రతి నెలా ఇంటి బాడుగ, ఇతర ఖర్చులు కలిపి 10వేల రూపాయల వరకూ ఖర్చు వస్తోంది. జూన్‌లో చేసిన అప్పుతో కలిపి 1.7లక్షల రూపాయల అప్పులు తేలారుు. ఎవరినైనా అప్పు అడగాలన్నా అడగలేని పరిస్థితి. పేరుకు ‘చక్కెర ఫ్యాక్టరీ’లో ఉద్యోగం అనే మాటే కానీ...ప్రకాష్...ఆయన భార్యాపిల్లలు ఆర్థికంగా తీవ్ర వేదనపడుతున్నారు.’’
     
    ఈ ఫొటోలోని రైతుపేరు సురే ష్ బాబు. కార్వేటినగరం ఎం.ఎం విలాసం వాసి. గతేడాది 3ఎకరాల్లో చెరుకు సాగు చేశాడు. అప్పటికే 2012కు సంబంధించి 40వేల రూపాయల బకాయిలు ఉన్నాయి. అయినా గతేడాది చెరుకును ఫ్యాక్టరీకి తోలాడు. ఇప్పటికీ రెండేళ్లకు సంబంధించి 90వేల రూపాయల బకాయిలు రావాలి. పంట పెట్టుబడికి చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. గతేడాది పంటసాగుకు ఇంట్లోని బంగారు తాకట్టుపెట్టాడు. ఈ ఏడాది ఇద్దరు పిల్లల చదువుకు మళ్లీ అప్పు చేశాడు. పూర్తిగా కష్టాల ఊబిలో కూరుకుపోయాడు. దీనంతటికీ కారణం పంట దిగుబడి ఇంటికి రాకపోవడమే !
     
    సూర్యప్రకాష్ కుటుంబంలాగే చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలోని 400మంది ఉద్యోగులు వేదనపడుతున్నారు. నగరి, పుత్తూరు, కార్వేటి నగరంతో పాటు పలు మండలాల్లోని వందలాది మంది రైతులు అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం స్పందించదు. ఇదేంటి ? అని ప్రశ్నిస్తే గతంలో నష్టాలు వచ్చాయి ? అవి అలాగే కొనసాగుతున్నాయి ? అనే చెబుతున్నారు.
     
    ఉద్యోగుల బకాయిలు రూ.3.5 కోట్లు


    ఫ్యాక్టరీలో 400మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 120మంది పర్మినెంట్ ఉద్యోగులు. తక్కినవారు కన్సాలిడేటెడ్ ఉద్యోగులు. వీరందరికీ గతేడాది నవంబర్ నుంచి వేతనాలు ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 400మందిలో అప్పులేని ఉద్యోగి లేరని తోటి ఉద్యోగులు చెబుతుంటే... వారి జీవనం ఎంత కష్టంగా సాగుతుందో తెలుస్తుంది. కష్టాలు పడుతున్నవారు పత్రికలకు అభిప్రాయాలు ఇచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే..‘లేనిపోని కారణాలతో యాజమాన్యం వేధిస్తుంది’ అంటున్నారు.
     
    ఇప్పటి వరకూ ఉద్యోగుల రీకాల్ లేదు
     
    ఏటా జూన్‌లో ఉద్యోగుల రీకాల్ జరిగేది. ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా కన్సాలిడేటెడ్ ఉద్యోగులను రీకాల్ చేయలేదు. అక్టోబర్, నవంబర్ నుంచి సీజన్ మొదలవుతుంది. నవంబర్-ఫిబ్రవరిలో 600మంది ఉద్యోగులు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ రీకాల్‌పై ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
     
    ఈసారి చెరుకుసాగు తక్కువే..
     
    2012-13లో 1.05 లక్షల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి చేరింది. క్వింటాలు 1800 రూపాయలతో యాజమాన్యం డబ్బులు చెల్లించాలి. కొందరికి, కొద్దిమేర మాత్రమే డబ్బు చెల్లించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం 3.4 కోట్లు ఫ్రీలోన్ ఇచ్చినా బకాయిలు చెల్లించలేకపోయారు. 2013-14లో రైతులు 47వేల టన్నుల చెరుకు ఫ్యాక్టరీకి తోలారు. దీనికిగాను టన్నుకు రూ.2100చొప్పున 9.87కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 50వేల టన్నుల చెరుకు పంటకు ఫ్యాక్టరీ రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంది. అయితే పాత బకాయిలు చెల్లించకపోతే చెరుకును రైతులు మరో ఫ్యాక్టరీకి తరలించేందుకు వెసులుబాటు ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు రైతులు ఎస్‌ఆర్ పురం మండలం నెళవాయిలోని ‘సాగర్ షుగర్స్’కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఫ్యాక్టరీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఇటీవల రామకృష్ణ నేతృత్వంలో కొత్త పాలకవర్గం కొలువుదీరింది.
     
    ఉద్యోగుల జీతాలతో పాటు రైతుల బకాయిలు చెల్లించాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు, రైతులకు దాదాపు 13 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం యాజమాన్యానికి ఇబ్బందే! ఈ క్రమంలో ప్రభుత్వం ఆదుకుని ఫ్యాక్టరీని గట్టేక్కించాల్సి ఉంది.
     
     బకాయిలు ఉన్నాయి....నేనూ కొత్తగా వచ్చాను
     ఉద్యోగులు, రైతులకు బకాయిలు ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. సోమవారం జరిగే పాలకమండలి సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తా!
     -మల్లికార్జునరెడ్డి, ఎండీ
     
     నెళవాయికి చెరుకు తోలుతున్నా సార్!
     ఐదెకరాల్లో చెరుకుసాగు చేశా ! నాకు చిత్తూరు ఫ్యాక్టరీ వాళ్లు 25వేల రూపాయల బకాయిలు ఇవ్వాల.! మేమే అప్పు చేసి పంటసాగు చేస్తే.. మా పంట తీసుకుని మాకు అప్పు పెడితే ఎట్టా. అందుకే నెళవాయి ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తుండా!
     -దేశయ్య, పాదిరికుప్పం, కార్వేటినగరం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement