సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మరింత నిరీక్షణ తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అటు సంక్షేమ శాఖల వద్ద భారీగా బిల్లులు పేరుకుపోగా.. ఇటు సంక్షేమశాఖలు ఈపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో క్లియర్ చేసిన బిల్లులకూ ట్రెజరీల్లో చెల్లింపులు జరగని పరిస్థితి నెలకొంది. దీనితో కాలేజీల యాజమాన్యాల నుంచి ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సంక్షేమ శాఖల గణాంకాల ప్రకారం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి రూ.1,867.66 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.460.96 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2021–22కు సంబంధించి 1,406.70 కోట్లు చెల్లించాలి. ఇక 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ మొదలుకాలేదు.
ట్రెజరీలో ఆగిన రూ.560 కోట్లు
పోస్ట్‌మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలతోపాటు అర్హత ఉన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను ముందుగా కాలేజీ యాజమాన్యాలు పరిశీలించి ఆమోదం కోసం సంక్షేమశాఖ అధికారులకు పంపుతాయి. సంక్షేమశాఖల అధికారులు వాటిని పరిశీలించాక ఆమోదించి నిధుల విడుదల కోసం ట్రెజరీకి బిల్లులు పంపుతారు.
ట్రెజరీ అధికారులు వాటిని పరిష్కరించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు సుమారు రూ.560.16 కోట్లకు సంబంధించిన బిల్లులను ట్రెజరీకి పంపగా.. అధికారులు ఆమోదించి టోకెన్లు జనరేట్ చేశారు. కానీ ఆర్థికశాఖ విధించిన ఆంక్షలతో నిధుల విడుదల చివరిదశలో నిలిచిపోయింది. ఆంక్షలు సడలించాకే నిధులు విడుదలవుతాయి.
చెల్లింపుల్లో పెరుగుతున్న జాప్యం
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చెల్లింపులు ఒక ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఏదైనా విద్యా సంవత్సరం ముగియగానే.. ఆ ఏడాదికి సంబంధించిన నిధుల చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. కానీ కోవిడ్ మహమ్మారి తర్వాత కాలంలో చెల్లింపుల్లో జాప్యం పెరిగింది. ప్రస్తుతం 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు దాదాపు 20 శాతం చెల్లించాల్సి ఉంది. 2021–22కు సంబంధించి 50 శాతం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా చెల్లింపులు మొదలుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment