ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5,000 కోట్ల దాకా బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఫీజుల పథకానికి అర్హులైన విద్యార్థుల సంఖ్య 16 లక్షల దాకా ఉంది. పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి దిక్కు తోచటం లేదు.
రాష్ట్రంలో అంగన్‌వాడీలకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో దాదాపు రూ.50 కోట్ల దాకా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు మరో రూ.10 కోట్ల దాకా కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది.
సాక్షి, అమరావతి: ఒకపక్క సొంత ప్రచారం, ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానాలు, ఓట్ల పథకాల కోసం డబ్బులు కుమ్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అత్యవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా ఇవ్వకపోవడంతో పిల్లల చదువులు, వివాహాలు, ఇంటి కొనుగోలు లాంటివి తలపెట్టిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కష్టార్జితం డబ్బులను చెల్లించకుండా అవస్థలకు గురి చేస్తున్న టీడీపీ సర్కారు ఓట్ల పథకాలు, ప్రచారం కోసం నిధులను మళ్లిస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత నెల రోజులుగా అన్ని రకాల బిల్లులను నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించిన ఓట్ల పథకాలు, ఇతర కమీషన్లు వచ్చే వాటికి మాత్రమే చెల్లింపులు చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికశాఖ రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన బిల్లులను కూడా చెల్లించకుండా ముఖ్యమంత్రి చెప్పినట్లు రాజకీయ అవసరాలకే నిధులు విడుదల చేయడం ఎప్పుడూ చూడలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు అన్ని రకాలకు చెందిన దాదాపు రూ.15,000 కోట్ల మేరకు బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
జీవోలతో సరి..
ఉద్యోగుల భవిష్య నిధికి ప్రతి నెలా వారి వేతనాలను నుంచి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. దీన్ని పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఉద్యోగులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు ఆర్థికశాఖ అనుమతితో జీవోలు జారీ చేస్తారు. అయితే జీవోలు జారీ అవుతున్నా ఈ బిల్లులను ట్రెజరీల్లో పాస్ చేయకపోవడంతో అత్యవసరాల కోసం దాచుకున్న డబ్బులు అక్కరకు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్లులు వందల సంఖ్యలో ఉంటాయని ఒక్కో బిల్లు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటికి చెల్లింపులను నిలిపివేస్తూ ఎన్నికల ముందు ప్రకటించిన ఓట్ల పథకాలకు అప్పులు చేసి మరీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగుల వాటా డబ్బులు మళ్లింపు!
ప్రభుత్వ ఉద్యోగులకు వందల సంఖ్యలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల చెల్లింపులను కూడా ఆర్థికశాఖ నిలిపివేసింది. మరోపక్క నగదురహిత వైద్య చికిత్స కోసం తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇన్సూరెన్స్ సంస్థకు జమ చేయలేదు. ఉద్యోగుల వాటా సొమ్ముతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా మరో రూ.400 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఉద్యోగుల వాటా సొమ్మును జమ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో నగదు రహిత వైద్య సేవలు అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులకు అత్యవసర మందుల కోసం ఇవ్వాల్సిన రూ.180 కోట్లను కూడా పెండింగ్‌లో పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏకంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పలుకుబడి కలిగిన వారికి మాత్రమే ఈ బిల్లులను చెల్లిస్తున్నారు. పేదలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోవడంతో వైద్య ఖర్చులు పెనుభారంగా పరిణమించాయి. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను కూడా ఇవ్వకుండా ఆర్థికశాఖ నిలుపుదల చేసింది.
ఉపాధి కూలీలకు బకాయి రూ.360 కోట్లు
కేంద్ర నిధులతో అమలయ్యే ఉపాధిహామీ పథకం కింద పనిచేసే కూలీలకు కూడా రోజు వారీ కూలీ డబ్బులను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం గమనార్హం. ఉపాధి హామీ కూలీలకు రూ.360 కోట్ల మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కూలీలకు వేతనాలు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఆర్థికశాఖకు విజ్ఞప్తి చేసింది.
కాంట్రాక్టు లెక్చరర్లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పోలీసులకు మొండిచెయ్యి...యూనివర్శిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు కూడా గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిలిపివేశారు. అసెంబ్లీలో ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న ఉద్యోగులకు కూడా గత మూడు నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. పోలీసులకు టీఏ, డీఏ బిల్లులతోపాటు ఆర్జిత సెలవుల బిల్లులను కూడా చెల్లించకుండా నిలుపుదల చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి చెందిన వస్తువులకు బిల్లులను కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశారు.
‘పసుపు–కుంకుమ ఈవెంట్’కు రూ.32 కోట్లు!
డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ పేరుతో ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన పోస్ట్ డేటెడ్ చెక్కుల పంపిణీ ఈవెంట్ కోసం ప్రభుత్వం దాదాపు రూ.32 కోట్లు వ్యయం చేయడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. రోజువారీ కూలీలకు వేతనాలు ఇవ్వకుండా నిలిపివేస్తూ ఈవెంట్ల పేరుతో కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఎలా బతకాలి?
మూడు నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆయాలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు సుమారు రూ. 50 కోట్ల దాకా వేతన బకాయిలున్నాయి. కిరాణా సరుకుల బిల్లులు ఏడాదిగా రూ.కోట్లలోనే పెండింగ్‌లో ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు సుమారు రూ.10 కోట్ల వరకు అద్దె బకాయిలు చెల్లించాలి. అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సొంత డబ్బులతో అద్దెలు కడుతున్నారు. వాళ్లంతా ఎలా బతకాలి? వెంటనే జీతాల బకాయిలు చెల్లించకుంటే మరోసారి ఆందోళన చేపడతాం.
– కె.సుబ్బరావమ్మ (అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి)
సెప్టెంబర్ నుంచి పెన్షన్ రావాలి...
నేను గత జూలైలో రిటైర్ అయ్యా. పెన్షన్ ఆగస్టు నెలకు సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది. సెప్టెంబర్ నుంచి పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది.
– నాగభూషణం (రిటైర్డ్ తహసీల్దార్, విశాఖపట్నం)
కూలీల పొట్టకొడుతోంది..
ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీల వేతనాలను చెల్లించకుండా పెడింగ్‌లో పెట్టింది. రాయలసీమతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 90 శాతం కరువు మండలాలున్నాయి. ఇక్కడ 150 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు నెలలుగా రూ.360 కోట్ల మేర కూలీ బకాయిలను చెల్లించకపోవడంతో పొట్టకూటి కోసం 12 లక్షల మంది వలస వెళ్లారు. ఉపాధి హామీ నిధులను ఏకంగా స్టేడియంల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం దారుణం. – వి.వెంకటేశ్వర్లు (రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి)
నెల రోజులైనా పీఎఫ్ డబ్బులు అందలేదు..
చిత్తూరు జిల్లా సవరంబాకం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నా. అనారోగ్యంతో ఉన్న మా చిన్నమ్మ వైద్య చికిత్స కోసం పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు అందలేదు. – ఎన్ లింగయ్య, హెచ్‌ఎం, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా.
దాచుకున్న డబ్బులపైనా ఆంక్షలా
అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందుకు వీలుగా ఉద్యోగులు దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణం. ఆరు నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాఖలు చేసుకున్న దరఖాస్తులను నిలిపివేయడంతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. వైద్య సేవల కోసం ఉద్యోగులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నా బీమా కంపెనీకి కట్టకుండా దారి మళ్లించడంతో ఆస్పత్రుల్లో చికిత్స అందడం లేదు. –వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు)
ఫ్రీజింగ్‌తో ఆగాయంటున్నారు..
కుటుంబ పరిస్థితుల వల్ల దాదాపు ఏడేళ్ల సర్వీసును వదులుకుని గతేడాది వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నా. గ్రాట్యూటీ, పెన్షన్ బిల్లు పాస్ అయ్యాయి. మిగిలిన బిల్లులు పాస్ కాలేదు. ఫ్రీజింగ్ వల్ల ఆగిపోయాయంటున్నారు. నాకు దాదాపు రూ.ఐదారు లక్షల వరకు రావాల్సి ఉంది.
– సూర్యప్రకాశరావు (రిటైర్డ్ ఏఓ, విశాఖపట్నం)
Comments
Please login to add a commentAdd a comment