రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్‌లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడు.
కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు.
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది.
బకాయిలు రూ.4,043.19 కోట్లు
మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది.
బీసీ విద్యార్థులవే అధికం
ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి.
♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు.
♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి.
టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు...
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్‌లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్‌మెంట్‌కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment