న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ బాట పట్టిన ఎయిరిండియాకు చెందిన ఇంధన చెల్లింపులు తదితర బకాయిలు అనుబంధ సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్‌ఎల్)కు బదిలీకానున్నాయి. రూ. 16,000 కోట్ల విలువైన ఇంధన బిల్లులు తదితరాలు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. చమురు కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, వెండార్లు తదితరాలకు బిల్లులు చెల్లించవలసి ఉన్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.
ప్రయివేటైజేషన్‌లో భాగంగా ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకోనున్న సంగతి తెలిసిందే. కంపెనీ పగ్గాలను టాటా గ్రూప్‌నకు అప్పగించేముందుగానే బకాయిల బదిలీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఎయిరిండియాకు చెందిన కీలకంకాని ఆస్తులను ఎస్‌పీవీగా ఏర్పాటు చేసిన ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేసేందుకు గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎయిరిండియా విక్రయానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. భవనాలు, భూములు తదితర ఆస్తులతోపాటు ఎయిరిండియా రుణాలలోనూ 75 శాతంవరకూ ఎస్‌పీవీకి బదిలీ చేయనుంది.
డిసెంబర్‌లోగా బ్యాలెన్స్ షీట్...
ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు బదిలీ చేసే ముందు డిసెంబర్ నాటికి ప్రభుత్వం బ్యాలెన్స్‌షీట్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మదింపులో ఇతర బకాయిలు(లయబిలిటీస్) ఏమైనా ఉంటే వీటిని సైతం ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనుంది. కాగా.. ఆగస్ట్ 31కల్లా ఎయిరిండియా రుణ భారం రూ. 61,562 కోట్లు. వీటిలో టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రయివేట్ లిమిటెడ్ రూ. 15,300 కోట్ల రుణాలను టేకోవర్ చేయనుంది. మిగిలిన రూ. 46,262 కోట్ల రుణాలు ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ కానున్నాయి.
సంస్కరణలకు సంకేతం
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై సీఐఐ
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణతో సంస్కరణల విషయంలో మార్కెట్లు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచి్చందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బ్యాంకింగ్ విభాగంలో ప్రభుత్వం ఎంపిక చేసిన రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు సరైన సమయంగా అభిప్రాయపడింది. ‘‘ఎన్నో ప్రయత్నాల తర్వాత ఎయిర్ ఇండియాను విజయవంతంగా విక్రయించడం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విషయమై ప్రతిష్టాత్మక ప్రణాళికకు తాజా ఉత్సాహాన్నిచి్చంది’’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ప్రభుత్వం అనుకున్నట్టుగా పూర్తి చేయగలదని, భవిష్యత్తు విక్రయాల్లో బిడ్డింగ్‌ను ప్రోత్సహించగలదన్న విశ్వాసాన్ని తాము కలిగించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment